శంకరం లోక శంకరం; - కవిమిత్ర, శంకర ప్రియ., శీల., సంచార వాణి.. 99127 67098
  🔱తల్లియే "ఆర్యాంబా"దేవి
 తండ్రియే "శివగురు"వు
     ధర్మనిష్ఠా తత్పరులు
 వందనమ్ము గురుదేవ! (1)
🔱 ఆర్యాంబా శివగురుల
"తపఃఫలం" శంకరులు
    పరమేశ్వర ప్రసాదం   
వందనమ్ము గురుదేవ! (2)
     [ అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,]
 🔱శ్రుతి స్మృతి పురాణానాం 
ఆలయం కరుణాలయం!
    నమామి భగవత్పాద
 శంకరం లోక శంకరం!
      .. అని, జగద్గురు శంకర భగవత్పాదుల వారికి రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాము!
      ఆచార్య శంకరులు సాక్షాత్తు శంకర భగవత్ స్వరూపులు! వారు  పుణ్యదంపతులైన ఆర్యాంబా శివగురువులకు.. పరమేశ్వర ప్రసాదంగా జన్మించారు! చాంద్రమానం ప్రకారం, వైశాఖ శుద్ధ పంచమి నాడు భువిని అవతరించారు!  
👌 ఆది శంకరులు జన్మించిన కాలంలో మనభారతదేశం.. పలు సిద్ధాంతములకు నిలయమైనది! ఆ విధంగా  శైవము.. వైష్ణవము.. శాక్తేయము..  గాణాపత్యము.. కౌమారము.. సౌరము లనెడు మతశాఖలు... తమసంప్రదాయమే సర్వోత్కృష్టమని, భ్రమలో కొట్టుమిట్టాడు తున్నాయి! అవి... మతము పేరుతో మారణ హోమము సృష్టిస్తున్న సమయము!. ఆ సిద్ధాంతములలో... కొన్ని అవాంఛనీయము లైన ధోరణులు ప్రబలాయి!
      ఆ సమయములో భారతదేశమంతా పర్యటించి, అవైదిక సంప్రదాయం కలిగిన మతములను ఖండించారు! వేదసమ్మతంగా శైవాది షణ్మతములను తీర్చిదిద్దారు! అందరిలోను మతసామరస్యమును పెంపొందించారు! కనుక, జగద్గురు ఆదిశంకరులు... షణ్మత స్థాపనాచార్యు లయ్యారు! శివమస్తు!
       🚩సీస పద్యము
శ్రీరమ్యసీమయౌ కేరళ యందలి
    కాలడి  క్షేత్రమై ఘనతనంద
అమల చరిత్రులౌ ఆర్యాంబ శివగురు
    పుణ్యదంపతులు సమ్మోదమంద
పరమ పావనమగు వైశాఖ శుద్ధ పం
     చమి తిథిన్ కారణ జన్మమంది
మహిని అవైదిక మతముల ఖండించి
    ఆధ్యాత్మికతను సమైక్య పరచి
        🚩తేట గీతి
 దివ్య తత్వాల మదిని వర్ధిల్లజేసి
   అవని అద్వైత సిద్ధాంత మందజేసి
శివుని రూపముగ జగద్గురువుగ నిలిచె
   ఆదిశంకరుల్ వీరికి అంజలులివె.
       [రచన:-  అవధాని కోట రాజశేఖర్.,]
🚩జయజయ శంకర!
      హరహర శంకర!

కామెంట్‌లు