సునంద భాషితం- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు -516
ఛురికా కూష్మాండ న్యాయము
    ******
ఛురికా అనగా చురకత్తి.కూష్మాండ అనగా గుమ్మడి కాయ, బూడిద గుమ్మడి కాయ.
 "కడివెడంత గుమ్మడి కాయ కత్తిపీటకు లోకువ " అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 అయితే కూష్మాండమునకు అదేనండీ. గుమ్మడి కాయను మామూలుగా భావించకండి.దానికి సంబంధించిన వివరాలు విశేషాలు బోలెడు వున్నాయి.తెలుసుకుందామా మరి.
కూష్మాండ అనే పదం మూడు పదాలతో రూపొందించబడిందనీ అందులో 'కు' అంటే చిన్న అనీ,'ఊష్మా' అంటే వెచ్చదనం మరియుశక్తి అనీ,'అండ' అంటే గుడ్డు అనే అర్థాలు అందులో యిమిడి ఉన్నాయనీ అందుకే కూష్మాండం శక్తి యొక్క బంతి ఆకారాన్ని సూచిస్తుందని చెప్పడం జరిగింది.అలా విశ్వమనే గుడ్డును భరించిన తల్లి "కూష్మాండ మాత" అని అమ్మ వారి భక్తులు చెబుతుంటారు.అంతేకాదు సూర్యుని మధ్యలో నివసించే శక్తి మరియు బలం వుందని ఆమె ప్రకాశం సూర్యునికి ఇస్తుందనీ,సూర్యునికే దిశానిర్దేశం చేసే దేవత అని కూష్మాండ మాత పేరుతో కొలుస్తారు. అలాగే చైత్ర నవరాత్రులలో దుర్గా పూజలో భిన్నంగా నాల్గవ రోజున కూష్మాండ మాతను పూజిస్తారు.
 ఇక ఈ కూష్మాండాన్ని దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం.
 శక్తి వుంటే ఆరాధనలో బలి లేదా త్యాగం అనేవి వుంటాయని ఆరాధకులు చెబుతుంటారు.అందుకే కూష్మాండ మాతకు జంతువుల బలికి బదులుగా సాత్త్వికమైన కూష్మాండ అంటే గుమ్మడి కాయను సమర్పిస్తారన్న మాట.శక్తి మాత అయిన  కూష్మాండ మాతను సూర్య భగవానుడితో సహా అందరు దేవతలు గౌరవిస్తారు .
ఇక ఆయుర్వేదంలో కూడా కూష్మాండాన్ని మేధ్య ఔషధంగా వర్ణించారు. మానసిక అనారోగ్యం పోగొట్టడానికి కూష్మాండం మంచిగా పనిచేస్తుందనీ, ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావం చూపుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.ఇంకా దీనితో చేసిన తీయని వంటకం భలే రుచిగా కూడా ఉంటుంది.'ఆగ్రా కా పేడ్' అని చాలా ప్రసిద్ధి పొందింది ఈ మిఠాయి.
 ఇలాంటి గొప్పదైన కూష్మాండానికి "ఛురికా కూష్మాండ న్యాయమనీ" దీనిని మనుషులకు వర్తింపజేసి చెప్పడం విశేషం.
 బయట ఎంత పేరు ప్రతిష్టలు పొందినా కొందరు ఇంట్లో ఆధిపత్య భావజాలం ఉన్న వారికి అనగా భార్యా,భర్త,పిల్లలా ,పెద్ధలా? ఎవరైనా సరే వారికి ఎదురు చెప్పకుండా వినయంగా తలవంచడాన్ని ఈ "ఛురికా కూష్మాండ న్యాయము"తో పోల్చి చెబుతుంటారు.
 ఏం చేస్తాం? అసలే కుటుంబ బంధం. ఎవరో ఒకరు సర్దుకు పోవాలి తప్పదు.అలా దానిని ఆనందంగా స్వీకరిస్తే ఏ బాధా ఉండదు కదా!
 మొత్తానికి కూష్మాండ న్యాయము ద్వారా అనేక విషయాలను తెలుసుకోగలిగాం.కదండీ!

కామెంట్‌లు