ఉడుత చేసిన పాయసం (బాలల సరదా కథ)-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
    ఒక చెట్టుమీద ఒక ఉడుత ఉండేది. ఒక రోజు ఆ ఉడుతకు పాయసం తాగాలి అనిపించింది. కానీ ఇంటిలో ఏమీ లేవు. దాంతో బాగా ఆలోచించింది.
చుట్టుపక్కల ఉన్న జంతువులను బురిడీ కొట్టించి పాయసం చేసుకోవాలి అనుకుంది. పక్కనే వున్న కుందేలు ఇంటికి పోయింది. “కుందేలన్నా... కుందేలన్నా... పాయసంలోనికి కొంచం చక్కెర తక్కువయింది. ఒక కప్పు చక్కెర అప్పుగా ఇవ్వవా. మళ్ళీ కొద్ధి రోజుల తరువాత తిరిగిస్తా” అని అడిగింది. “దానిదేముందిలే తమ్ముడూ తీసుకో” అంటూ ఆ కుందేలు ఒక కప్పు చక్కెర ఇచ్చింది. ఉడుత ఆ చక్కెర ఇంటిలో పెట్టేసి జింక దగ్గరికి పోయింది. “ జింక బావా... జింక బావా... పాయసంలోనికి కొంచం
సేమ్యా తక్కువయింది. ఒక కప్పు సేమ్యా ఇస్తావా... మళ్ళీ ఇస్తా” అని అడిగింది. 
“దానిదేముందిలే బావమరిదీ తీసుకో” అంటూ ఆ జింక ఒక కప్పు సేమ్యా ఇచ్చింది. ఉడుత ఆ సేమ్యా ఇంటిలో పెట్టేసి ఈసారి ఆవు దగ్గరికి పోయింది. “ఆవత్తా... ఆవత్తా... పాయసంలోనికి కొంచం పాలు తక్కువ అయ్యాయి. ఒక కప్పు పాలు ఇస్తావా. మళ్ళీ ఇస్తా” అని అడిగింది. “దానిదేముందిలే అల్లుడూ తీసుకో” అంటూ ఆ ఆవు ఒక కప్పు పాలు ఇచ్చింది. అలా ఆ ఉడుత చక్కెర, సేమ్యా, పాలు అన్నీ తెచ్చుకొంది. నవ్వుకుంటా సంబరంగా తీయని పాయసం చేసుకొంది. హాయిగా కాలు మీద కాలు వేసుకోని ఆనందంగా తాగుదామని పాయసం గిన్నె తీసుకొని ఇంటిముందు కూర్చుంది.
అంతలో కుందేలు అక్కడికి వచ్చింది. ఏం తమ్ముడూ ఒక్కనివే పాయసం తాగుతున్నావా. ఈ అన్నకు ఏమన్నా ఇచ్చేదుందా లేదా అని అడిగింది. 
రా అన్నా... నీ కన్నా ఎక్కువా అంటూ ఒక గ్లాసు నిండా పాయసం పోసి ఇచ్చింది ఉడుత.
కుందేలు హాయిగా తాగి భలే ఉంది తమ్ముడూ కమ్మగా. నా జన్మలో ఇంత రుచికరమైన పాయసం ఎప్పుడు తాగలేదు అంటూ మెచ్చుకొని వెళ్ళిపోయింది.
ఉడుత ఒక గ్లాసు నిండా పాయసం పోసుకుంది తాగడానికి. అంతలో అక్కడికి జింక వచ్చింది. ఏం బావమరిదీ పాయసం వాసన పది మైళ్ళ వరకు గుమ్మని కొడతా ఉంది. నాకు ఏమైనా ఇచ్చేదుందా లేదా అంది. ఉడుత నోటిలో వెళక్కాయ పడ్డట్టు అయింది. తాగేముందే రావాలా ఇది కూడా అని లోపల్లోపలే బాధ పడతా దానికేముంది జింకబావా... లోపలికి రా. తాగిపోదువు గానీ అంటూ గ్లాసు దానికి అందించింది. 
జింక దాన్ని లొట్టలేసుకుంటా తాగి అబ్బ... ఎంత బాగుందో అమ్మ చేతి వంటలా. ఈసారి ఎప్పుడు చేసినా ఈ బావను పిలవడం మాత్రం మరిచిపోకు అంటూ వెళ్ళిపోయింది.
ఉడత గిన్నెలోకి తొంగి చూస్తే ఇంక ఒక్క గ్లాసే మిగిలింది. బైట కూర్చొని తాగేటప్పుడు ఇంకేదైనా జంతువు వస్తే కష్టం అనుకుంటా గబగబా పైకి లేచి లోపలికి వెళ్లబోయింది. అంతలో అక్కడికి ఆవు వచ్చింది.
ఏమల్లుడూ... పాయసం భలే రుచిగా చేసినావంటనే. జింక , కుందేలు కనబడి ఆ కమ్మని రుచి గురించి పదే పదే చెబుతావుంటే నోరూరి పరుగెత్తుకొని వచ్చినా. నాకు ఏమైనా ఉందా లేదా అంది దాని చేతిలోని గిన్నె వంకే లొట్టలేసుకుంటా చూస్తూ. ఉడుత ఏమీ చేయలేక నీరసంగా రా. అత్తా. నీకు కాక ఇంకెవరికిస్తా చెప్పు అంటూ మిగిలింది ఆ గ్లాసులో పోసి దానికి అందించింది. 
ఆవు కమ్మగా దానిని తాగి ఆహా... ఎంత మజాగా ఉంది అల్లుడూ నీ చేతి పాయసం. నేనెప్పుడూ ఇంత రుచికరమైన పాయసం తాగనే తాగలేదు. నా దగ్గర తీసుకున్న అప్పుకేం తొందరలేదులే గానీ నిదానంగా నీ వద్ద వున్నప్పుడే తీర్చులే అంటూ వెళ్ళిపోయింది.
పాయసం ఒక్క చుక్కా తాగకపోయినా అప్పు మాత్రం మిగిలినందుకు గుడ్లు తేలేసింది ఉడుత.

కామెంట్‌లు