శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు.
76.
పరమ పథమును జూపెడి భక్తవరద!
కొలువు చేయుమా!మనసులో కోవెలనుచు 
లలిని కురిపించు మా స్వామి!కలత దీర్చి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
77.
 శుభములిచ్చెడి దేవర!సుప్రకాశ!
చివరి దినములు గడుపగ చింత పెరిగి 
కుమిలి పోవుచు వేడితి కూర్మి తోడ 
నన్ను పాలింపు మాల్యాద్రి నార సింహ.!//

78.
సాధు వర్తన మీయవే శార్ఙ్గపాణి!
దుష్ట గుణముల దూలింపు దోషహరణ!
పాప కర్మలు వారించి పద్మనాభ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
79.
కాల కంఠుని పాశంబు కంఠమందు 
బిగుసు కొన్నట్టి క్షణమందు వీడిపోక 
దయను జూపవె యాత్మకు ధైర్యమొసగి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
80.
పాంచ భౌతికదేహమ్ము పట్టు సడలి 
కన్ను మూసెడి క్షణమందు గాంచవయ్య 
ధైర్య మించుక లేనట్టి దారి యందు 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు