శ్రమైక శక్తి., డా. శాస్త్రుల రఘుపతి.,
=
      🚩కంద పద్యము 
శ్రమజీవుల స్వేదమె క్షే
మము గూర్చుచు పుడమి తల్లి, మన్ననలు గనున్
తమతమ ఱెక్కల దాచక
శ్రమ నోర్చెడు వారలకు సలాములు జేతున్ (1)
        🚩 కంద పద్యము 
ఆకలి దప్పుల నెఱుగరు
పీకల లోతున నిడుమల వేదన గనుచున్
చే కలిమిని ఉత్పత్తుల
సాకెడు జనములకు నిడుదు సన్నుతులు తగన్ (2)
      🚩 కంద పద్యము 
శ్రమయే జయము నొసంగును
శ్రమ పడిననె బ్రతుకు బండి సాగుచు నుండున్
తమతమ శ్రమలను పంచెడు
శ్రమ జీవుల కెపుడు నే సలాములు జేతున్ (3)
         🚩 తేట గీతి పద్యము 
పుడమి తల్లి ఋణమ్మును భూమి పైన
శ్రమలు పడుచుండు కార్మిక జాల ఋణము
తీర్చు కోలేనిదేమియు కూర్చలేము 
క్షితిని శ్రమ జీవుల గని రక్షింప వలయు! (4)

కామెంట్‌లు