శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి పద్యములు 
==============
56.
దాన మేమియు జేయక దయను వీడి 
లోభినై సంచరించితి లోకమందు 
నాశ పాశమై బంధించె నాదు కొనుచు 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
57.
కర్మ ఫలముల రజ్జువు గట్టి వేయ 
కాకు నొందితి నో దేవ !గాంచ వేమి? 
ధర్మ మంతయు దెలిసిన దైవ మీవు 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//
58.
ధనము కులమని నమ్మితి దారి దప్పి 
వినక సుమతుల మాటలు వింతగాను
గట్టు తప్పిన పశువుగ గలియ తిరుగు 
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!/
59.
దండి తనమును జూపగ ధనము లేదు 
వెంట వచ్చెడి జనులేరి? వెదికి చూడ 
నిన్ను నమ్మితి విడువక నిక్క మిదియె 
నన్ను బాలింపు మాల్యాద్రి నార సింహ!//
60.
 శేష శయనుడ నీతోడి చెలిమి జేయ 
వచ్చి చేరితి నీ జెంత పట్టు పట్టి 
కనుల కింపుగ గనిపించి కామితముగ
నన్ను బాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు