సుప్రభాత కవిత -బృంద
పైరును ప్రసవించే పుడమికి
చిరునవ్వుల స్వాగతమంటూ
మరకత మణులు పొదిగిన
ఆభరణం కానుకలిచ్చే వేకువ

నీటిని దాచిన మబ్బులకు
ఏటితో బంధం వేసి
చినుకుల ఉత్తరాలతో
రాయబారం నడిపే వేకువ

కురిసే మేఘాలన్నీ కలిసి
విరిసే వెలుగులు చూసి
మురిసే... మురిపాలన్నీ
ముచ్చటగా చూసే వేకువ

మూసిన రెక్కల రెప్పల
పూసిన పువ్వుల అందాలు
చూసిన వెంటనే విరబూసే
పరిమళాల విరజిమ్మే వేకువ

గడ్డిపూల రేకుల మీద ముద్దుగా  

కూచుని వేచిన చిన్ని నీటి చుక్క
కిరణపు కాంతిని తనలోదాచి
హరివిల్లు రంగులు వెదజల్లే వేకువ

కన్నుల దాగిన కలలన్నీ
నిజమై ముందుకు వచ్చి
నీకోసమే వచ్చానంటూ
ప్రేమగ దరిచేరి మురిపించే 

వేకువకు

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు