కాకరకాయ కహానీ ;- డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

  ఒకప్పుడు పళ్ళు , కూరగాయలన్నీ ఒకే రంగులో, ఒకే ఆకారంలో , ఒకే రుచితో వుండేవట. మానవులు అవి తినీ తినీ అలసిపోయారు. ఏ చెట్టు చూసినా కాయలతో నిండుగా కళకళలాడుతా వుండేది... కానీ దేనినీ తినబుద్ధి అయ్యేది కాదు. ఆకలితో సావలేక తప్పనిసరై తిట్టుకుంటా, బాధపడతా అవి తింటా వుండేవారు. అది గూడా ఏదో తిన్నాం అంటే తిన్నాం అంతే. పళ్ళు కాయలు కొమ్మలపైనే పండి రాలిపోతా వుండేవి. మనుషులు తమను సరిగా తినకపోవడంతో పళ్ళు కాయలు అన్నీ బాధతో కుమిలిపోతా వుండేవి.
ఒకసారి నారదుడు భూమిపైన మనుషులు ఎలా బతుకుతా వున్నారో చూద్దామని దేవలోకం నుంచి కిందికి దిగి వచ్చాడు. మనుషుల మొహాల్లో కళ లేదు.అంతా దిగులుగా నీరసంగా కనబడ్డారు. అది చూసి నారదుడు కొందరిని పిలిచి ఎందుకు మీ మొహాలు అలా వాడిపోయి వున్నాయి. కళ్ళముందు అంత తిండి దొరుకుతావున్నా మీ డొక్కలు ఎందుకు అలా లోపలికి పీక్కుపోయాయి. ఏం జరిగింది అని అడిగాడు.
ఏం చేద్దాం సామీ ... ఈ చప్పటి తిండి తినీ తినీ మొహం మొత్తిపోయింది. నోటిలో పెట్టుకుంటే చాలు వాంతికి అవుతావుంది. బతకడానికి గతిలేక అలాగే బలవంతంగా తింటావున్నాం గానీ కోరికతో కాదు అన్నారు.
ఆ మాటలకు నారదుడు... నిజమే ఇలా యెప్పుడూ గానుగెద్దులా ఒకే తిండి తింటావుంటే బతుకులో మజా ఏముంటాది. పూలకు రకరకాల వాసనలు వున్నట్టు, చేపలకు రకరకాల రంగులు ఉన్నట్టు, కాయలకు కూడా రకరకాల రుచులు వుంటే ఎంత బాగుంటాది అనుకొని పోయి దేవునికి జరిగిందతా చెప్పాడు.
దేవుడు కూడా మనుషులు చెప్పింది నిజమే గదా అనుకున్నాడు. దాంతో ఒక మంచి రోజు చూసుకొని ఒకొక్క కాయకు ఒకొక్క ఆకారం, ఒకొక్క రుచి ఇవ్వసాగాడు. దాంతో కొన్ని కాయలు తియ్యగా మారగా, మరికొన్ని పుల్లగా అయ్యాయి. ఇంకొన్ని చేదుగా మారగా మరికొన్ని వగరుగా మారాయి. పండు పండుకూ మరలా రుచుల్లో తేడా వచ్చింది. పనస పండుదొక తీపైతే మామిడి పండుదొక తీపు. జామపండుదొక తీపైతే సపోటా పండుదొక తీపు. ఒక పండు వున్నట్టు మరొక పండు వుండదు. ఒక కూరగాయ వున్నట్టు ఇంకొక కూరగాయ వుండదు. రంగులో, వాసనలో, ఆకారంలో, పరిణామంలో తేడా వచ్చేసింది. లోకంలో యెన్ని రకాల కూరగాయలు, పళ్ళు వున్నాయో అన్ని రకాల రుచులు కొద్ది కొద్ది తేడాలతో వచ్చేశాయి.
ఇక మానవుల ఆనందానికి హద్దే లేదు. సంతోషంతో ఎగిరి గంతులు వేశారు. రోజూ రకరకాల పళ్ళు, కూరగాయలు తింటా వేడుక చేసుకోసాగారు. చెట్టులన్నీ తమ కాయలు మనుషులు పోటీలు పడి తింటావుంటే ఆనందంతో మురిసిపోయాయి.
అన్నీ ఆనందంగా వున్నా కాకరకాయ ఒక్కటి చాలా దిగులుగా వుంది. మనుషులు యెవరూ దాని దరిదాపులకు కూడా రావడం లేదు. ఆఖరికి పశువులు గూడా దూరం నుంచే వాసన చూసి వెళ్ళిపోతా వున్నాయి. ఒక్కసారిగా దానికి ఒంటరితనం చుట్టేసింది. ఎందుకంటే దానికి భయంకరమైన చేదు రుచి వచ్చేసింది. నోటిలో పెట్టుకుంటే చాలు యెవరైనా సరే యాక్‌ థూ అని వుమ్మేయ వలసిందే. దాంతో అదొక పనికిరాని కాయలాగా అందరూ పట్టించుకోవడం మానేశారు.
మనిషయినా చెట్టయినా పుట్టినాక పదిమందికి వుపయోగపడాల. అలా వుపయోగపడనప్పుడు బతికినా ఒకటే చచ్చినా ఒకటే అనుకోని దేవుని దగ్గరికి బైలుదేరింది. కొండలు, గుట్టలు, నదులు, వాగులు అన్నీ దాటుకుంటూ ఆఖరికి దేవుని దగ్గరికి చేరింది. దానిని చూసి దేవుడు... యేమి కాకరకాయా... ఏమిలా వచ్చావు. మొహంలో అస్సలు కళ లేదు. ఏంది నీ బాధ. హాయిగా భూలోకంలో మనుషులతో, పశువులతో కలసి కమ్మగా వుండక ఇలా కిందామీదా పడతా ఇంత దూరం వచ్చావు అని అడిగాడు.
దానికి కాకరకాయ కళ్ళనీళ్ళతో ... నీకేం సామీ ఎన్నయినా చెబుతావు. అక్కడ భూలోకంలో మనుషుల సంగతి పక్కన పెట్టు, కనీసం పశువులు కూడా నన్ను కన్నెత్తి చూడ్డం లేదు. పలకరించేవారు ఎవరూ లేక బతుకు మీద ఆశనే పోతా వుంది. ఇదంతా నీవల్లే అంటూ జరిగిందంతా చెప్పింది.
అది విన్న దేవుడు ... అరెరే... నువ్వు చెప్పింది నిజమే. నావల్ల నువ్వు ఎంత బాధ పడ్డావు. దేవుడైనా మనిషైనా ఇతరులను బాధ పెట్టినా , తప్పు చేసినా తలవంచుకొని నిలబడ వలసిందే. నా పొరపాటుకు మన్నించు. సరే జరిగిపోయిందాన్ని తలచుకొని బాధపడడం కన్నా జరగబోయేదాని గురించి ఆలోచించడం మేలు. చెప్పు... నీకే రుచి కావాలి. మధురమైన మామిడిపండును మించిన మనోహరమైన తీయదనాన్ని ఇవ్వనా, తలచుకోగానే సర్రున నోటిలో నీరు వూరిపోయేలా చింతపండును మించిన పులుపుదనాన్ని ఇవ్వనా. నోటిలో పెట్టి కొంచం కొరకగానే మంటకు సర్రున కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా మిరపకాయను మించిన కారం ఇవ్వనా... చెప్పు నీకేం కావాలి అన్నాడు.
దానికి కాకరకాయ చిరునవ్వు నవ్వి ... వేరే కాయల రుచులు నాకెందుకు సామీ... నా చేదు ఇంచు కూడా తగ్గకుండా ఇలాగే వుండనీ. కానీ మానవులు నన్నే కాక నాలాగే చేదుగా వుండే ఇతర కాయలను కూడా తినేలా వరం ఇవ్వు. అది చాలు అనింది.
దేవుడు బాగా ఆలోచించి ... సరే అయితే ... నీకు ఇప్పటినుంచీ రోగాలను నయంచేసే అనేక ఔషధ గుణాలు అలవడతాయి. దాంతో మానవులంతా నువ్వెంత చేదుగా వున్నా ఎగబడి తింటారు. సరేనా అన్నాడు.
కాకరకాయ సంబరంగా తల ఊపింది.
ఆరోజునుంచీ మానవులు తమ జబ్బులు నయం చేసుకోవడం కోసం పళ్ళతో బాటు ఎంత చేదుగా వున్నా కాకరకాయలు కూడా తినడం మొదలుపెట్టారు.
***********

కామెంట్‌లు