శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.- టి. వి. యెల్. గాయత్రి. పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు 
===============
31.
తరుణ వయసున తెలియక తప్పు చేసి
శరణు వేడితి నిప్పుడు కరుణ జూపు
తోడు నీడవై నిల్చుచు  తోయజాక్ష!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
32.
పాప కర్మలన్ జేసితి పద్మ నాభ!
పనికి మాలిన యహమున పచ్చినైతి
నిలువనీయని మదమును నిలువరించి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
33.
కన్ను గానని కామము కప్పి వేయ
కపట బుద్ధియే నన్నిటు కాల్చి వేయ 
మదపు టేనుగు వోలె నీ మహిని తిరుగు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
34.
శేషశయనుడ నీ దీప్తి జూడతరమె?
దివ్య చక్షుల గోరితి దేహి యనుచు 
గౌర వించవే  నామాట గరిమజూపి 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
35.
వెనుక ముందుండి నడిపింప వేసటేల?
నీవు నీవంచు తిరిగితి నేరమేమి?
నీవు నేనంచు భేదము నెరపకయ్య!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు