సుప్రభాత కవిత ; - బృంద
చీకటికి విఫల యుద్ధం
వేకువకే సఫలమైన విజయం
తూరుపు దిక్కున సంబరం
పుడమికి దక్కిన  మరో వరం

పులకరించిన ప్రకృతిలో
పొటమరించిన ఉత్సాహం
ప్రత్యూషకిరణపు ప్రేమ నిండిన
పలకరింపుకు వందనం

మేఘాల చెక్కిళ్ళ మెరుపుతో
పొంగిన నింగి ఎరుపు రంగు
వింత కాంతులీను హంగులతో
ముకుళిత హస్తాల మైమరపు

జలసిరితో నిండిన మబ్బులు
కురిపించగ పన్నీటి జల్లులు
ఎదురుచూపులు ఫలించి
ఏతెంచిన మిత్రునికై నమస్సులు

కలవరాలు తొలగించి
ఇల వరాలను కుమ్మరించి
కల తీరగా అనుగ్రహించి
తల నిమిరి దీవించి

తక్షణమే తీక్షణ తగ్గించగా
వేడిన వినతుల  మన్నించి
వడలిన పుడమికి కమ్మగా
గ్రీష్మతాపము సడలించమని

వేడుకుంటూ వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు