కల;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 సకలసృష్టినీ ప్రాణవంతంచేసే ఆ తేజోమూర్తి
మరోరోజును ప్రారంభించాడు
అద్భుతసౌందర్యంతో దీపించే సూర్యోదయాన్ని చూశా
కనుచూపుమేరంతా 
పసిడిరజనుతో కప్పబడిపోయినట్లుంది
సూర్యకాంతికిరణాలు చెరువుపైపడి
పసిడిజలాలు ఉయ్యాలలూగుతున్నట్లున్నాయి
భూమిపైనుండి అల్లంత ఎత్తున ఎదిగి
ఆకాశంలోకి గర్వంగా చూస్తున్న పర్వతాలు
తలవంచి తమ అందాలను
ఆ చెరువునీటిలో చూసుకుంటున్నాయి
భువి సుకోమల హరిత పరిధానంతో
రమణీయంగా వయ్యారాలు పోతోంది
అమరవర్ణాల్లో మనోహరంగా
శ్రేణీబధ్ధమై మోహరించి
ఆహ్లాదపరిచే సుమబాలలు
అపురూపవాసనలతో నిండిన ఆ పరిసరాలు
అపూర్వ శ్రవ్య మధురిమనందించే కలకూజితాలు
అందమైన జంతు కలరవాలు
అబ్బో! అబ్బో! అబ్బో!
సజీవస్వర్గం అంటే ఈ అందాలభరిణయే కదూ!?
ఇక్కడ నా నగ్నపాదాలతో నడుస్తూ
ప్రకృతి విన్యాసాన్ని ఆనందంగా వీక్షిస్తున్నా!
మన ధరణి అలౌకిక అందాన్ని ఆస్వాదిస్తున్నా!
ఇంతలో.............
శ్శ్ శ్శ్ శ్శ్ శ్శ్ శ్శ్ శ్శ్ .... 
మా కిచెన్ నుండి కుక్కర్ విజిల్ శబ్దం!
అంటే?!.........
ఇదంతా నా కలలోనా?!
హతవిధీ!
హు హు హు హు...!!!
**************************************

కామెంట్‌లు