సుప్రభాత కవిత ; -బృంద
చీకటి కోస్తూ వెలుగులు పంపి
రేపు ను తెస్తూ కిరణాలొస్తే
ఆశలు మోసులు వేసేలా
ఆరాటాల నాట్యాలెందుకో!

దిక్కు తోచని సమస్యలన్నీ
పక్కకు తొలిగే తరుణమేదో
ఒక్కసారిగా తోసుకుంటూ
చక్కగ  చేరవచ్చేనేమో!

ఇదివరకెరుగని ఆనందాలు
ఇదిగో నీకోసమే తెచ్చానంటూ
దోసిలి నిండా నింపేస్తూ
మురిపించే ముచ్చటలేమో!

దూరాలన్నీ చెరిపేస్తూ
భారాలన్నీ దింపేస్తూ
చేరాల్సిన తీరాలన్నీ
చేరువ చేసే యోచనేమో!

నిరతము మెదిలే తలపులన్నీ
నిజమయ్యే  పండుగరోజు
విజయాలే వసంతాలుగా
వెల్లి విరిసేలా చేసే వరమేమో!

అలసిన మనసును అక్కున జేర్చి
అలజడులన్నీ  అణచివేసి
అంబరమంటే ఆనందాలను
అనుగ్రహించే అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు