సునంద భాషితం- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -504
చాలనీ న్యాయము
*****
చాలనీ అనగా జల్లెడ.
జల్లెడలో పోసి జల్లించి నట్లు.
 జల్లెడ ఏం చేస్తుందో మనందరికీ తెలుసు.  సాధారణంగా బియ్యంలో చిన్న చిన్న రాళ్ళూ, రప్పలు, ఇసుక, నూకలు లాంటివి వేరు చేసేందుకు ఉపయోగిస్తారు. పప్పులు జల్లించేటప్పుడు సన్నటి రాళ్ళను మట్టి బెడ్డలను కిందికి రాల్చేస్తుంది. ఇలా అవసరమైన, అనవసరమైన వస్తువులను వేరు చేయడానికి జల్లెడ ఉపయోగపడుతుంది.
పిండిని జల్లించడానికి ఉపయోగ పడుతుంది.అయితే ఇక్కడ సన్న సన్న రాతి రేణువులు, పొట్టు లాంటివి పైన  ఆగుతాయి.అలాగే మెరిగెలు, చిన్న చిన్న లక్క పురుగుల్లాంటివి కూడా జల్లెడలో మిగులుతాయి.
అంతే కాదు మనం నిత్యం కాఫీ, టీలు మరగబెట్టి చిన్న సైజు జల్లెడలో వడగట్టుకుని తాగుతుంటాం.
ఇలా ఒక్కో రకం జల్లెడ ఒక్కో విధంగా మనకు ఉపయోగపడుతుంది.
 పూర్వకాలంలో వెదురు జల్లెడ,ఇనుప తీగల జల్లెడలు  వాడుకలో ఉండేవి.గ్రామాల్లో కొంత మంది వారి సంప్రదాయం ప్రకారం పిల్లలు పుట్టిన పదకొండవ రోజున పురిటి స్నానం చేయించి ఆ శిశువుకు  మెడలో  ఓ బంగారు గొలుసు (పెద్ద వాళ్ళది ఎవరిదైనా )వేసి జల్లెడలో లేదా చేటలో కొద్ది సేపు పడుకోబెట్టే వారు. అంటే పసి వయసు నుంచే మనసులో చెడు ఆలోచనలను చెరిగేసుకుని లేదా జల్లించుకుని మంచి వ్యక్తిగా ఉండాలని కాబోలు...అలా  చేసేవారు.
అలా  వస్తువులను జల్లెడ పట్టడమే కాకుండా  మనుషుల మనస్తత్వాన్ని, ప్రవర్తనను,పనులను జల్లెడ పట్టి పరీక్ష చేయొచ్చు అనే అర్థంతో ఈ "చాలనీ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
ఈ జల్లెడ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.
కేవలం ఈ జల్లెడను ఉపయోగించి ,జల్లించే  మీదనే ఆధారపడి బతికే వాళ్ళు పూర్వం పల్లెల్లో కొంత మంది ఉండేవారు.
వాళ్ళు బంగారు పనిచేసే వారి వీధుల్లో తిరుగుతూ వుండేవారు . వారు ఉపయోగించిన  కుంపటి, కొలిమి లోని బూడిద,ఇసుక మొదలైనవి  వారి ఇళ్ళ ముందున్న  మురికి కాలువ నుండి సేకరించేవారు.అలా సేకరించిన ఆ మురికి బూడిద, ఇసుకను తీసుకుని ఏటి ఒడ్డుకు వెళ్ళి జాగ్రత్తగా జల్లిస్తే అందులో చిన్న చిన్న బంగారం ముక్కలు పైకి తేలేవి.ఇదెంతో ప్రయాసతో కూడినది.ఆరోగ్య సంబంధమైన సమస్యలు కూడా  ఉత్పన్నమయ్యేవి. అయినప్పటికీ దానినే జీవనాధారం చేసుకొని బతికిన వారు ఉన్నారు. ఇప్పుడు బంగారం పని చెసేవారి పరిస్థితే చాలా గడ్డుగా ఉంది.ఇక వాళ్ళను నమ్ముకున్న వారి పరిస్థితి ఇంకెలా ఉంటుందో...ఊహించుకుంటేనే బాధగా ఉంటుంది.
ఇవే కాకుండా పరిశ్రమలలో కూడా కణాలు, దుమ్ము ధూళి, రాళ్ళు మొదలైనవి నీటి ద్వారా వేరు చేసేందుకు జల్లెడలు ఉపయోగిస్తారు.
 ఇంతే కాకుండా కవుల రచయితల సాహిత్యాన్ని కొందరు జల్లెడ పట్టి అందులో ఏముందో లోతుగా విశ్లేషణ చేయడాన్ని  ఏ విషయం  వదలకుండా జల్లెడ పట్టడం  జరిగింది అనేవారు.
ఇలా జల్లెడను మానసికమైన అంటే  అంతరంగ వస్తువుగా భావిస్తే మనల్ని  మనం తరచి చూసుకుని మనలోని  లోపాలను జల్లించుకునేందుకు ఉపయోగ పడే ఓ గొప్ప  సాధనంగా చెప్పుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న అహాలు,సంకుచితాలు వుంటే  వెంటనే జల్లించేసుకోవాలి. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని మనలోని అవలక్షణాలను మృదువుగా గుర్తు చేస్తూ  వాటిని జల్లించేసుకోమనీ మంచి మార్గంలో నడవమని చెప్పేవాళ్ళు.
ఇప్పుడు అలా చెప్పే పెద్ద వాళ్ళు కొందరు ఉన్నా వినేందుకు ఇష్టపడే వాళ్ళు లేరు .కాబట్టి ఎవరికి వారే అంతరంగమనే జల్లెడలో వడకట్టుకుని  మంచి వ్యక్తిత్వంతో ఉండాలని చెప్పడమే ఈ "చాలనీ న్యాయము" యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం. కాబట్టి మనమూ ఆ జల్లించే పనిలో  వుందామా!

కామెంట్‌లు