సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-493
గుణోప సంహార న్యాయము
*****
గుణ అంటే  గుణము ( మంచి లేక చెడు),ఒక సద్గుణము, స్వభావము, త్రాడు,అలవాటు,మడుగు,అప్రధానము,శ్ర్యైష్ట్యము,ఉపయోగము,ఫలితము,దారము,వస్తు ధర్మము,సత్త్వాది,శబ్దాది, అధికము,వత్తి,గుణసంధి అనే అర్థాలు కలవు.ఉప సంహారము అంటే ముగించుట,మరల్చుట, ముగింపు, చంపుట అనే అర్థాలు ఉన్నాయి.
ఒక వ్యక్తి తనలోని గుణాలను మంచివైపు మార్చుకోవడం వల్ల తన సామాన్య గుణాల వల్ల కూడా విశేషమైన విజయాలను సాధించవచ్చు అనే అర్థంతో మన పెద్దలు ఈ "గుణోప సంహార న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 సామాన్య గుణాలు  అంటే   ఏమిటో చూద్దాం.  సామాన్య గుణాలు అంటే సాధారణ లక్షణాలైన నాణ్యత ,ప్రతిభ. ఇవి మనుషులకే వర్తిస్తాయి. ప్రతి మనిషిలో తప్పకుండా కొన్ని సామాన్య గుణాలు కనిపిస్తాయి.
వీటిని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే... ప్రాపంచిక దృక్పథం ప్రకారం జీవులలోనూ వస్తువుల్లోనూ మూడు రకాల గుణాలు ఉన్నాయని చెబుతారు. అందులో మొదటిది 'సత్వ గుణం' అనగా మంచితనం, ప్రశాంతత,శ్రావ్యత. రెండవ గుణం 'రజో గుణం' .రజో గుణం అనగా అభిరుచి, కార్యాచరణ, కదలికతో పాటు కొంత  అహం అధికార దాహం ఉంటాయి.మూడో గుణం 'తమో గుణం'. తమో గుణం అనగా అజ్ఞానం, జడత్వం, సోమరితనం.
ఈ మూడు గుణాలన్నీ ప్రతి ఒక్కరిలోనూ,ప్రతిదానిలోనూ ఉన్నాయని. ఈ గుణాల పరస్పర చర్యలు వ్యక్తుల స్వభావాన్ని  నిర్వచిస్తాయనీ, నిర్ణయిస్తాయనీ అంటారు.
దీనిని సామాన్య అర్థంలో తీసుకున్నట్లయితే గుణ అనేది ధోరణి లేదా కార్యాచరణ సూత్రం.మానవ ప్రవర్తన గురించిన అధ్యయనంలో నేడు గుణ అంటే వ్యక్తుల వ్యక్తిత్వం,సహజ స్వభావం. వ్యక్తి  యొక్క మానసికపరమైన లక్షణాలుగా చెప్పవచ్చు.
అయితే "గుణోప సంహార న్యాయము" ప్రకారము "సామాన్యముచే విశేషమును  సాధించునట్లు" అంటే సామాన్యమైన గుణాల చేత అసామాన్యమైన పనులు సాధించవచ్చు అని అర్థము.
మొత్తంగా గుణాలు ఎన్ని వున్నా వాటిని మూడు గుణాలుగా విభజించి చెప్పడం జరిగింది.
మనిషిలో సామాన్యంగా సాత్విక గుణం ఉన్నట్లయితే  అతడి వల్ల సమాజానికి  మేలు జరుగుతుంది.ఎలాంటి కీడు జరగదు. నైతిక విలువలు కలిగిన  సాత్విక ప్రవర్తన పూర్తిగా మంచితనానికి,మానవత్వానికి నిలువెత్తు రూపమై వుంటుంది. ఈ గుణం ఉన్న వ్యక్తులు నిస్వార్థులు.ప్రతిఫలాపేక్ష లేని వారు.ఇతరుల మేలు కోరుకునే తత్త్వం కలిగిన వారు.మహనీయులు,మహానుభావులు,మహర్షులు, యోగులు మొదలైన వారు ఈ కోవకు చెందుతారు.
సత్త్వ గుణం కలిగిన వారు అతి  సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఎల్లప్పుడూ  సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ,ఆ దిశగా సాధన, ప్రయత్నాలు చేస్తుంటారు.
రజో గుణం కలిగిన వారిలో కార్యాచరణతో పాటు కొంత అహం ఉంటుంది.నలుగురూ గొప్ప చెప్పుకోవాలనే కోరిక ఉంటుంది.
 అందుకే సాత్విక గుణం కలిగిన వారు మాత్రమే సాధారణ లక్షణాలతో, మానవీయ విలువల వ్యక్తిత్వంతో చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయగలరు.
 ఎందరో మహనీయులు తమ  సాత్విక గుణంతో సంఘ సంస్కర్తలుగా  స్వాతంత్ర్య సమర యోధులుగా,ఉద్యమ కారులుగా,శాస్త్రవేత్తలుగా చరిత్ర గతిని మార్చారు.
వారందరినీ గమనంలో పెట్టుకొని మనలో  తమో,రజో గుణాలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా విడిచి పెట్టి సాత్త్వికులుగా వుందాం. సంస్కారవంతమైన సమాజం నెలకొనేలా మన వంతు సేవలను, సహకారాన్ని అందిద్దాం.

కామెంట్‌లు