సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -487
గృహ దీపికా న్యాయము
*****
గృహ అనగా ఇల్లు,నివాసము,భవనము.దీపికా అనగా కాగడా, వెలుగు అనే అర్థాలు ఉన్నాయి
ఇంటిలో వెలిగించిన దీపము ఇల్లంతా వెలుగును నింపుతుంది అని అర్థము.
ఇంటిలో దీపం లాంటి ఉత్తమ ఇల్లాలు వుంటే ఇల్లంతా వెలుగే అనే అర్థంతో  మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 మరి ముందుగా దీపం గురించి తెలుసుకుందాం.
భారతీయ సంస్కృతి, సంప్రదాయంలో దీపమునకు ఒక విశిష్టమైన స్థానం ఉంది.ఏదైనా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా, దైవ సంబంధమైన కార్యాలు చేయాలన్నా మొట్టమొదట వెలిగించేది దీపాన్నే.
దీపారాధనతోనే ఏదైనా శుభ కార్యాన్ని  మొదలుపెడతారు.వ్రతాలు, నోములు, నిత్య పూజలో దీపాలను వెలిగించడమనేది ముఖ్యమైన ఘట్టమని మనందరికీ తెలిసిందే.
దీపము జ్ఞానానికి ప్రతీక.అంతే కాదు దైవత్వ భావన యొక్క కాంతి, జ్ఞానం, తెలివి మరియు మంచి పనులకు కూడా ప్రతీకగా నిలుస్తుంది. దీపం అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతుంది అంటారు.దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, ఆనందానికి కారణంగా, మనో వికాసానికి, సజ్జనులైన వారికి ఉదాహరణగా, సమున్నత సద్గుణ సంపత్తికి మూలంగా భావిస్తారు.
ఇలా దీపం గురించి  చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు ఉన్నాయి.దీపం ఒక చైతన్యవంతమైన ఆత్మ రూపం అంటారు.దీపం యొక్క వెలుగు మనిషిలోని తమో, రజో గుణాలను  పోగొడుతుందని, కష్టాలనే చీకట్లను పారద్రోలి సుఖాలనే వెలుగులు ప్రసాదిస్తుందని అంటారు.
అందుకే  దీపానికి అంత గౌరవం."గోరంత దీపం కొండంత వెలుగు" అని గౌరవంతో  చూస్తాం. ఇక దీపం యొక్క వెలుగు  అనగా జ్వాల మృదువైన కాంతి ఇచ్చే వెచ్చదనం  మనలో ప్రశాంతతను కలిగిస్తుంది. మనసులోని ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి ఉత్తమమైన ధ్యానంలోకి మళ్ళిస్తుంది.
అందుకే చాలా మంది భారతీయులు వారి గృహాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో  భక్తితో దీపాన్ని వెలిగించి  దీపారాధన చేస్తారు.
 "ఇంటికి దీపం ఇల్లాలు" అంటారని మనకు తెలుసు కదా.
 ఆ మాట అక్షర సత్యం కూడా.ఎందుకంటే ఇంట్లో మహిళ  దీపంతో సమానం.ఆమె  ఉన్న ఇల్లు వెలుగులతో ప్రకాశింపబడుతుంది. ఇల్లంతా  కలయతిరుగుతూ వెలుగుల సందడి చేస్తుంది.తాను వత్తిగా వెలుగుతూనే నమ్ముకున్న ఇంటికి కలకాలం  కాంతులు ప్రసాదించే జీవన జ్యోతి అవుతుంది.
" ఈ విధంగా గృహ దీపికా న్యాయము"లో మగువదే అత్యంత కీలకమైన పాత్రనీ,  తాను వెలుగుతూ వంశాంకురాల చిరు దీపాలను  వెలిగిస్తుందనీ అర్థం  చేసుకున్నాం .దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు ప్రతి ఇంటి ఇల్లాలి  రూపం.
మరి న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దీపం లాంటి వ్యక్తుల నుండి విజ్ఞాన కాంతిని గ్రహించాలి.దీపం లాంటి ఇంటి ఇల్లాలును సదా గౌరవంగా  చూసుకుంటూ కాపాడుకోవాలి. ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గమనంలో పెట్టుకొని అవనికి వెలుగైన బంగారు తల్లి ఆడపిల్లను, ఇల్లు, కుటుంబం కోసం బతుకంతా త్యాగించే మహిళను అభిమానంతో చూద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు