కమ్మని పాటల కోకిల ;- డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212

 పిల్లలూ... పూర్వం పక్షులన్నీ తెల్లగా ఒకే రంగులో వుండేవంట. నెమళ్ళుగానీ, పావురాలుగానీ, గద్దలుగానీ, చిలుకలు గానీ అన్నీ తెలుపు రంగులోనే తళతళతళ మెరిసిపోతా చూడముచ్చటగా వుండేవంట. కానీ వాటికో సమస్య వచ్చి పడింది. అన్నీ ఒకే రంగులో వుండడంతో ఏవి కాకులో, ఏవి కంజులో, ఏవి డేగలో, ఏవి పిట్టలో దగ్గరికొస్తే గానీ కనుక్కోలేక పోయేవి. దాంతోబాటు మాటిమాటికీి మట్టి మరకలు, చెట్ల మరకలు పడి అసహ్యంగా తయారవుతా వుండేవి. దాంతో ఎప్పుడూ పోయి నీళ్ళలో స్నానం చేయాల్సి వచ్చేది. ఇది వాటికి పెద్ద ఇబ్బందిగా తయారయిపోయింది.
అడవిలో జంతువులన్నీ రంగులతో అందంగా, హుందాగా వుండేవి. నీటిలో చేపలన్నీ మిలమిలలాడుతా స్వచ్ఛమైన రంగురాళ్ళలా తళతళలాడుతుండేవి. చెట్లన్నీ పచ్చగా ఒకే రంగులో వున్నప్పటికీ రంగురంగుల పూలు కాస్తా కనులకు విందు చేస్తుండేవి. వాటన్నిటినీ చూస్తా వుంటే పక్షులకు చాలా బాధగా వుండేది. మనకు గూడా ఒకొక్క పక్షికి ఒకొక్క రంగు వుంటే ఎంత బాగుంటాదో గదా అనుకున్నాయి. నెమ్మదిగా ఈ కోరిక అన్నింటికీ దావానలంలా అంటుకుపోయింది. దాంతో అవన్నీ కలసి ఒకరోజు తమ రాజు గరుత్మంతుని దగ్గరికి పోయాయి.
''రాజా... ఈ లోకంలో నేల మీద నడిచే జంతువులకూ రంగులున్నాయి. నీళ్ళలో ఈదే చేపలకూ రంగులున్నాయి. చెట్లపై పూచే పూలకూ రంగులున్నాయి. చివరికి ఎక్కడ పడితే అక్కడ పాకే చిన్నచిన్న పురుగులకూ రంగులున్నాయి... కానీ... ఆకాశంలో విహరించే మనకు మాత్రం ఏ రంగులూ లేవు. అందరమూ తెల్లగా పాలిపోయి చచ్చిపోయిన శవాల్లా వెలవెలపోతా వున్నాము. ఇది మాకెంతో బాధగా వుంది. పాడిందే పాడరా పాచిపండ్ల దాసరి అన్నట్లు ఈ తెలుపు రంగు చూసీ చూసీ మొహమొత్తి పోతోంది. మేం గూడా రంగులు రంగులలో వుంటే ఎంత ముద్దుగా, ముచ్చటగా వుంటుందో కాస్త ఆలోచించండి'' అంటూ అన్నీ తమ మనసులోని మాటను బైటపెట్టాయి.
గరుత్మంతుడు బాగా ఆలోచించాడు. ''నిజమే... లోకమంతా రంగులతో నిండి వుంది. తెలుపు ఎంత హాయిగా వున్నప్పటికీ అన్నీ అదే రంగులో వుండడంతో ఏదో వెలితిగానే వుంది. పువ్వులకు ఆ నవ్వులు, జంతువులకు ఆ మెరుపులూ, చేపలకు ఆ తళతళలూ రంగులతోనే వచ్చాయి. పక్షులు గూడా రకరకాల రంగుల్లో ఆకాశంలో విహరిస్తా వుంటే మళ్ళా మళ్ళా చూడాలనిపించేలా ఎంత మజాగా వుంటుందో'' అనుకున్నాడు.
గరుత్మంతుడు గొంతు సవరించుకొన్నాడు. పక్షులన్నీ మౌనంగా ఏమి చెబుతాడా అని చెవులు రిక్కించి వినసాగాయి. ''సరే... మీరు చెప్పిన మాటలన్నీ నాకు గూడా నచ్చాయి. మీరు గూడా అసాధ్యమైన గొంతెమ్మ కోరికలేం కోరడం లేదు. ఒక రాజుగా మీ ఆనందం కన్నా నాకు కావలసిందేముంది. అతి త్వరలోనే మీరు కోరుకున్నట్లుగానే రకరకాల రంగులలో మెరిసిపోదురుగానీ. నాకు కాస్త సమయమివ్వండి'' అన్నాడు. ఆ మాటలకు పక్షులన్నీ సంబరంగా జయజయధ్వానాలు చేస్తూ ఇళ్ళకు వెళ్ళిపోయాయి.
పక్షిరాజు స్వర్గలోకంలో ఎక్కడెక్కడి రంగులన్నీ తెప్పించి ఇంటి ముందు కుప్పలు పోయించాడు. తరువాత రోజు ఒక పక్షితో అడవంతా ''రేపు పొద్దున్నే పక్షులన్నీ మనరాజు ఇంటి దగ్గరికి రావాలి. ఈ రోజుతో మనకు ఈ తెల్లరంగు ఆఖరు. ఎవరికి ఏ రంగు ఇష్టమైతే ఆ రంగు రాజుగారు అందిస్తారహో'' అంటూ దండోరా వేయించాడు.
ఆ మాట విన్నప్పటి నుంచీ పక్షులన్నీ ఒకటే సంబరపడ్డాయి. రాత్రంతా ఒక్కటీ నిద్రపోలేదు. అడవంతా ఎక్కడ చూసినా పక్షుల కూతలతో, ఆటలతో, పాటలతో పట్టపగల్లా సందడిగా మారిపోయింది. చీకటి ఎప్పుడెప్పుడు తొలగిపోతాదో, తాము ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న కల ఎప్పుడు నిజమవుతాదో అని ఆలోచిస్తా, తమ ఒంటికి ఏ రంగు బాగుంటాదా అని, ముచ్చట్లు చెప్పుకుంటూ గడిపేశాయి. సూర్యుని కన్నా ముందు పరుగు పరుగున పక్షిరాజు ఇంటి కాడికి చేరుకున్నాయి. భటులు వచ్చి అన్నిటినీ వరుసగా నిలబెట్టాక గరుత్మంతుడు చిరునవ్వులతో అక్కడకు అడుగుపెట్టాడు.
పక్షులన్నీ ఒక్కసారిగా మాటలు ఆపి మౌనంగా లేచి నిలబడ్డాయి. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. భటులు రకరకాల రంగులు బస్తాల నిండా నింపుకొని తెచ్చిపెట్టారు. గరుత్మంతుడు తన గంభీరమైన కంఠాన్ని సవరించుకోని ''పక్షులారా! మీ కల నెరవేరే కాలం వచ్చింది. ఈ ప్రపంచంలోని మిగతావాటివలే మనం కూడా రంగుల్లో మెరిసిపోయే సమయం మరికొద్ది క్షణాల్లోనే వచ్చేస్తోంది. ఇదిగో చూడండి. మీ ముందున్న రంగురంగుల కుప్పలు. ఎవరూ ఒకరినొకరు దొబ్బుకోవద్దు. నెమ్మదిగా, ప్రశాంతంగా, వరుసగా రండి. మీకిష్టమైన రంగులు తీసుకోండి. ఇంటికి పోయి మీ శరీరమంతా ఎక్కడ ఏ రంగు కావాలో బాగా ఆలోచించి పూసుకోండి. ఇవి మామూలు రంగులు కావు. దేవలోకంలో నుంచి దేవదేవున్ని మెప్పించి తీసుకువచ్చినవి. కానీ బాగా గుర్తు పెట్టుకోండి. ఒకసారి రంగు పూసుకున్నాక మరలా పోదు... జాగ్రత్త'' అని చెప్పాడు. ఆ మాటలకు పక్షులన్నీ ఆనందంతో తలలాడించాయి. 
ఒకొక్క పక్షే రాసాగింది. తనకిష్టమైన రంగులు తీసుకోని సంబరంగా పోసాగింది.
కొంగ, కాకి ఒకదాని వెనుక ఒకటి నిలబడ్డాయి. ''నాకు ఇంతవరకూ ఎవ్వరికీ లేనంత, ఎప్పుడూ చూడనంత అద్భుతమైన రంగును పూసుకోవాలనుంది'' అంది కాకి. ఆ మాటలకు కొంగ ''ఔనౌను. నాక్కూడా అలాగే అనిపిస్తోంది. కానీ ఏ రంగులు పూసుకుంటే అలా మెరుపులా మెరిసిపోతాం'' అంది. కాకీ, కొంగ కలసి తెగ ఆలోచించాయి. కానీ వాటికి ఏమీ తోచలేదు. దాంతో తమ ముందు నిలబడ్డ కోకిలతో ''కోకిలా... కోకిలా... మాకు ఈ లోకంలో ఎవరికీ లేనట్టి రంగు పూసుకోవాలని వుంది. ఏం చేయాలో నీకేమైనా తెలుసా'' అని అడిగాయి. కోకిల కాసేపు ఆలోచించి ''మిత్రులారా... ఏ పక్షయినా ఒకటో, రెండో రంగులు తీసుకొంటుంది. పూసుకుంటుంది. మీరు అలాకాక అన్ని రంగులూ తలా కొంచెం తెచ్చుకోండి. అన్నింటినీ ఒకదాంట్లో ఒకటి కలపండి. దాంతో ఇంతవరకూ ఎక్కడా చూడని, ఎవరూ పూసుకోని అద్భుతమైన రంగు తయారవుతుంది. దానిని పూసుకోండి'' అని చెప్పింది. కాకికి, కొంగకు ఆ సలహా నచ్చింది. తమ వంతు రాగానే రెండూ రకరకాల రంగులు తలా కొంచెం తీసుకున్నాయి. ఇంటికి పోయాక రెండూ కలసి ఒక గిన్నెలో అన్ని రంగులూ పోశాయి. నీరు వేసి కలపడం మొదలుపెట్టాయి.
మొదట కాకి ''కొంగమామా... కొంగమామా... నేను చిన్నగా వుంటాను గదా... మొదట నేను రంగు పూసుకుంటా తరువాత నువ్వు పూసుకో'' అంది. కొంగ సరేనంది. కాకి రంగులన్నీ బాగా కలిపాక అందులోకి మునిగింది. పాపం! దానికి రంగులన్నీ కలిపితే నల్లరంగు వస్తాదని తెలీదు. దాంతో తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు అది నల్లగా అమావాస్య చీకటిలాగా మారిపోయింది. ఆ రంగు చూడగానే దాని గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టయింది. ఊహలన్నీ చెదిరిపోయాయి. ''అరెరే... రంగులన్నీ కలిపితే ఏదో అద్భుతమైన రంగు వస్తుందనుకున్నా గానీ కందెనలాగా ఈ చిక్కటి నల్లరంగు వస్తుందా'' అని అదిరిపడింది. బెరబెరా దాన్ని వదిలించుకోవాలని చూసింది. కానీ ఎక్కడ అంటిన రంగు అక్కడే అలాగే అతుక్కుపోయింది. తెల్లని కాకి కాస్తా నల్లగా అందవికారంగా మారిపోయింది.
అది చూసిన కొంగ ''అయ్య బాబోయ్‌... నాకు ఈ నల్లరంగుకన్నా ఇప్పుడున్న ఈ తెల్లరంగే బాగుంది'' అనుకుంటూ అక్కన్నించి ఎగిరిపోయింది. పాపం... కాకి కళ్ళనీళ్ళతో ఒంటరిగా మిగిలిపోయింది. తనకు ఈ సలహా ఇచ్చిన కోకిల మీద విపరీతమైన కోపం వచ్చింది. గిన్నె తీసుకోని బైలుదేరింది. కోకిల ఒక చెట్టు కింద కూర్చుని గిన్నెలో పసుపు రంగు వేసుకోని కలుపుకుంటా వుంది. అది చూసి కాకి ''ఇక్కడ నేను ఈ నల్లరంగుతో బాధపడుతా వుంటే నువ్వు పసుపురంగు వేసుకోవడానికి తయారవుతున్నావా... చూడు నిన్నేం చేస్తానో'' అంటూ ఒక్కసారిగా తన గిన్నెలోని మిగిలిన రంగంతా కోకిలపై కుమ్మరించింది. అంతే... పాపం... అదిగూడా నల్లగా కాకిలెక్కనే మారిపోయింది.
పాపం... కోకిల బాధతో పరుగు పరుగున పక్షిరాజు దగ్గరికి చేరుకొంది. పక్షిరాజు జరిగిందంతా విని ''సరే... అయిపోయిందేదో అయిపోయిందిలే. నీవు గూడా రంగులన్నీ కలిస్తే అలా నల్లరంగు వస్తుందని వూహించలేదు గదా... కానీ ఒక్కసారి రంగు అంటుకున్నాక దాన్ని తొలగించడం ఎవరికీ చేతగాదు. కాకపోతే నీ రూపం మార్చలేకున్నా నీ గొంతు కమ్మగా మారిపోయేలా వరమిస్తా ఇక నుంచీ నీ కూత అన్ని పక్షుల కన్నా అత్యంత మధురంగా వుంటుంది పో! కానీ ఒక్కమాట, ఇంకెప్పుడూ ఇలా మిడిమిడి జ్ఞానంతో ఎవరికీ సలహాలివ్వద్దు'' అని చెప్పింది.
ఇదీ కథ. అందుకే పక్షులన్నీ రంగురంగులుగా వున్నా కొంగలు తెల్లగా, కాకీ, కోకిలలు నల్లగా వుంటాయి. కోయిల కంఠం అన్నింటికన్నా కమ్మగా వుంటుంది. 

కామెంట్‌లు