సునంద భాషితం ;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు-498
ఘటీ యంత్ర స్థిత ఘటీ న్యాయము
****
ఘటీ అనగా ఏతము, ఏతాము కుండ ,నీళ్ళు చేదు రాట్నము. యంత్రము అనగా కష్టపడి చేయవలసిన పనిని కష్టపడకుండా చేయునట్లు ఏర్పరచిన సాధనా విశేషము, బీజాక్షర చక్రము, సూత్రము, జంతికలు చేసే సాధన విశేషము,తిరుగలి,ఎండ్రి,ఉపాయము. స్థితి అనగా ఉనికి,కూర్చుండుట,నిలకడ,దశ,ఆస్తి,అర్హత, అధికారము, క్షేమము, నిలుపుదల,మేర అనే అర్థాలు ఉన్నాయి.
  నీళ్ళు తోడే ఏతాము కుండలు ఒకటి క్రిందికి ఒకటి మీదికి పోతుంటాయి. నీళ్ళు తోడటానికి రెండింటిని కలిపి వీటిని వాడినప్పుడు ఒకటి నీళ్ళలోకి పోయి నీళ్ళు నింపుకుని పైకి వస్తుంది.మరొకటి నీళ్ళను కాలువలోకి వదిలి ఖాళీ అవుతుంది.మరొకటి మళ్ళీ  నీళ్ళు నింపుకుంటుంది.
ఇలా ఒకటి నిండుగా మరొకటి ఖాళీగా,నిండుది ఖాళీగా,ఖాళీది నిండుగా ఆ చక్రంలో తిరుగుతూ వుంటాయి.అలా  నిండు ,ఖాళీ తనాలను చూసి మన పెద్దలు కలిమి లేములతో పోల్చుతూ  ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
దీనికి సంబంధించిన ఓ రచయిత రాసిన అర్థవంతమైన పాటను కొంత ( రంగుల రాట్నం సినిమాలోది) చూద్దామా...
"కలిమి అంటే ఉండుట,కలుగుట,సంపద అని అర్థము.లేమి అంటే లేకుండుట, దారిద్ర్యము అనే అర్థాలు ఉన్నాయి." కలిమి నిలవదు లేమి మిగలదు/ కలకాలం ఒక రీతి గడవదు/నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా/ వాడిన బ్రతుకే పచ్చగిల్లదా/ ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం"
 ఇలా కలిమి లేములు కావడి కుండల వంటివనీ, కావడిలో కుండల వలె మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు రెండూ వుంటాయి కాబట్టి వాటిని రెండింటినీ సమానంగా భావించి, సమన్వయం చేస్తూ జీవనయానం చేయాలని అర్థము.
అలాగే వృద్ధి క్షయములు కూడా... చీకటి వెలుగుల వలె చంద్రుని వెన్నెల వలె ఆవేదనలు , ఆనందాలు మనల్ని వెంటాడుతూనే వుంటాయి.అలాగే ఆర్థికంగా కూడా వృద్ధి క్షయములు మన జీవితంలో వస్తూ పోతూ వుంటాయి.
 ఏతాము కుండలో నిండు నీళ్ళలా  సంపాదన బాగా ఉన్నప్పుడు పొంగి పోవడం,గర్వంగా ప్రవర్తించడం కూడదనీ, అలాగే ఏమీ లేనితనం, లేమితనం కూడా ఒకోసారి మనల్నిౠౠఃఃటః ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటప్పుడే దానిని అధిగమించేందుకుః ప్రయత్నం చేయాలి కానీ నిరాశ పడకూడదనే జీవిత సత్యాన్ని గ్రహిస్తే ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెరుగుతుందని అంటారు.
 ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఈ "ఘటీ యంత్ర స్థిత ఘటీ న్యాయము"ద్వారా ఏతాము కుండలతో మనకు జీవితం అంటే ఏమిటో అవగాహన పరిచిన మన పూర్వీకుల మాటలను సదా గమనంలో ఉంచుకోవాలి. సమస్యలను, ఎదురయ్యే మంచి చెడు స్థితులను స్థితప్రజ్ఞత తో అధిగమించాలి .

కామెంట్‌లు