సుప్రభాత కవిత ; - బృంద
పంటపొలాల చెక్కిళ్ళపై
మెరిసే చక్కని నవ్వులు అద్ది
నింగిని సాగే మబ్బుల
మురిపాల ముచ్చట్లు

మేదినిని మేలుకొలుప
ఏతెంచు మారాజుకు
మేలైన స్వాగతమీయ
మేఘాల ఉత్సాహాలు

పుడమికట్టిన పచ్చని చీరకు
వెండిజలతారు జిలుగులు
అలదిన వెలుగుల ప్రేమకు
ముచ్చటగా మురిసే జగతి

అలరించే అందాలన్నీ
అగుపించే  తరుణంలో
అరచేతికి ఆనందాలు
అందినట్టే సంబరాలు

మార్చలేని గతం....
చెప్పలేని భవిష్యత్తు కన్నా
చేతిలోని క్షణాలెంతో
విలువైన సంపద....

చిన్నిచిన్ని సరదాలు
తీరక ఆరాటపెట్టే చిన్నికోరికలు
తీర్చేసుకుంటూ ..పోగేసుకుంటూ
గడిపేయడమే జీవితమంటూ....

చెవిలో చెప్పే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు