*"పెంపకం"* ;- -డా.వాసరవేణి పరశురాం-బాలసాహిత్య రచయిత, పరిశోధకులు, సింగారం, రాజన్న సిరిసిల్ల.

 నారాయణపురం ఊరిలో నారాయణ, లక్ష్మీ దంపతులున్నారు. వీరికి రాహుల్ అను కొడుకు ఉన్నాడు. రాహుల్ 3వ తరగతి చదువుతున్నాడు. అల్లరి పిలగాడు.కారణంలేకుండానే తోటి  పిల్లలను కొడుతాడు. వస్తువులు పగలగొట్టి సంబరపడుతాడు.తల్లిదండ్రి రాహుల్ను బడికి పంపుతున్నారు.
       రాహుల్ ఒకరోజు బడిలో తోటి విద్యార్థుల బ్యాగుల్లో కలర్  పెన్సిల్లు దొంగతనం చేశాడు. ఇంటికి వచ్చిన తరువాత వాటితో గోడలపైన, తలుపులు పైన అడ్డదిడ్డంగా రాసాడు. రాతలను చూసిన తల్లి లక్ష్మీ ఏంరాస్తున్నావురా? అని గదిరించింది. దగ్గరకు వెళ్లి రంగు పెన్సిల్లు గుంజుకుంది. ఇవి ఎక్కడియిరా నాన్న నేను కొనివ్వలేంకదా అని గట్టిగా అడిగింది. ఆ..నాయే. నేను దుకాణంలో కొనుకున్నా అని  చెప్పాడు. తల్లి అబద్దం చెపుతున్నాడని ఒకటి తగిలించింది. ఏడుస్తూ అమ్మ కొట్టద్దమ్మా అంటు ఏడ్చాడు. బడిలో  తోటి వారి బ్యాగుల్లో దొంగతనం చేశానని చెబుతాడు.  దొంగతనంచేస్తావా అంటూ మల్లొకటి తగిలించింది. వాళ్ల రంగు పెన్సిల్లు వాళ్లకి ఇచ్చేయ్ లేకపోతే తోలు తీస్తా అని బెదిరిస్తుంది. దొంగతనం చేయొద్దని మళ్లీ ప్రేమగా బుదరకించి చెబుతుంది.
        బడిలో ఒకరోజు తోటి విద్యార్థి రఘు చక్కగా రాసుకుని బుక్, పెన్ను బ్యాగు పైన పెట్టి నీళ్లు తాగడానికి పోయాడు. రాహుల్ రాసిన రాతను చిందరవందరగా గీసేస్తాడు. పెన్ను విరగ్గొట్టి పెడుతాడు. ఏమి చేయనట్లు నిశ్శబ్దంగా కూర్చుంటాడు .రఘు వచ్చి చూసి ఏడుస్తూ టీచరుకు చెబుతాడు. టీచరు ఎవరు గీసారో, విరగొట్టారో చెప్పండి.లేకపోతే దెబ్బలు తప్పవంటుంది. ఎవరు చెప్పరు. ఎప్పుడు అల్లరిగా ఉండే రాహుల్ నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అనుకుని రాహుల్ని ప్రశ్నిస్తుంది.  నాకు ఏమి తెలియదు టీచర్. నేను చక్కగా కదలకుండా ఇక్కడే కూర్చొని ఉన్నాను అంటాడు. కట్టెలేపి రాహుల్ నువు చేసేది చేసి ఏమి ఎరుగనట్టు నటిస్తున్నావు.  నీవే కదా చేసింది అని బిగ్గరగా అడుగుతుంది. భయపడిపోయిన రాహుల్ నేనే గీసి విరగొట్టాను టీచర్ అంటాడు. అయినా టీచర్ రెండు దెబ్బలు కొడుతుంది. వద్దు టీచర్ ,వద్దు టీచర్ అని ఏడుస్తాడు.బడిలో బుద్దిగా ఉండి చదువుకోవాలి  ఇలాంటి  చెడుగు పనులేందనీ అడుగుతుంది.బుద్ధిగా చదువుకో అని ఓదార్చి చెబుతుంది .
       సాయంకాలం ఇంటికి వెళ్ళుతున్న సమయంలో రాహుల్  పవన్ మొఖంపై పెన్నుతో  గుచ్చి ఉరుకుతాడు. పవన్ అమ్మా అని ఏడుస్తూ కూలబడి పోతాడు. పిల్లలందరూ టీచరుకు చెప్పగానే వచ్చి ఫస్ట్ ఏయిడ్ చేస్తారు.రాహుల్ దొరుకలేదు.పారిపోయాడు. పిల్లలందరూ రాహుల్ పెట్టిన ఇబ్బందులను ఒక్కసారిగా చెబుతారు. టీచర్ రాహుల్ తల్లిదండ్రిని పిలిపించి మాట్లాడుతాను. మీరు వెళ్ళండి అంటుంది.
      రాహుల్ ఇంటికి వెళ్లుతూ పిల్లలు  ఎవరు లేకపోవడం చూసి ఒక ఇంటి ముందర ఉన్న చిన్న సైకిల్ దొంగతనంచేసి తన ఇంట్లోకి తీసుకెళ్లి కనపడకుండా  పరదా కప్పుతాడు.ఏమి ఎరుగనట్టు బుద్ధిమంతుడు లాగ ఉంటాడు. సైకిల్ పోయినవారు రాహుల్ తీసుకొచ్చాడనీ తెలిసి ఇంటిముందర  లొల్లి లొల్లి జేస్తారు. ఏమి తెలియని నారాయణ, లక్ష్మీ  మా రాహుల్ తీసుకురాలేదు మీరు వెళ్ళండి అంటారు.మీ కొడుకును పిలువండి మేము అడుగుతాం అంటారు. పిలువగానే వచ్చిన రాహుల్ నేను తీయలేదు అమ్మా అని ఉత్తముడులాగా చెప్తాడు. నీవే తెచ్చావనీ చూసిన చింటు మాకు చెప్పాడు అన్నారు. అవమానంతో ఊగిపోయిన నారాయణ రాహుల్ ను తెచ్చావా లేదా అని బెదిరించి రెండు దెబ్బలు కొడుతాడు. భయపడిపోయిన రాహుల్ తెచ్చాను నాన్న ఇంట్లో పరదాకింద దాచాను .అనగానే తల్లి తెచ్చి  ఇస్తుంది. నీకు ఇలాంటి దొంగ పనులు, అల్లరి పనులు ఎందుకు?  మేము కొనిస్తామ్ కదా! బుద్దిగా చదువుకో అని కోప్పడుతుంది. అందరు ఇవేంపనులనీ తిడుతారు. సైకిల్ తీసుకుని వారు వెళ్ళిపోతారు. నారాయణ, లక్ష్మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. రాహుల్ పెంపకంలో మనము జాగ్రత్తపడాలి. లేకపోతే మన కుటుంబానికే కాదు ఈ ప్రపంచానికే ప్రమాదం. "మొక్కై వంగనిది మ్రానై వంగునా" అంటారు కాబట్టి బాల్యం నుండి సరిగా పెంచాలి.
       రాహుల్ ఇంట్లోకి వెళ్లి అందరు నన్నే తిడుతున్నారనీ ఏడుస్తూ అలిగి కూచుంటాడు. నారాయణ,  లక్ష్మీ ఇలాంటి లక్షణాలు ఎందుకొచ్చాయి ఈ రాహుల్కు అనుకుంటూ ఎలాగైనా మార్చాలనీ నిర్ణయించుకుంటారు.  ఇంతలోనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడునుండి ఫోన్ వస్తుంది. తల్లి దండ్రులు ఇద్దరు రేపు  పాఠశాలకు రావాలనీ చెబుతాడు. ఒక్కసారిగా రాహుల్ అక్కడ ఏమి చేసాడో అని భయపడుతారు. లక్ష్మీ రాహుల్  దగ్గరగా వెళ్లి మాట్లాడుతుంది.  నాయనా ఏమి అల్లరి, దొంగపనులు. నీకు అన్ని తెస్తున్నాము బుద్ధిగా చదువుకోవచ్చు కదా అంటుంది .చిన్న పిల్లాడివి.ఇప్పుడే ఇలా ఉంటే పెద్దైన తర్వాత గజ దొంగగా, రౌడీగా తయారు అవుతావేమోననీ మాకు భయమవుతుంది అంటూ కోప్పడుతుంది. అందరు నన్నే తిడుతారు,కొడుతారు,కోప్పడుతారు.అని బిగ్గరగా ఏడుస్తాడు. నాయనా ఏడువకు.నిన్నే ఎందుకు  తిడుతారో ఆలోచించు చక్కగా చదువుకో.ఇప్పుడు తిని పడుకో అని ఓదార్పుతో బుదరకిస్తూ అంటుంది.
      తెల్లవారి నారాయణ , లక్ష్మీ  పాఠశాలకు వెళ్లి నమస్కారాలు హెచ్.ఎమ్ గారు అంటారు. హెచ్.ఎమ్ గంగారాం ప్రతి నమస్కారాలు చేసి. నారాయణ లక్ష్మీ గార్లు కూర్చొండి అంటాడు.అలాగే రాహుల్ ను ఆ క్లాస్ టీచర్ ను పిలువండి అని అటెండర్కు చెబుతాడు. రాగానే టీచర్ అంతకు ముందు రోజు జరిగిన సంఘటన పిల్లలు చెప్పిన బాధలు అన్నీ వివరంగా చెబుతుంది. రాహుల్ పాఠశాలలో అల్లరి పనులు చేస్తున్నాడనీ, నిన్న పవన్ మొఖంపై పెన్నుతో గుచ్చాడు. ఇంకా కంట్లో గుచ్చిఉంటే కన్ను పోయేది.చికిత్స చేయించాము.వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడి సర్ధి చెప్పాము అంటుంది. రాహుల్కు టి.సి ఇచ్చి పంపించండి అతడిని మార్చలేము అంటుంది టీచర్. రాహుల్ ఒక్కసారిగా భయపడిపోతాడు. తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారు. 
       ప్రధానోపాధ్యాయుడు కలుగజేసుకుని ఏమయ్యా రాహుల్ నీవు చేసే దుడుగు పనులు ఇలా ఉన్నాయి . నీతోనే  పాఠశాలకు చెడు పేరు వస్తుంది.ఏమంటావు చెప్పు? అని అడుగుతాడు .సార్ నేను చక్కగా చదువుకుంటాను. ఎవరినీ ఏమీ అనను. నేను దొంగతనం చేయను అంటాడు రాహుల్.మాటలు కాదు చేతలల్లో చూపాలి. ఇప్పుడు నటిస్తావు. తర్వాత ఎప్పటోలే చేస్తావు. ఎట్లా నమ్మేది అంటాడు ప్రధానోపాధ్యాయుడు .రాహుల్ ఏడుస్తూ నేను చక్కగా చదువుకుంటాను. నాకు టి.సి ఇవ్వొద్దని ఏడుస్తూ బతిమాలుతాడు.అది చూసి అందరూ బాధపడుతారు. రాహుల్ ను క్లాస్ రూంకు వెళ్లుమంటాడు ప్రధానోపాధ్యాయుడు. 
          పెద్ద సార్ తల్లిదండ్రులతో మీ పెంపకం కూడా సరిగా ఉండాలి. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండాలి.  ఇప్పటికీ మించినది ఏమిలేదు. మేము గురువులుగా ఒక అవకాశం ఇస్తున్నాము.ఇప్పుడు దండించినంత మాత్రానా ఒకేసారి మార్పురాదు.మీరు మేము రాహుల్ ను ఉత్తముడుగా తీర్చిదిద్దాల్సిన బాద్యత మనపై ఉంది.  పాఠశాలలో ఇంకా రాహుల్ పైన ప్రత్యేక శ్రద్ధ పెడుతాము. కౌన్సిలింగ్ ఇస్తూ బోధన చేస్తాము. అలాగే మీరు తల్లిదండ్రులుగా ప్రతిరోజూ చదువుతున్నాడా? అల్లరి, దొంగతనాలు ఏమైనా చేస్తున్నాడా? ఎలా నడుచుకుంటున్నాడో నిఘా పెట్టండి అంటాడు.  నారాయణ లక్ష్మీ గార్లు మేము పిల్లవాడిపై శ్రద్ధ పెడుతున్నాం మా పెంపకం సరిగానే ఉంది.ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్ధం కావడంలేదు అంటారు. ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ మీరు పట్టించుకోవడం లేదనీ నేను అనడంలేదు. పాఠశాలనుండి పోయిన తర్వాత  మీ ఇంటిదగ్గరనే ఎక్కువగా  ఉంటాడు.తల్లిదండ్రులుగా  ఇంటివద్ద మీరు , గురువులుగా పాఠశాలలో మేము సరిగా శ్రద్ధ తీసుకుని బుద్ధులు చెబితే ఎలాంటి విద్యార్థులు అయిన మంచి మార్గంలో పయనించి ఉత్తమ పౌరులుగా రాణిస్తారని  అంటాడు. సరే మేము ఇంటికి వెళ్తాము  అనగానే వెళ్లి రండి. అంటాడు ప్రధానోపాధ్యాయుడు.
      పాఠశాలలో పిల్లలు రాహుల్ దగ్గర కూర్చోవడానికి ఇష్టపడరు. సరిగా మాట్లాడరు.దూరం దూరం ఉంటారు. రాహుల్ బాధపడుతాడు. ఇంటికి వెళ్ళిన తరువాత రూంలో కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తాడు. నన్ను ఎందుకు దూరం కొడుతున్నారు? నాతో ఎందుకు మాట్లాడడంలేదు? నన్ను వింతగా చూస్తున్నారు ఎందుకు? నేను ఏమి తప్పులు చేశాను చేస్తున్నాను?. అమ్మా,నాన్న, గురువులు ఎందుకు కోప్పడుతున్నారు? అనుకుంటూ దీర్ఘాలోచనలోపడుతాడు.  తల్లి లక్ష్మీ కొడుకు రాహుల్ ను చూసి దగ్గరకు వచ్చి నాయనా ఎందుకో బాధగా ఆలోచిస్తున్నావు. అందరు నీ మంచికే చెప్పారు. ఇప్పటికైనా అల్లరి, దొంగతనాలు, చెడు పనులు మానుకో . బుద్ధిగా చదువుకో. గురువులు అమ్మా నాన్న చెప్పిన మంచి మాటలు విను. ఎవరినీ ఏమనకూ,అందరితో స్నేహంగా ఉండు. టి.వి, సెల్ ఫోన్లకు అతుక్కపోవద్దు. సోమరితనం విడువు. సమయపాలన పాటించు. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించు.పిన్నలను, తోటి వారిని అభిమానించు. ప్రణాళిక బద్దంగా చదువు. నీవు పెద్ద ఆఫీసర్ కావచ్చు అంటుంది.శ్రద్ధగా వింటాడు .రాహుల్ నీవు పెద్దయ్యాక ఏమి కావాలనుకుంటున్నావు?  అడుగుతుంది తల్లి .ఐ.పి.ఎస్ అంటాడు .వెరీ గుడ్. ఐ.పి.ఎస్ గురించి నీకేమి తెలుసు? . మొన్న మా క్లాసులో టీచర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అని చెప్పింది అంటాడు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటే తొలిగించవచ్చనీ, రక్షణ కల్పించవచ్చనీ , దొంగతనాలు నివారించవచ్చనీ, శాంతి భద్రతలు కాపాడవచ్చనీ చెప్పింది అంటాడు. నేను బాగా చదివి ఆ ఉద్యోగం సాధిస్తాను అంటాడు. నాయనా ఏకాగ్రత,పట్టుదల, శ్రమించడం చేయాలి ఏదైనా సాధించవచ్చు అంటుంది.
       రాహుల్ ఎలాగైనా ఐ.పి.ఎస్ కావాలని కలలు కంటాడు. నిత్యం ఉదయం లేవడం సమయం ప్రకారం పనులన్నీ పూర్తి చేసుకుంటాడు. పాఠశాలకు వెళ్లడం, గురువులు చెప్పింది శ్రద్ధగా వింటాడు. తోటి విద్యార్థులతో చక్కగా మెదులుతాడు. ఎవరినీ ఏమీ అనడు. రోజు ఐ.పి.ఎస్ కావాలని అదే ఆలోచన.తగిన వ్యాయామం చేస్తాడు. రక్షణ బాధ్యతలు చేపట్టాలనీ ఉవ్విళ్లూరుతుంటాడు. సంవత్సరాలు గడుస్తాయి. చదువు పూర్తి చేసుకుంటాడు. ఐ.పి.ఎస్ పరీక్షలు రాసి టాపర్గా నిలుస్తాడు. ఉద్యోగం సాధిస్తాడు.చక్కగా విధులు నిర్వహించి అందరి మెప్పు పొందుతాడు.అవమానించినవారే ఔరా అని ఆశ్చర్యపోతారు.అందరికీ రాహుల్ ఆదర్శంగా నిలుస్తాడు.
  

కామెంట్‌లు