శాంతియే పరిపూర్ణత్వానికి ప్రతీక;-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్.విశాఖపట్నం.
సంపద శాశ్వతం కాదని
యవ్వనం అశాశ్వతమని
పుట్టిన జీవి మరణించక  మానరని
అరిషడ్వర్గాలను జయించి
అష్టాంగ యోగాన్ని అనుసరించి
బుద్బుదమైనది జీవితమని
అసూయ, అహంకారాలు
రాగ,ద్వేషాలు అభివృద్ధికి అవరోధాలని
సంసార బంధాన్ని త్యజించి
శాంతి,దయ, కరుణ ప్రగతికి సోపానాలని
అపుడే మానవ జన్మకు   సార్ధకత అని
చక్రవర్తి కొడుకుగా  సర్వసుఖాలను
భార్యా పుత్రులను కూడా పరిత్యజించి
సిద్ధార్థుని నుంచి సన్యాసిగా మారి గౌతమబుద్ధునిగా ప్రసిద్ధి చెంది
"బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి" అని తథాగతునిగా పేరు నొంది
శాంతి, అహింసలే ప్రగతికి సోపానమని  పరి పూర్ణత్వానికి ప్రతీకలని ఆనాటి  ఆశోక చక్రవర్తి నుంచి మొన్నటి వసుదైకానికే ఆదర్శమైన
భారత రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచ మేథావి భారతరత్న అంబేద్కర్ వరకు ఎందరో మహానీయులకు
మార్గదర్శకుడై
దశావతారాలలో ఒక అవతార మూర్తిగా నిలచిన బుద్ధ భగవానుడు  పుట్టిన "వైశాఖ పౌర్ణమి"  అతి పవిత్రమైన రోజు.
నేటి భయానక హింసాత్మక పరిస్థితులలో
వసుదైకానికే   బుద్ధుని  బోధనలు ఆదర్శమైనవి.   మానవాళి కల్యాణానికి సర్వం పరిత్యజించిన తథాగతునికి నేనర్పిస్తున్న అక్షరకుసుమాలు...!!
.........................
(వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతి సందర్భంగా)


........................

కామెంట్‌లు