సునంద భాషితం- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -515
ఛాయా పిశాచీ న్యాయము
*****
ఛాయ అనగా నీడ . పిశాచీ అనగా దెయ్యం.
ఒకడు తన నీడను చూసి దెయ్యమనే భ్రాంతి చేత భయపడుతూ ఉంటే అతని ఆప్త మిత్రుడు ధైర్యం చెబుతూ అది దెయ్యం కాదు మిత్రమా నీ నీడ ఇదిగో నీ మెడలో ఉన్న గొలుసు చూడు ఈ నీడ మెడలోనూ కనబడుతోంది అని చెప్పి అతని భ్రాంతిని నివృత్తి చేసి భయాన్ని పోగొట్టడంతో స్థిర చిత్తుడయినట్లు... అనే అర్థంతో ఈ "ఛాయా పిశాచీ న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
లేని దానిని ఉన్నట్లుగా ఊహించడం భ్రాంతి.వస్తువుల విషయంలో కానీ,వ్యక్తుల విషయంలో కానీ అన్య వస్తు ధర్మాలు మరియు అనవసర అపోహలు ఆపాదించి భ్రమించడం. దానిని ఆప్తులు హితైషులు వివరంగా చెప్పి ఆ యొక్క భ్రమలను అపోహలను నివృత్తి కలిగింప చేసినప్పుడు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 ఛాయా అనగా మనకు తెలిసిందే. అలాంటి ఛాయను చూసి పిశాచీగా భావించడం అనేది ఒకానొక భ్రాంతి. భ్రాంతి అంటే ఇంగ్లీష్ లో హాలూసినేషన్ అంటారు.ఇది వ్యాధి కాదు కానీ ఊహాత్మక అనుభవం ఆలోచన కలిగి వుండే ఒక లక్షణం.
భ్రాంతులు అనేవి ఇంద్రియాలకు సంబంధించినవి.అందులో స్పర్శ భ్రాంతి,శ్రవణ భ్రాంతి, దృష్టి భ్రాంతి , రుచికి సంబంధించిన భ్రాంతి ..ఇలా పంచేంద్రియాలకు సంబంధించిన భ్రాంతులు ఉన్నాయి.సాధారణంగా భ్రాంతి అనేది భయపెట్టేదిగానో,అసహ్యించుకునేదిగానో వుంటుంది.
భ్రాంతితో భయపడే వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిగా ఉండనీయకూడదు.వాస్తవికతకు దూరం అవుతున్న వ్యక్తిని వెంటనే వైద్యుని వద్దకు తీసుకుని వెళ్ళి మామూలు స్థితికి వచ్చేలా చేయాలి.అలా చేయకపోతే ఆ వ్యక్తిలో ఆందోళనతో కూడిన ఒత్తిడి, నిద్ర లేమి లాంటి అనారోగ్య సమస్యల్లో చిక్కుకు పోయే ప్రమాదము వుంది.
అలాగే కొంతమందికి తమతో బాగా స్నేహం బంధుత్వం కలిగిన వారికి  చేసిన  సేవలో, సహాయం వల్లనో వారి సొమ్ము  తమకు చెందుతుందేమోననే భ్రాంతిలో ఉంటారు.అలా ఆశపడటం, భ్రాంతి చెందని వారు గొప్పవారు అనే అర్థంతో వేమన చెప్పిన పద్యాన్ని చూద్దామా.
పరుల విత్తమందు భ్రాంతి వాసిన యట్టి/పురుషుడవనిలోన పుణ్య మూర్తి/ విశ్వధాభిరామ వినురవేమ!
 ఇలా రకరకాల భ్రాంతులను వీడి వాస్తవికతను అర్థం చేసుకోవాలనే ఉద్దేశమే ఈ "ఛాయా పిశాచీ న్యాయము"లో ఇమిడి ఉంది. దానిని అర్థం చేసుకుని భ్రాంతులను వీడుదాం.అలాంటి భయాలు, భ్రాంతులు మన స్నేహితుల్లో వుంటే పోగొడదాం.


కామెంట్‌లు