జీవేశ్వరుడు.. శివుడు- కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098

  🔱శ్రీమదాది గృహస్థుని 
 జీవేశ్వరుని హరుని
    ప్రణుతించెద శివుని
 ఓంనమో నమఃశివాయ! (1)
🔱కర్పూరవర్ణము వలె
 ప్రకాశించెడు భవుని 
   వినుతించెద శివుని
 ఓంనమో నమఃశివాయ! (2)
       (అష్టాక్షరీ గీతి, శంకర ప్రియ.,)
⚜️పరమేశ్వరుడు.. శుద్ధస్ఫటిక సంకాశుడు! అనగా, కర్పూరకాంతి వలె శోభించుచున్నాడు! ఆరాధకులు, సాధకులకు.. మున్నగు వారియందు కరుణార్డ్రహృదయం కలవాడు! కనుక, సదయుడు.. సర్వేశ్వరుడు!.
🚩పరమశివుని నిత్యము త్రికరణముల శుద్ధిగా సేవించు"భక్తులే" భక్తులు! ఆ భక్త మహాశయుల "హృదయ"మనెడు పద్మమునందు కొలువై యున్నాడు! వారికి పరమానందమును అనుగ్రహించు చున్నాడు.. సాంబ సదాశివుడు!
👌 సమస్తజీవులలో "అంతర్యామి"గా నివసించు భవుడు! "సదా వసంతము" అంటే ఆనందమును కలిగించువాడు! "భవo" అనగా, సంసారమునకు మూలమైనవాడు! కుండలినీ శక్తికి ఆధారమైనవాడు! భవానీశంకర స్వామికి.. రెండుచేతులను జోడించి, నమస్కరించెదను!
      🌻ప్రార్ధన శ్లోకం:-
     కర్పూర గౌరం, కరుణావతారం
    సంసార సారం, భుజగేంద్ర హారమ్!
    సదా వసంతం హృదయారవిందే 
    భవం భవానీ సహితం నమామి!!
 ‌     🚩తేట గీతి పద్యం:-
    కరుణ రూపంబు కర్పూర గౌరవంబు
   సర్ప హారుండు, సంసార సార మతడె 
   హృదయ పద్మము నందున, సదయ వెలుగు 
   పార్వతీపతి, భవునకు వందనమ్ము!
‌         ‌[..  విద్వాన్ పైడి హరనాథ రావు.,]
       ***************
       🚩 తేట గీతి పద్యము
    కప్పురము వంటి తెలుపును కలిగి యుండు
    కరుణ, సంసార సారుని ఉరగ హారు
   పుష్పమాసాన కమలపు పొలుపు నొప్పు
   స్వాంతు, నభవుని పార్వతీ పతిని కొలుతు!
        (👌పుష్పమాసము = వసంత ఋతువు,
పొలుపు = అందము )
        [... డా. శాస్త్రుల రఘుపతి.]
కామెంట్‌లు