నర్మదా నదీ పుష్కరాలు- సి హెచ్ ప్రతాప్

 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒక్కో నదికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాల వేడుకలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మే 1వ తేదీ నుంచి నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ పుష్కరాలకు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గురుడు వృషభరాశిలో ప్రవేశించిన సమయం నుంచి 12 రోజుల పాటు నర్మదా నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ సమయంలో నదిలో పుణ్య స్నానం ఆచరించి, పేదలకు దాన ధర్మాలు చేయడం, పిండ ప్రదానాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.నర్మదా నదికి హిందూ మతంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో జన్మించిన నర్మదా నది.. గుజరాత్‌లోని భరూచ్‌ జిల్లా మార్గాన ప్రవహించి చివరిగా అరేబియా సముద్రంలో కలుస్తుంది. శివుని సన్నిధి ద్వారా పవిత్రం చేసిన నదిగా భావిస్తారు.నర్మదా నదిని ‘‘రేవా నది’’ అని కూడా పిలుస్తారు. పుష్కర నదుల్లో నర్మద అత్యంత ప్రత్యేకమైంది. నర్మదా నది ‘‘రుద్ర సంభవ’’. అంటే సాక్షాత్తూ శివుని శరీరం నుంచి ఆవిర్భవించింది. ‘‘నామృతా నర్మదా’’ అని కూడా అంటారు. అంటే మృతము లేనిది. శాశ్వతమైందని అర్థం. వింధ్య పర్వత శ్రేణిలో తూర్పున అమరకంటక్‌లో ఆవిర్భవించి, పశ్చిమ దిశగా… మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌లో వేలాది మైళ్లు ప్రవహిస్తుంది. ఎన్నో పుణ్య క్షేత్రాల గుండా ప్రవహిస్తుందిభక్తులు తమ పాపాలను ప్రక్షాళన చేసేందుకు పవిత్ర జలాలలో పవిత్ర స్నానాలు చేస్తారు. నర్మదా నది పుష్కరాలు మే 1న ప్రారంభమై మే 12 వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. ఈ 12 రోజుల కాలం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. పుష్కరాలలో మొదటి 12 రోజులు ఆది పుష్కరం, చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అయితే, పుష్కరాలను నిర్వహించే మొదటి 12 రోజులు, చివరి పన్నెండు రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడని.. ఈ సమయంలో పవిత్ర నది స్నానమాచరిస్తే సకల తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కి, మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. 
కామెంట్‌లు