సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, డల్లాస్

 న్యాయాలు-512
చౌర్యాపరాధాన్మాండవ్య నిగ్రహ న్యాయము
   ******
చౌర్య అనగా దొంగతనం.అపరాధము అనగా దోషము, పాపము, తప్పు. మాండవ్య అనగా మాండవ్య మునీశ్వరుడు.నిగ్రహ అనగా అదుపు, స్వాధీనంలో ఉంచుకొనుట,అడచుట,పట్టుకొనుట,దండించుట,ఓడించుట,తొలగించుట,నిందించుట అనే అర్థాలు ఉన్నాయి.
 ధనం లేదా డబ్బు కానీ  మరేదైనా కానీ పోయినప్పుడు తీసిన వ్యక్తి ఎవరో తెలియదు. అసలు దొంగలను వదిలేసి వేరే కొందరిని అనుమానిస్తుంటాం.అందుకే "సొమ్ము ఒకచోట వుంటే అనుమానం ఇంకొక చోట వుంటుంది " అంటుంటారు.
అలా ఒకోసారి తప్పు చేసింది ఒకరైతే శిక్ష వేరొకరు అనుభవించాల్సి వస్తుంది. "నేరం ఒకరిది శిక్ష మరొకరికి" అనే సామెతను తరచూ వింటుంటాం.
మరి దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దామా...
పూర్వం ఒకానొక రాజుగారి భవనంలో కొందరు దొంగలు దొంగతనం చేసి సొమ్ముతో పారిపోతూ వుండగా రాజభటులు చూస్తారు.వెంటనే వారిని పట్టుకునేందుకు వారి వెంట పడి తరుముతూ వెళ్తారు.
ఆ దొంగలకు రాజభటులను తప్పించుకునే మార్గం కనిపించలేదు.వాళ్ళు అలా అలా రాజుగారి పట్టణానికి సమీపంలో ఉన్న అరణ్యంలోకి పరుగెత్తుతారు.ఆ సమయంలో అరణ్యంలో  ఓ ఆశ్రమములో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు.దొంగలు ఇదే మంచి అవకాశం అనుకుంటూ వెంటనే ఆ ముని ఆశ్రమంలో దూరి అక్కడ దాక్కుంటారు.
 అప్పుడు తరుముతూ వెళ్ళిన రాజభటులు అక్కడ తపస్సు చేసుకుంటూ వున్న మాండవ్య మునీశ్వరుని అటుగా వచ్చిన దొంగలు ఏమయ్యారని అడుగుతారు.
అయితే మునీశ్వరుడు కళ్ళు మూసుకుని ఘోర తపస్సులో మునిగి వుండటం వల్ల వారి మాటలు ఆయన చెవికి ఎక్కలేదు.అందువల్ల భటుల ప్రశ్నలకు  సమాధానం ఇవ్వలేదు.
రాజభటులు ఈయన కావాలనే చెప్పడం లేదు అనుకుని ఆశ్రమం అంతా వెదికి దొంగలను పట్టుకుంటారు.అయితే ఆ మునీశ్వరుడే దొంగతనం చేయించాడనీ,దొంగల ముఠాకు ఆయనే నాయకుడనీ, దొంగతనం చేసొచ్చి ఏమీ ఎరుగని వాడిలా దొంగజపం చేస్తున్నాడని భావిస్తారు.ఆ విధంగా  దొరికిన దొంగలతో పాటుగా వెంటనే మాండవ్య మునీశ్వరుని కూడా పట్టుకొని రాజు గారి దగ్గరకు తీసుకొని వెళ్తారు.
రాజు న్యాయాన్యాయాలేమీ విచారించకుండా,మునీశ్వరుడు అన్న విషయం కూడా తెలుసుకోకుండా  ఆ దొంగలకు,మునికి మరణదండన లేదా  కొరత విధిస్తాడు.రాజు గారి ఆజ్ఞతో మరణదండన చేసినా/ కొరత  వేసినా ఆ మాండవ్య మునీశ్వరుడు తపస్సమాధిలో ఉండటం వల్ల చనిపోలేదు. అతడు అలా తపోనిష్ఠలోనే వున్నాడు.
విషయం తెలుసుకున్న మరికొందరు మునులు పక్షుల రూపంలో మాండవ్యుని వద్దకు వస్తారు.ఇలా శిక్ష అనుభవించడానికి కారణం ఏమిటి? అని ఆయన్ని ప్రశ్నిస్తారు.
పక్షులు వచ్చి ఆ మునితో మాట్లాడటం,మరణదండన చేసినా ప్రాణాలు పోకుండా వుండటం గమనించిన రాజభటులు ఆశ్చర్యపోతారు.ఈ వింత విషయాన్ని వెంటనే రాజుగారి సన్నిధికి వెళ్ళి చెబుతారు.
 సమాచారం విన్న రాజు గారికి తాను చేసిన పొరపాటు అర్థం అవుతుంది. చేసిన అపరాధానికి పాశ్చాత్తాప పడుతూ పరుగు పరుగున  మాండవ్య మునీశ్వరుని దగ్గరకు వెళ్ళి క్షమించమని వేడుకుంటాడు.
 రాజు గారు ఆజ్ఞాపించడంతో మరణ దండన/ కొరత తీసి వేశారు.అయినా ఆ కొరత వేసిన కర్ర ముక్క ఒకటి మాండవ్య మునీశ్వరుని గొంతులో ఇరుక్కుని బయటకు రాలేదు.ఇలా ఎలాంటి అపరాధం చేయని మునికి శిక్ష పడింది.
అలా జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని "తప్పొకరిది శిక్ష మరొకరికి" తప్పు చేసిన వాళ్ళు ఒకరైతే  నిరపరాధికి శిక్ష విధించినప్పుడు ఈ కథను ఉదాహరణగా చెబుతూ  ఉంటారు.
ఇలా లోకంలో తప్పుచేసి తప్పించుకునే వారు కొందరు. అమాయకంగా అందులో ఇరుక్కుని శిక్ష అనుభవించేవారు మరికొందరు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఈ "చౌరాపరాధాన్మాండవ్య నిగ్రహ న్యాయము " తప్పకుండా గుర్తుకు వస్తుంది కదండీ.
కాబట్టి ఇలాంటివి చిన్నవో, పెద్దవో మన ఇళ్ళల్లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.అలాంటి సమయంలో నిరపరాధుల మనసు నొప్పించకుండా అసలైన అపరాధి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేసి అసలు కారకులు ఎవరో గుర్తించాలి.

కామెంట్‌లు