నాన్నా!! మీరే మా ప్రత్యక్ష దైవం*;- మాడిశెట్టి రామనాథం ఫోన్ నం.9441700527వరంగల్.
 నాన్నా !*
పెదాల తడి అంటని 
నీ పిలుపులోని శబ్దోచ్ఛారణ !
అధరాల నిరాదరణను నిరసిస్తూ 
తృప్తిగా ' బాపూ ' అని పిలుచు కున్నాం
బీజ ప్రాధాన్య జన్మకారకా 
క్షేత్ర ప్రాధాన్యతను అమ్మకు అప్పచెప్పి
అమ్మ ద్వారా మమ్ము
 ప్రపంచానికి పరిచయం చేసిన
 ఓ జీవిత ప్రదాతా
పాఠశాలలో తండ్రి పేరు రాయించి 
ప్రపంచాన్ని మాకు పరిచయం చేసావు 
మా ఎదుగుదల కోసం 
నువ్వు పూర్తిగా ఒదిగి ఉండి
భుజాల కెత్తుకొని నడిచావు
వేలు పట్టి నడిపించి 
మా తప్పటడుగులకు 
చేయూతనిచ్చావు
కుటుంబానికి ఛత్ర ఛ్చాయవై
పోషనా భార కష్టాన్ని భరించిన
ఓ జీవన ప్రదాతా 
శైశవ ప్రాయంలో మమ్మల్ని పైకెత్తుకొని
గుండెల పై తన్నించు కున్నావు
ఎందుకో తెలుసా 
పెద్దయ్యాక నిన్ను గుండెలపై
 తన్నబోమనే నమ్మకంతో 
మా బ్రతుకు ఆటలో 
మమ్ము గెలిపించాలని 
బయటి లోకంలోని ఆటల్లో 
నువ్వెన్ని ఓటములు చవి చూచావో !
నువ్వు ముళ్ల బాటలో నడిచి 
మాకు పూల బాట పరిచావు 
చిరిగిన చొక్కా నువ్వు తొడుక్కొని
మాకు మంచి  ' బుష్ కోటు '  కొనిచ్చావు
నీ ఆదర్శ భావాలకు 
తగ్గట్టుగా ఎదగాలని 
ఎంతో పరితపించావు 
మాఉజ్వల భవిష్యత్తుకై 
ఎంతో తపించావు 
ఇప్పటికీ ఈ బ్రతుకు 
ఉనికిలో ఉందంటే 
నీ ఆశీర్వాద పుణ్యఫలమే
దైవం ఎలా ఉంటుందో 
తెలియదు కానీ 
మీరే మా ప్రత్యక్ష / పరోక్ష దైవం !


కామెంట్‌లు