కలాలు కదిలితేనే!- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవివర్యుల పాటలు
గాయకుల గానాలు
నర్తకీమణుల నృత్యాలు
నేపథ్య వాయిద్యాలు
వీక్షకులవినోదాలు స్పందనలు
కలాలు కదిలితేనే వినబడతాయి

అతివల అందచందాలు
మన్మధుని మోహాలు
విరహ వేదనలు
హృదయ స్పందనలు
మదులకు  మురిపాలు
కలాలు కదిలితేనే కనబడతాయి

పండితుల ప్రవచనాలు
భక్తుల గుమిగూడటాలు
ఔత్సాహికుల ఉరుకులు
సంప్రదాయ ఆచరణలు 
సంస్కృతి పరిరక్షణలు
కలాలు కదిలితేనే సంభవిస్తాయి

కవుల సమ్మేళనాలు
సన్మాన సత్కారాలు
శాలువాలు కప్పటాలు
బిరుదుల ప్రదానాలు
పత్రికలలో ప్రచారాలు
కలాలు కదిలితేనే జరుగుతాయి

అందాల వర్ణనలు
ఆనందాల చేరవేతలు
మనసుల మురిపింపులు
నవ్వుల కురిపింపులు
మోముల వెలిగింపులు
కలాలు కదిలితేనే కొనసాగుతాయి

అక్షరాల అల్లికలు
పదాల ప్రయోగాలు
పంక్తుల పసందులు
చరణాల కూర్పులు
భావాల విస్ఫోటనాలు
కలాలు కదిలితేనే సృష్టించబడుతాయి

అవినీతిపై పోరాటాలు
అక్రమాలపై దండెత్తటాలు
అన్యాయాలపై ఎదిరింపులు
ఆర్తనాదులకు సాయాలు
సంఘసంస్కరణల సాధించటాలు
కలాలు కదిలితేనే సాధ్యమవుతాయి

పద్యాల పరుగులు
వచనకైతల వరదలు
ప్రబోధాల పరంపరలు
ప్రణయాల ప్రకంపనలు
పాఠకుల పారవశ్యాలు
కలాలు కదిలితేనే బయటకొస్తాయి


కామెంట్‌లు