జయహో... మరుగుజ్జు మాంత్రికునికీ - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక యువకుడు వుండేటోడు. వాడు చాలా అందగాడు. తెలివైనవాడు. చురుకైనవాడు. అన్నింటికీ మించి గొప్ప వీరుడు. ఆరడుగుల ఎత్తుతో వేటాడే సింహంలా వుండేటోడు. వానికి రాని విద్యంటూ లేదు. కత్తిసాము, కర్రసాము, గుర్రం స్వారీ, ధనుర్విద్య అన్నీ నేర్చేసుకున్నాడు. ఆకాశంలో పోతున్న పిట్టనైనా, నీళ్ళలో ఈదులాడే చేపనైనా ఒక్క బాణంతో మెరుపులా కొట్టగలడు. మదమెక్కిన ఏనుగునైనా, ఆకలితో వున్న చిరుతనైనా సయ్యంటే సయ్యంటూ ఒంటి చేతితో ఎదిరించి నిలబడగలడు. వాళ్ళ నాయన కుమ్మరి. దాంతో తాను గూడా కుండలు, కూజాలు చేయడం నేర్చుకొని తండ్రికి సాయంగా వుండేటోడు.
ఒకరోజు వాళ్ళ ఊరికొచ్చిన ఒక రాజభటుడు వాని గంభీరమైన ఆకారం, యుద్ధ విద్యలు చూసి “రేయ్... నేను ఎంతో మంది వీరులను చూసినా. కానీ నీలాంటోడు ఏడేడు పద్నాలుగు లోకాల్లో ఎక్కడా వుండడు. నీలాంటి వీరుడు వుండవలసింది ఇక్కడ కాదు... మన నల్లమల అడవికి అరవై మైళ్ళ దూరంలో కందనవోలు రాజ్యముంది. ఆ రాజుకి ఒక్కతే కుమార్తె, కొడుకుల్లేరు. తాను పెట్టిన మూడు పందేలలో గెలిచిన వానికి కుమార్తెతో బాటు, అర్ధ రాజ్యం గూడా ఇస్తానని దండోరా వేయించాడు. వీరులెందరో రొమ్ములిరుచుకోని పోతావున్నారు గానీ గెలిచినోళ్ళు ఎవరూలేరు. పో... పోయి నీ అదృష్టాన్ని పరీక్షించుకో. పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకురా. బతుకుతే రాజుగా
మీసం తిప్పుతూ బతుకు. లేదంటే వీరునిలా వెన్ను చూపకుండా చావు. అంతేగానీ సముద్రమంత శక్తి పెట్టుకొని పిల్ల కాలువలా ఈ ఊర్లోనే వుండిపోకు" అన్నాడు.
దాంతో ఆ యువకుడు తరువాత రోజు అమ్మానాన్నల కాళ్ళు మొక్కి “అమ్మా.... నెత్తిన కుండలు పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్మే నీవు... ఇదే వీధుల్లో బంగారు పల్లకీలో కాలుమీద కాలేసుకొని తిరిగే రోజు త్వరలో తెస్తా. చూస్తూ వుండు” అంటూ వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని, గుర్రమెక్కి ఆయుధాలతో బైలుదేరాడు.
ఆ యువకుడు అలా పోతావుంటే దారిలో ఒక పెద్ద భయంకరమైన అడవి వచ్చింది. ఆ అడవిలో ఒకొక్క అడుగే జాగ్రతగా వేసుకుంటూ పోతావుంటే ఒకచోట “నాయనా... నన్ను కాపాడు, బాబూ... నన్ను కాపాడు" అంటూ ఆకాశంలోంచి అరుపులు వినబన్నాయి. అదిరిపడి అరుపులు వచ్చినవైపు చూశాడు. ఒక ఎత్తయిన చెట్టుకి చిటారు కొమ్మన ఒక మూడడుగుల మరుగుజ్జు గాలిలో వేలాడుతా కనబడ్డాడు. విడిపించుకోడానికి వీలు లేకుండా కాళ్ళూ చేతులు గట్టిగా కట్టేసి వున్నాయి. ఆ యువకుడు బాగా పరిశీలించి అర్ధ చంద్రాకార బాణం తీశాడు. గురి పెట్టి ఆ చెట్టు కొమ్మను బలమంతా ఉపయోగించి లాగి ఒక్కటి కొట్టాడు.
అంతే... కొమ్మ ఫటుక్కుమని తెగి అంత పైనుండి సర్రున కింద పడసాగాడు. కింద ఒక పెద్ద రాయి వుంది. దాని మీద పడితే మొహం పచ్చడి పచ్చడి కావడం ఖాయం. మరుగుజ్జు భయంతో కెవ్వుమని కేక పెట్టాడు. సరిగ్గా వాడు భూమిని తాకేంతలో ఆ యువకుడు మరుగుజ్జును గాలిలోనే అందుకొని సక్కగా నిలబెట్టాడు. కట్టేసిన కట్లన్నీ విప్పేశాడు.
“నిన్ను ఎవరలా అంత ఎత్తున కట్టేశారు. ఏమి సంగతి" అన్నాడు. దానికా మరుగుజ్జు “విద్య వినయాన్ని అందించాలే గానీ తల పొగరు పెంచగూడదు. నేను ఒక గంధర్వున్ని. మా గురువు వద్ద ఎన్నెన్నో మాయా విద్యలు నేర్చుకున్నాను. దాంతో నా అంతటోడు ఎవడూ లేడని విర్రవీగేటోన్ని. ఒకసారి ఒక మునివద్ద ఒక మాయా చెట్టును చూశాను. దానికి ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు విరగకాసేవి. ముని వాటిని తాను తిని, అడవిలోని జంతువులకు, అటు వైపు వచ్చే బాటసారులకు, పేదలకు ఇస్తూ వుండేవాడు. నాకా పళ్ళ చెట్టు నచ్చి ఒకసారి ముని స్నానానికి చెరువుకు పోయిన సమయంలో దొంగతనంగా దానిని కూకటి వేళ్ళతో సహా పెకిలించి ఎవరికీ కనబడని రహస్య ప్రదేశంలో దాచాను.
కానీ ముని తన దివ్వదృష్టితో ఆ విషయాన్ని గమనించాడు. వెంటనే నేనున్న చోటుకి వచ్చి “ఒరేయ్ పాపీ... మన మంత్ర శక్తుల్ని మంచికే తప్ప చెడుకు ఎప్పుడూ ఉపయోగించకూడదు. నా తపః శక్తి అంతా ఉపయోగించి ఆ చెట్టుకు రకరకాల కాయలు కాయిస్తున్నది నేను తినడానికి కాదు. పదిమంది ఆకలి తీర్చడానికి. అటువంటి చెట్టును దొంగతనంగా ఎత్తుకొచ్చావు. నీలాంటి వాడు ఈ భూమ్మీద వుండటం లోకానికి మంచిది గాదు” అంటూ నన్ను మరుగుజ్జుగా మార్చి, ఈ చెట్టుకొమ్మకు తగిలించాడు. నా మంత్రాలు నాకు మతికి రాకుండా శాపం పెట్టాడు. ముని కాళ్ళమీద పడి కనికరించమని కళ్ళనీళ్ళు బెట్టుకుంటే చివరకు జాలిపడి “చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. నిన్ను ఎవరైనా కాపాడేంత వరకు అలాగే వేలాడుతా వుండు" అన్నాడు. ఇప్పటికి ఆరు నెలలు దాటింది. నా అరుపులు విని, నన్ను చూసి ఏ దయ్యమో, రాక్షసో అనుకొని పారిపోయేవాళ్ళే గానీ, వచ్చి కాపాడినోడు లేడు. ఇన్నాళ్ళకు నీ వల్ల మరలా ఈ భూమ్మీద నిలబడగలుగుతున్నాను. ఇంతకీ నువ్వెవరు. ఒక్కనివే ఎక్కడికి పోతున్నావు. ఏంది నీ కత" అన్నాడు.
ఆ యువకుడు జరిగిందంతా చెప్పి "ఎలాగయినా సరే.... రాకుమార్తెను పెళ్ళాడాలి అందుకే పోతావున్నా" అన్నాడు.
దానికా మరుగుజ్జు మాంత్రికుడు కాసేపు ఆలోచించి “నన్ను కాపాడినందుకు నీకు మూడు మాయా వస్తువులు కానుకగా ఇస్తా. కానీ అవి ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. ఎంతో అవసరమైనప్పుడు వాడుకో" అంటూ అతని చేతికి ఒక కంబళి, ఉంగరం, పావుకోళ్ళు ఇచ్చాడు.
“చూడు ఇవి మామూలు వస్తువులు కాదు. మాయా వస్తువులు. ఈ కంబళి మీద కప్పుకుంటే నువ్వు ఎవరికీ కనబడవు. అక్కడికక్కడే అదృశ్యమవుతావు. ఈ ఉంగరం పెట్టుకుంటే నీవు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలవు. ఈ పావుకోళ్ళు వేసుకుంటే మరుక్షణంలో నీవు కోరుకున్న చోటులో ప్రత్యక్షమవుతావు. బాగా గుర్తుపెట్టుకో ఇవి ఒక్కసారి మాత్రమే పని చేస్తాయి. వాటిని ఉపయోగించే ముందు “జయహో... మరుగుజ్జు మాంతికునికీ" అని నన్ను తలుచుకుంటే చాలు" అని చెప్పాడు.
ఆ యువకుడు సంబరంగా వాటిని తీసుకొని కందనవోలు రాజు దగ్గరికి చేరాడు. “రాజా... కొడితే ఏనుగు కుంభస్థలానయినా కొట్టాలి. లేదంటే ఆరడుగుల నేల తవ్వుకొని నన్ను నేనే సక్కగా సమాధన్నా చేసుకోవాలి అనే తత్వం నాది. అందుకే మీ ముందుకొచ్చి పోటీకి సిద్ధంగా నిలబడ్డా. చెప్పండి ఏం చేయాలో” అన్నాడు.
రాజు ఆ యువకున్ని కిందికీ మీదికి ఒక్కసారి చూసి “ఇంతకుముందు గూడా నీలాంటోళ్ళని ఎంతోమందిని చూసినా. మాటలు కోటలు దాటుతున్నాయే గానీ చేతలు గడప దాటడం లేదు. సరే... ఏ పుట్టలో ఏముందో ఎవరికి తెలుసు గానీ... నా మొదటి పందెం విను" అంటూ ఒక బంగారు హారాన్ని వానికి చూపుతూ “ఇదిగో ఈ హారాన్ని తీసుకొని రేపటిలోగా అంతఃపురంలోని యువరాణి మెడలో వేయాలి. అంతఃపురం చుట్టూ యమకింకరుల్లాంటి వందమంది సైనికులు రాత్రింబగళ్లూ కత్తులూ కటార్లతో కాపలా కాస్తుంటారు. వాళ్ళ చేతికి చిక్కావో ఏ ముక్కకా ముక్క నరికి కాకులకు, గ్రద్దలకు వేస్తారు. జాగ్రత్త" అన్నాడు. 
ఆ యువకుడు సరేనని ఆ బంగారు హారాన్ని తీసుకొని బైలుదేరాడు. ఎలా ఆ హారాన్ని రాజకుమారి మెడలో వేయాలా అని ఆలోచనలో పడ్డాడు. అడ్డు వచ్చిన సైనికులను చంపుకుంటూ ముందుకు వెళ్ళడం అంత సులభం గాదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు వందమంది వున్నారు. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తావుంటే మరుగుజ్జు మాంత్రికుడు ఇచ్చి మాయా ఉంగరం గుర్తుకు వచ్చింది. పెదాలపై చిరునవ్వు దొర్లింది. వెంటనే ఆ ఉంగరాన్ని వేలికి తొడుక్కొని “జయహో మరుగుజ్జు మాంత్రికునికీ" అంటూ తాను కోతిగా మారిపోవాలని కోరుకున్నాడు. మరుక్షణంలో ఒక చిన్న కోతిపిల్లగా మారిపోయాడు. రత్నాలహారాన్ని ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకొని ఒక చెట్టుమీద నుంచి మరొక చెట్టు మీదకు దుంకుతూ అంతఃపురం వద్దకు చేరుకున్నాడు. సైనికులు ఆ కోతిని గమనించినా... కోతులు అలా చెట్ల మీద తిరగడం మాములే గదా... అందుకే ఎవరూ పట్టించుకోలేదు. ఆ యువకుడు యువరాణి నిద్రపోయే గది పక్కనే వున్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. నెమ్మదిగా అర్థరాత్రి అయ్యింది. అంతఃపురంలోని దీపాలన్నీ ముక్కాలు భాగం ఆరిపోయాయి. యువరాణి, చెలికత్తెలు అందరూ గాఢనిద్రలో వున్నారు. నెమ్మదిగా లోపలికి పోయాడు. చప్పుడు గాకుండా ఆ బంగారు హారాన్ని పాలరాయిలా ధగధగా మెరిపోతావున్న యువరాణి మెడలో వేసి నెమ్మదిగా బైటకొచ్చి ఇంటికి చేరుకున్నాడు. పని పూర్తి కాగానే కోతి రూపం పోయి మరలా పూర్వరూపం తిరిగి వచ్చింది. పొద్దున్నే నిద్రలేచిన యువరాణి మెడలో హారాన్ని చూసి అదిరిపడింది. వురుక్కుంటా మహారాజు దగ్గరికి పోయి విషయాన్ని వివరించింది. అంతమంది కన్ను గప్పి అంతఃపురంలోకి ఎలా వచ్చాడో తెలీక రాజు ఆశ్చర్యపోయాడు. .
వెంటనే ఆ యువకున్ని పిలిపించి “ఇంతవరకూ వచ్చి వీరులలో అందరూ మొదటి పందెం దగ్గరే ఓడిపోయి తిరిగి మొహంగూడా చూపించకుండా వెళ్ళిపోయారు. నిలిచి గెలిచినోనివి నువ్వొక్కనివే. శభాష్... ఇక రెండో పందెం విను.
మన పక్క రాజ్యంలో వున్న కుమారవర్మ చక్రవర్తె అయినప్పటికీ పెద్ద వీరుడేం కాదు. అతని ఇంటి దేవత కాళికాదేవి మెడలో ఒక రత్నాల హారం వుంది. అది చాలా మహిమ గలది. తరతరాలుగా వాళ్ళకు వస్తూ వుంది. ఆ హారాన్ని మెడలో వేసుకొని యుద్ధానికి వెలితే అపజయం అనేది వుండదు. అందుకే కుమారవర్మను ఏ వీరుడు గూడా ఎదిరించి నిలబడలేకుంటున్నాడు. దాంతో వానికి గర్వం పెరిగిపోయి ఇరుగు పొరుగు సామంత రాజులను బానిసల్లాగా చూస్తున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఆ హారాన్ని తీసుకు రావాలి. దాంతో మనకు ఈ బానిస బ్రతుకు తప్పుతుంది" అన్నాడు.
ఆ యువకుడు "సరే" అన్నాడు. అతని దగ్గర ఇంకా రెండు వస్తువులు వున్నాయి గదా.... బాగా ఆలోచించి మాయా కంబళి తీసుకొని పక్క రాజ్యానికి పోయాడు. అర్ధరాత్రి కాగానే దాని కప్పుకొని “జయహో... మరుగుజ్జు మాంత్రికునికీ" అంటూ మాయం కావాలని కోరుకున్నాడు. మరుక్షణమే ఎవరికీ కనిపించకుండా మాయమయ్యాడు. నెమ్మదిగా రాజువుండే భవనంలోకి చేరి కాళికాదేవి విగ్రహం వద్దకు చేరుకున్నాడు. దేవికి మ్రొక్కి ఆమె మెడలో వున్న హారాన్ని తీసుకొని అంగీలో భద్రపరుచుకున్నాడు. భవనం బైటకి వచ్చి సిద్ధంగా వున్న ఒక గుర్రాన్ని ఎక్కి వేగంగా నగరం బైటకొచ్చాడు. మరుసటి రోజు కందనవోలు రాజును చేరుకుని “ఇదిగో మహారాజా... మీరు కోరుకున్న విజయహారం. ఇకపై చుట్టుపక్కల వున్న రాజ్యాలన్నీ మీకు సామంతులుగా మారవలసిందే" అన్నాడు. రాజు ఆ రత్నాల హారాన్ని చూసి చాలా సంబర పడ్డాడు. “శభాష్ వీరా... శభాష్. నీలాంటి వీరున్ని ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా చూడలేదు. ఇక చిట్ట చివరిది. మూడవది చెబుతాను. ఇందులో గనుక గెలిస్తే యువరాణితో బాటు సగం రాజ్యమూ దక్కుతుంది" అన్నాడు. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో “చెప్పండి మహారాజా... ఖచ్చితంగా విజయం సాధించి, మీ అమ్మాయి చేయి పట్టుకొని, మీతో కాళ్ళు కడిగించుకుంటాను" అన్నాడు.
ఇక్కడికి వంద మైళ్ళ దూరంలో ఒక భీకరమైన అడవి వుంది. అందులో ఒక భయంకరమైన దొంగలముఠా వుంది. వాళ్ళు అనేక రాజ్యాల మీదపడి దోచుకున్న సంపదంతా ఆ అడవిలో దాచి పెట్టారు. దానిని కనిపెట్టడం ఎవరి తరమూ కావడం లేదు. మనం అడవిలోకి సైన్యాన్ని పంపితే వాళ్ళు చెట్ల చాటున, గుట్టల చాటున దాచిపెట్టుకొని దాడి చేస్తున్నారు. ఒకొక్కడు వంద మందిని చంపేస్తున్నాడు. దాంతో ఎవరూ ధైర్యం చేసి అటువైపు వెళ్ళడం లేదు.
గత నాలుగు సంవత్సరాలుగా మన రాజ్యం కరువు బారిన పడి విలవిలలాడుతోంది. వానల్లేవు.... పంటల్లేవు... పైసల్లేవు... పనుల్లేవు. నీవు గనుక ఆ దొంగల ముఠాని చంపి ఆ నిధిని తీసుకు రాగలిగితే మన రాజ్యం మరలా కళకళ లాడుతుంది" అన్నాడు.
ఆ యువకుడు సరేనని తలూపి ఇంటికి పోయాడు. ఇంతవరకు మాయలు, మంత్రాలతో రెండు పోటీలు గెలిచాడు. ఇక మూడవ పోటీలో తన వీరత్వం చూపాల్సిన సమయం దగ్గరపడింది. కవచం ధరించి, చేత కత్తి పట్టుకొని, మాయా పావుకోళ్ళు తొడుక్కున్నాడు. “జయహో... మరుగుజ్జు మాంత్రికుడికీ" అంటూ ఆ దొంగలు వుండే గుహలోకి చేరుకోవాలి అని కోరుకున్నాడు. అంతే... కళ్ళుమూసి తెరిచేంత లోగా ఆ దొంగల గుహలో ప్రత్యక్షమయ్యాడు. గుహ లోపల ఎక్కడ చూసినా రత్నాలు, వజ్రాలు, మణులు, మాణిక్యాలు లెక్కలేనన్ని వున్నాయి. వాటిని ఆశ్చర్యంతో చూస్తూ నడుస్తుంటే పొరపాటున ఒక పెద్ద జాడీకీ చేయి తగిలింది. అంతే... అందులోని బంగారు వరహాలన్నీ గలగలగల కిందపడుతూ పెద్ద చప్పుడు చేశాయి.
ఆ చప్పుడు విన్న దొంగలు అదిరిపడ్డారు. “ఎవడ్రా గుహలోకి వచ్చింది. ఎంత ధైర్యం" అంటూ కత్తులు తీసుకొని వచ్చారు. కానీ వచ్చింది. అలాంటిలాంటి అల్లాటప్పా పిల్లోడు గాదు గదా... ఏనుగులాంటి బలం, సింహం లాంటి వేగం, డేగలాంటి చూపు, నక్కలాంటి తెలివి కలిగిన వాడు. వెంటనే మెరుపు వేగంతో కత్తి దూసి తుఫానులా వాళ్ళ మీదకు విరుచుకుపడ్డాడు. వచ్చినోన్ని వచ్చినట్టు పైలోకానికి పంపసాగాడు. అరగంట గడిచే సరికి దొంగల నాయకుడు తప్ప ఎవరూ మిగలలేదు.
ఇద్దరు ఒకరినొకరు ఎర్రని కళ్ళతో కసిగా చూసుకుంటా కలబన్నారు. రెండు మదగజాలు ఢీ కొట్టినట్టు వుందక్కడి పరిస్థితి. ఇద్దరికీ కత్తి గాట్లు పడుతున్నాయి. శరీరం రక్తంతో తడిచి ఎరుపెక్క సాగింది. ఎవరూ వెనక్కు తగడం లేదు. ఢీ అంటే ఢీ అంటూ, సయ్యంటే సయ్యంటూ తల పడుతున్నారు. ఆఖరికి ఆ గజదొంగ మెడ ఆ యువకుని చేతికి చిక్కింది. దొరికిన అవకాశాన్ని అతడు వదిలి పెట్టలేదు. బలమంతా ఉపయోగించి బిగించి ఉడుము పట్టు పట్టాడు. ఆ పట్టు విడిపించుకోలేక ఆఖరికి ఆ గజదొంగల నాయకుడు గిలగిలా కొట్టుకుంటూ ఆఖరికి పైలోకంలో వున్న అనుచరుల దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే ఆ యువకుడు అడవిలో ఆ గుహ ఎక్కడుందో బాగా గుర్తు పెట్టుకొని కందనవోలు రాజ్యానికి తిరిగి వచ్చాడు. పెద్ద ఎత్తున సైనికులను పంపించాడు. రెండు వందల బండ్ల బంగారం దొరికింది అక్కడు. దానికి మహారాజు చాలా సంబరపడి చెప్పిన మాట ప్రకారం. తన కూతురినిచ్చి పెళ్ళి చేయడమేగాక, తన తరువాత మహారాజుగా ప్రకటించాడు.
**********
కామెంట్‌లు