సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-502
చక్ర భ్రమీ న్యాయము
   ******
చక్ర అనగా చక్రము,గిర్ర, బండి చక్రము, కుమ్మరి చక్రము, విష్ణువు యొక్క ఆయుధ విశేషము.బండి,కల్లు,గుంపు,దండు,జక్కవ పిట్ట,రాష్ట్రము,గుండ్రనిది, గానుగ,నీటి సుడి,సాలి గ్రామములోని చిహ్నము. భ్రమి అనగా గుండ్రముగా తిరుగుట,తిరుగుడు,భ్రమణము,తప్పు అనే అర్థాలు ఉన్నాయి.
చక్రము గుండ్రంగా తిరుగుతూ ఉన్నప్పుడు పైన ఉన్న  అంచు క్రిందికి, క్రింది అంచు పైకి వస్తూ ఉంటుంది.
అనగా  మానవ జీవితం చక్రంలో  కూడా పైన అంచు అంటే బాల్యం క్రిందికి అనగా వృద్ధాప్యంలోకి , వృద్ధాప్యం బాల్యంలోకి వస్తుంది అనే అర్థంతోనూ ...
 "నేను అనగా ఈ శరీరము మాత్రమే అన్న భావనతో మూలాధార చక్రములో  తిరుగుతూ వుంటాము.ఆ తర్వాత నాది,నా ఇల్లు,నా పిల్లలు,నా కులము,నా మతము అనే భావనతో హడావుడి చేస్తూ స్వాధిష్ఠాన చక్రములో గిరగిరా తిరుగుతూ వుంటామనే అర్థంతోనూ.
ఇక మూడవది మనకున్న జ్ఞానము,అనుభవ సారాన్ని బట్టి మనదైన వ్యక్తిత్వంతో మణిలా వెలుగుతూ మణిపూరక చక్రములోకి ప్రవేశిస్తాము. ఇలా మూడు రకాల కర్మ సంబంధమైన చక్రాలలో చిక్కుకుని తిరుగుతుంది మానవ జీవితమనే అర్థంతోనూ జీవితాన్ని "చక్ర భ్రమీ న్యాయము"తో మన పెద్దలు పోల్చి చెప్పారు.
ఇక మానవుడి గురించి  చెప్పాలంటే లక్షల జీవరాసులలో ప్రత్యేకమైన ఆలోచనా శక్తి వున్న వ్యక్తిగా జీవితాన్ని  గడుపుతూ ఉండటం మనకు తెలిసిందే. ఆలోచన అవగాహన జీవన పరమార్థం ఏమిటో తెలుసుకోగల విచక్షణ వివేచన వివేకం మానవుడిలో వున్నాయి.
ఈ విధంగా పుట్టినప్పటి నుంచీ  బాల్యం, కౌమారం, యవ్వనం వైవాహిక జీవితాన్ని అనుభవిస్తూ సంతానోత్పత్తి చేయడం, పిల్లల్ని పెంచడం ... మళ్ళీ  వారు పెద్దవ్వడం తల్లిదండ్రులవడం , వృధ్ధులవడం... ఇలా మానవ జీవితంలో జనన మరణ చక్రభ్రమణం   నిరంతరం సాగుతూనే ఉంటుంది.
 అయితే ఆధ్యాత్మిక వాదులు ఏమంటారంటే  ఈ  నిరంతర మానవ జీవన చక్రంలో మనిషి జన్మ  గొప్పది కాబట్టి ఈ  జన్మలో ధర్మబద్ధంగా జీవించకపోతే  మళ్ళీ మళ్ళీ వివిధ రకాల జంతువుల జన్మలు ఎత్తాల్సి వస్తుందనీ అంటారు.
 ఇక మహాభారతంలో   భీష్ముడు కాలాన్ని కాల సర్పమనీ మహా కాల చక్రమని చెబుతూ ఇలా అంటాడు." కాలం చాలా కఠినమైనదీ,దయాదాక్షిణ్యాలు లేనిదనీ ,కాలభ్రమణాన్ని ఆపడం ఎవరి తరం కాదని అంటాడు. అలా కాల చక్ర భ్రమణంలో మానవుడు  పుట్టి పెరిగి  అందులోనే లీనమై పోతాడనీ అలా లీనమై పోవడాన్నే కాలధర్మం చెందడం అంటారని కూడా చెబుతాడు.
 ఇలా కాల  మానవ జీవన చక్ర భ్రమణం,ఆధ్యాత్మిక కర్మల చక్ర భ్రమణం,కాల చక్ర భ్రమణం... ఇలా మూడింటి మధ్య మానవుడే కాదు ఇతర జీవరాశి కూడా పుడుతూ గిడుతూ నిరంతర  చక్ర భ్రమణంలో భాగమై మనుగడ సాగిస్తూ, సాగిపోతూ ఉంటుంది.
 మరి ఈ చక్ర భ్రమణ బంధంలో జీవితం కొనసాగిస్తూనే బంధాలు అనుబంధాల వలలో చిక్కుకోకుండా ఈ "చక్ర భ్రమీ న్యాయము" లోని అంతరార్థం గ్రహించగలగాలి . అప్పుడే ఈ జగతిపై  పుట్టుకను మానవీయ విలువలతో సార్థకం చేసుకోగలం.మరణించినప్పటికీ అమరత్వం పొందగలం.

కామెంట్‌లు