సునంద భాషితం - వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-506
చిత్రాంగనా న్యాయము
****
చిత్రము అనగా చిత్తరువు, బొమ్మ,ఒక వస్తువు యొక్క ప్రతి బింబము.అంగన అనగా స్త్రీ,కన్య,అంబుజాక్షి,అలివేణి,కలికి, నెలత., మహిళ,మగువ... ఇలా చెప్పుకుంటూ పోతే  దాదాపుగా 294పైగా  అర్థాలు ఉన్నాయి.
 మరి చిత్రాంగనా అంటే చిత్ర రూపంలో ఉన్న  మహిళ అని అర్థము.చిత్రపటములోని అందగత్తెను లేదా అతివను చూసి  "అబ్బో! ఎంత అందం!" అని అనుకోవాలి కానీ ఆ మహిళ పట్ల ఎలాంటి అసహ్యకరమైన ఆలోచనలు ఉండకూడదని. ఆమెను కౌగలించుకోవాలని ఎవరూ అనుకోకూడదనే  అర్థంతో మన పెద్దవాళ్ళు ఈ "చిత్రాంగనా న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు. అలా  అనుకోవడం అంటే ఉదాహరణకు ప్రకృతిని చూసినప్పుడు  అందమైన పవిత్రమైన ఆలోచనలే రావాలి కానీ ధ్వంసం చేయాలని దుష్టమైన  ఆలోచన రాకూడదు కదా!
ఇక  ఈ న్యాయాన్ని చూద్దాం...చిత్రాంగనను  చూసే కాదు ఏ అందమైన చిత్రాన్ని చూసినా" ఆహా! ఈ చిత్రాన్ని  వేసిన/గీసిన కళాకారుడిది ఎంత గొప్ప  కళాత్మకమైన హృదయమో కదా! నవ్వించే ,కవ్వించే, మైమరిపించే మనసు లోలోతులను తడిమేలా  జీవకళ ఉట్టిపడే విధంగా అద్భుతంగా వేశాడో కదా! కళాకారుడు"  అతని కళకు ప్రణమిల్లాలనే భావన  హృదయాంతరాలలో  కలగాలి. అంతే కానీ చిత్రాన్ని చూసినప్పుడు మానసికమైన  ఏ ఇతరమైన కోరికలూ, వికారాలూ పెంచుకో కూడదు అనే ఉద్దేశమే ఈ న్యాయములోని  అంతరార్థము.

 అలాంటి  కోరికలను తప్పక అదుపులో పెట్టుకోవాలనే అర్థం వచ్చేలా వేమన ఓ పద్యంలో ఇలా అంటాడు.
"కొంపలోన నున్న కోర్కెలు ఛేదించి/హృదయమట్టె మిగుల పదిల పరచి/ గృహము నిల్పువాడు బహుతత్వవేదిరా/ విశ్వధాభిరామ వినురవేమ."
అనగా మనస్సును జాగృతం చేసి శరీరంతో అనుభవించే కోరికలను అధిగమించాలి. మానసిక నియంత్రణ ద్వారా శరీరాన్ని కాపాడుకొని దైనందిన కార్యాలు చేస్తూ సంసార జీవితం సాగించేవాడు అన్ని తత్వాలను తెలుసుకొన్నవాడు అవుతాడని,"అంటాడు.
ఆ విధంగా ఎలాంటి భావోద్వేగాలకు లోనవకుండా మనశ్శరీరాలను అదుపులో ఉంచుకోవాలి.  చిత్రాంగనల చిత్ర పటాలను చూసినా, నిజంగా అటువంటి అందగత్తెలు కళ్ళముందు కదలాడుతున్నా ఎలాంటి విపరీతమైన ఆలోచనలకు లొంగకుండా, ప్రకృతిలో  భాగంగా తలపోస్తూ నిర్వికారంగా ఉన్నప్పుడే  సమాజంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగవు.
కాబట్టి ఈ న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఒక్కటే... కళాకారులు , సృష్టి కర్త వీరిద్దరూ సృష్టించిన చిత్రాలనూ  మనుషులను చూసి  ఎంత గొప్పగా అందంగా సృష్టించారో కదా అనుకుని వారిని సదా స్మరిస్తూ అలాంటివి చూసే భాగ్యం కలిగినందుకు మనం ఎంతో అదృష్టవంతులం అనుకోవాలి. అంతే కదండీ!.

కామెంట్‌లు