ధనాపురం ధనవంతుని కథ (డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212)

 శాంతయ్య అనే సాధువు ధనాపురం అనే ఊరికి వచ్చాడు. ఆయనకు చాలా మహిమలు వున్నాయని పెద్ద పేరు. నీటితో దీపం వెలిగించగలడని, ఖాళీ చేతిలోకి విభూది రప్పించగలడని, పాలను నీళ్ళుగా... నీళ్ళను పాలుగా చేయగలడని, భూమిలో ఎక్కడెక్కడ దాచి పెట్టిన లంకెబిందెలు కనుక్కోని బైటకు తీయగలడని కొందరు గుసగుసగా చెప్పుకొంటుంటే మరి కొందరు తప్పెట కొట్టినట్టుగా చెప్పుకోసాగారు.
ఆ ఊరిలో సందుకొక ధనవంతుడు వున్నాడు. వాళ్ళలో రంగయ్య ఒకడు. అతడు పెద్ద పిసినారి. ఆశపోతు. ఎంగిలి పళ్ళాన్ని గూడా నాలికతో నాక్కొని నాక్కొని తినే రకం.
ఒకరోజు ఎవరూ లేని సమయంలో సాధువును చేరి “సామీ... మా తాత ముత్తాతలు చాలా ధనవంతులు. అప్పటిలో నగలు వరహాలు దొంగలు ఎత్తుకు పోకుండా భూమిలో దాచి పెట్టేవాళ్ళట కదా. పొరపాటున వాళ్ళు అనుకోకుండా ఒక్కసారిగా చనిపోతే ఆ దాచిపెట్టిన సొమ్ము ఎక్కడుందో, ఎవరికీ తెలికుండా భూమిలోనే వుండి పోతుంది గదా... అలా మాకు చెప్పకుండా మా పెద్దల్లో ఎవరైనా ఎక్కడైనా ఏమైనా దాచి పెట్టారా" అని అడిగాడు.
సాధువు చిరునవ్వు నవ్వి “చూడు నాయనా... కళ్ళు మూసుకొని కాలు కదపకుండా ఇక్కడ కూచోని సమాధానం చెప్పడం అంత సులభం కాదు. ఒక్కసారి మీ ఇళ్ళంతా కిందికీ మీదికీ పరిశీలించి అప్పుడు చెబుతాను" అన్నాడు.
ఆ రోజు సాయంకాలం సాధువు రంగయ్య ఇంటిలో అడుగు పెట్టాడు. ఒక్కొక్క గదే ఆగి పరిశీలనగా చూసి తిరిగిన చోటే మరలా తిరుగుతా నేలకు చెవి పెట్టి ఏదో విని, ఆకాశంలోకి చూసి కాసేపు గొణిగి, ఇంటి వెనుక పెరటిలోని చింతచెట్టు దగ్గరికి సక్కగా వచ్చాడు. పలుగూ పారా తెప్పించి అరగంట తవ్వగానే ఒక చిన్న రాగి చెంబు కనబడింది. దానిపై కట్టిన బట్ట చినిగి మట్టి గొట్టుకొని వుంది. బెరబెరా దాన్ని బైటికి తీసి ఆశగా తెరచి చూశాడు. దాని నిండా వెండి నాణేలు ధగధగలాడుతా కనబడ్డాయి. రంగయ్య వాటిని చూసి సంబరపడ్డాడు.
సాధువు కాళ్ళకు వినయంగా మొక్క “సామీ... వెండి వరహాలేనా, బంగారు వరహాలు ఎక్కడా లేవా" అని అడిగాడు.
సాధువు చిరునవ్వు నవ్వి “చూడు నాయనా వెండి వరహాలులు భూమికి పైపైనే పాతి పెడతారు. కాబట్టి కనుక్కోవడం సులభం. కానీ బంగారు వరహాలు నిండిన లంకెబిందెలు మరింత లోతులో ఎవరికీ కనబడకుండా దాచిపెడతారు. వాటిని వెదకడం అంత సులభం కాదు. కేవలం పున్నమి రోజున చందమామ నుండి వచ్చిన కిరణాలు భూమి పొరల్లోకి చొచ్చుకుపోయి బంగారు నగలు, వరహాల మీద పడి ధగధగ మెరిసి కాంతులు వెదజల్లుతాయి. వాటిని కనుక్కొవడం కోసం ఎన్నో పూజలు చేయాల" అన్నాడు.
ఆ మాటలకి రంగయ్య చిన్నగా “సామీ పున్నమి దగ్గరలోనే ఇంకో పది రోజుల్లో వుంది. మా ఇంటికి వచ్చి మాకు సాయం చేయండి. మీ ఋణం వుంచుకోను. దొరికిన దానిలో నాలుగవ వంతు మీ చేతిలో పెడతాను" అన్నాడు. ఆ మాటలకు సాధువు ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు.
కోపంతో ఊగిపోయాడు. "కటిక నేల మీద పడుకొని, పచ్చి కూరగాయలు, పళ్ళూ తింటూ, నిరంతరం ఆ దేవున్నే పూజించే నాకే లంచం ఆశ జూపుతావా. భవనాలు, వరహాలు, నగలు, విందులు, వినోదాలు నీలాంటి చెత్త మానవులకేగాని అన్నీ వదిలేసిన మాలాంటి సాధువులకు కాదు" అంటూ అక్కడినుండి వెళ్ళబోయాడు.
రంగయ్య ఆ సాధువు కాళ్ళమీద పడి “అయ్యా... బుద్ధి గడ్డి తిని పొరపాటున నోరు జారాను. ఈ ఒక్క తప్పుకు మన్నించి ఆ లంకెబిందెలు దొరికే దారి చూపండి” అంటూ పట్టుకున్న కాళ్ళు వదలలేదు.
దానితో ఆ సాధువు కోపం తగ్గి “సరే” అంటూ పెరడంతా తిరుగుతూ ఒకచోట ఆగి, అక్కడ చిన్న ముగ్గు వేసి, జోలె లోంచి ఒక దేవుని బొమ్మని తీసి ముగ్గు నడుమ పెట్టి, రెండు నిమ్మకాయలు కోసి అటూ ఇటూ పెట్టి, పసుపు కుంకుమలు చల్లి.... "చూడు... పున్నమికి సరిగ్గా మూడు రోజుల ముందు మీ ఇంటిలో వున్న బంగారాన్నంతా ఒక చెంబులో వేసి ఎవరూ చూడకుండా ఈ దేవుని బొమ్మకింద పాతి పెట్టండి. బంగారాన్ని బంగారమే కనుగొంటుంది. ఆ మూడు రోజులు ఇంటిపెద్ద కటిక నేల మీద పడుకోవాలి. పళ్ళు కూరగాయలు తప్ప ఏమీ ఆహారంగా తీసుకోకూడదు. రెండు గంటలకొకసారి ఇంటిలో పూజలు ఆగకుండా చేయించాలి. అప్పుడు పున్నమి రోజున చందమామ కిరణాలు ఈ ముగ్గుపై పడి లోపలి బంగారాన్ని తాకుతాయి. మరు నిమిషమే అందులోంచి ఒక పెద్ద వెలుగు వచ్చి మీ ఇంట్లో ఏదో ఒకచోట ఆరు నిమిషాలు ఆగుతుంది. సరిగ్గా అక్కడ తవ్వండి. ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. లంకెబిందెలు దొరికే వరకు ఈ విషయం మూడోకంటికి తెలియనివ్వకండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
సాధువు చెప్పినట్టే పున్నమికి మూడు రోజుల ముందు ఇంటిలో వున్న బంగారమంతా ఒక రాగి చెంబులో వేసి దేవుని బొమ్మకింద తవ్వి పెట్టాడు. ఉపవాసం వుంటూ, కటికనేల మీద పడుకుంటూ, ఆగకుండా పూజలు చేయసాగాడు. పున్నమి రానే వచ్చింది. నిండు చందమామ తెల్లగా వెన్నముద్దలా మెరిసిపోసాగాడు. భూమంతా చల్లని వెన్నెల పరచుకోసాగింది. కొన్ని కిరణాలు ముగ్గులోని దేవత బొమ్మమీద పడి మెరవసాగాయి.
రంగయ్య ఊపిరి బిగపట్టి భూమి లోపలి నుంచి వచ్చే వెలుగు కోసం ఎదురు చూడసాగాడు.
గంట గడిచిపోయింది. రెండు గంటలు గడిచిపోయాయి. నాలుగు గంటలు ముగిసిపోయాయి. ఆఖరికి ఉదయం కాసాగింది. సూరీడు చందమామను ఇంటికి పంపి వెచ్చని కిరణాలతో ఆకాశంలో అడుగు పెట్టాడు.
రంగయ్య తాను అంత పద్దతిగా పూజ చేసినా ఎందుకు లంకెబిందెలున్న చోటు కనబడలేదో... అనుకుంటా సాధువు ఇంటికి పోయాడు. అక్కడ ఇంటికి తాళం వేసి వుంది. తనలాగే ఊరిలోని పెద్ద పెద్ద ధనవంతులంతా మూడు రోజుల నుంచీ తిండిలేక పీక్కుపోయిన మొహాలతో దిగులుగా అక్కడ కనబడ్డారు. అందరిదీ ఒకే కథ. కొంచెం గూడా తేడా లేదు.
దాంతో అనుమానమొచ్చి పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళారు. పెరటింట్లోని దేవుని బొమ్మను పక్కకు పెట్టి తవ్వి చూశారు. ఇంకేముంది... అక్కడ నగలూ లేవు. ఇక్కడ సాధువూ లేడు. జరిగిన మోసం తెలుసుకొని ధనికులంతా లబోదిబోమని నెత్తీ నోరు కొట్టుకున్నారు.
************

కామెంట్‌లు