'హరీ!'శతక పద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 95.
చంపకమాల.
మరణము రానిదెవ్వరికి?మన్నున లీనము గాక యుందురా?
త్వరితముగా నెఱింగి నిను భక్తిగ గొల్చిన వారినెల్లరన్
దరిగొని శాశ్వతంబయిన ధర్మపు మార్గముఁ జూపువాడ!నిన్
గురుతుగ దల్చుకొందునయ!కూల్చుమ!నా మద దర్పముల్ హరీ!//

96.
ఉత్పలమాల.
అంతర దృష్టిలేక పరమాత్మను గాంచుట కల్లయంచు వే
దాంతులు పల్కుచుంద్రు మరి తాత్విక సంపద లేనిదాననై
చింతిలుచుంటి నా కిడుమ చిన్మయ తత్త్వమెఱుంగు జ్ఞానమున్
సంతస మొంది నీ పరమ సాత్త్విక రూపము గాంచెదన్ హరీ!//

కామెంట్‌లు