సునంద భాషితం;- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -489
గోబలీవర్ద న్యాయము
  ******
గో అంటే ఆవు, భూమి, వాక్కు ,సరస్వతి, తల్లి, దిక్కు, ఎద్దు,కిరణము, స్వర్గము, చంద్రుడు, వజ్రాయుధము,కన్ను అనే అర్థాలు కలవు. బలీవర్ద అనగా ఎద్దు.
గో శబ్దమునకు ఆవులు, ఎద్దులు అని  కూడా అర్థముంది.బలీవర్ద శబ్దమునకు ఎద్దులని అర్థము.గోబలీవర్ద మనునపుడు అందులో బలీవర్ద శబ్దం వున్నప్పటికీ ఆవులే అని చెప్పడం.అంటే గోవుల సమూహంలో రెండూ ఉన్నప్పటికీ గోవులుగానే పరిగణించడాన్ని  "గోబలీవర్ద న్యాయము" అంటారు.
అనగా ఆవులు ,ఎద్దులు,దూడలు మొదలై వాటన్నింటినీ కలిపి పశువులనే అంటాం కదా! అలా అన్న మాట.
కుటుంబం అంటే ఒకే ఇంటిలో నివసించే వ్యక్తుల సమూహము.ఉదాహరణకు కుటుంబం గురించి చెప్పేటప్పుడు ఫలానా వారి కుటుంబం అని మొత్తానికి వర్తింపజేసి చెబుతారు కానీ ఆ ఇంట్లో అమ్మ,నాన్న,పిల్లలు, పెద్దలు అని విడదీసి చెప్పరు.
గొర్రెల సమూహాన్ని గొర్రెల మందనీ,ఆవుల సమూహాన్ని ఆలమందని అంటారు.
ఇలా మంద, సమూహము,గుంపు,దళం,బృందం అనే పేర్లతో ఆయా వర్గాల ,జాతుల సమూహాలను పిలుస్తారు.
వీటన్నింటిలో కొన్నింటికి,కొందరికి మాత్రమే ప్రత్యేకమైన పేరుతో గుర్తింపు వుంటుంది.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే  పాఠశాలలో ఫలానా తరగతి  విద్యార్థులు అని చెప్పినప్పుడు అందులో విద్యార్థినీ విద్యార్థులూ ఉంటారు.అయితే ఇక్కడ విద్యార్థి అనే పదం బాలుడికి మాత్రమే వర్తిస్తున్నట్లు అనిపిస్తుంది.కానీ  విద్యార్థులు అన్నప్పుడు అందులో బాలురు,బాలికలూ ఉంటారు.
ఇలా ఒక గుంపు లేదా సమూహము గురించి చెప్పుకునేటప్పుడు  అందులో కొందరు అసలే గుర్తింపుకు రారు .అనగా  "గుంపులో గోవిందా" లో వలె ఎవరో  ఏమిటో తెలియదు.అలాంటి పరిస్థితిని  ఉద్దేశించి ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 దీనికి సంబంధించిన మరో ఉదాహరణ కూడా చూద్దాం.రాజ్యము లేదా ప్రభుత్వ పాలనల విషయం లోనూ,సంస్థల లేదా పాఠశాలల నిర్వహణలోనూ ఖ్యాతి, అపఖ్యాతి, మంచి ,చెడుల పేరు వచ్చేది  వాటిని నిర్వహించే ముఖ్య బాధ్యులకే గానీ అందులో పనిచేసే వారికి రాదు.వాళ్ళు ఎంత సేవలు, సహకారం అందించినా అనామకంగానే ఉంటారు.గోబలీవర్దలో బలీవర్దల్లాగా... అనగా సమూహంలో ఏదైతే ఎక్కువ సార్లు చెప్పుకో బడుతుందో, ఏదైతే ప్రధాన పాత్ర పోషిస్తుందో అదే శాశ్వతమైన పేరుతో చెప్పబడుతుంది.
ఇదండీ "గో బలీ వర్ద న్యాయము" అంటే... గో అనేది మిగిలిపోయి బలీవర్ద అనామకం అయ్యింది."సొమ్మొకడిది సోకొకడిది" ,"కష్టమొకడిది- ఫలితమొకడిది "అనే  సామెతలు పూర్తిగా నిజం కాకపోయినా ఎంతో కొంత నిజం ఉందని ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు