సుప్రభాత కవిత ; -బృంద
ఇదివరకెపుడూ ఎరుగని
అది ఎందుకో తెలియని
మది నిండుగా వెన్నెలలా
మెదిలే అంతులేని భావనలు

ఎప్పటిలా మారే ఋతువులే
తప్పని శిశిరాలు గ్రీష్మాలే
జీవితంలో ఒడిదుడుకులకు
కాలం కలిసిరాలేదనడం దేనికీ?

ఎద నిండుగ ఆనందమైతే
కనిపించే ప్రతీదీ అద్భుతమే
మార్పు మన దృష్టిలోనే
మిగిలినదంతా మామూలే!

ఆనందానికి ఆమనులూ
అందోళనకు వేసవులూ
కలతలకు కష్టాలకు
కాలమే కారణాలని నిందలే!

మార్పులెన్నో మనలోనే
మాయలన్నీ మనచుట్టూనే
మర్మమంతా మనసులోనే
మారనిదసలు కాలమొకటే!

మనస్ఫూర్తిగా మెచ్చుకోలు
హ్రదయపూర్వక స్వాగతాలు
స్వార్థరహిత సహకారాలు
కూరిమితో సావాసాలు  ఉంటే

ప్రతిదినమొక కొత్త మలుపు
ప్రతిక్షణమూ కొత్త పిలుపూ
ప్రతి మనసూ పూలమంటపమే!
ప్రతి బంధమూ అనుబంధమే!

ఆనందపు అంచులు అందించే
వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు