నేను వేదన;-డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871
అది
పుట్టుక కాదు  
అమ్మ ప్రసవ వేదన

కదిలితేనే మొదలు బతుకు యాత్ర  ఎవరిదైనా
తొలి నవ్వు చాచిన రెక్కల పక్షి కోరిక ఎగిరే నింగి స్వేచ్ఛ నేను

ఆకులు ఆలపించే జోలపాట వింటే
తీరొక్క వలయం వ్యాసార్థ భ్రమణం తెలిసింది 
పడిలేవడమే బతుకు నిర్వచనమని 

నేను
ఒంటరనే కాబోలు అమ్మ తోడొచ్చింది  గూటిలో ఏకాకి కాదు మేము రుధిరకావ్యం రాసిన జంట కవులం

నేను
స్నేహాల చినుకులు పరిచిన చిత్తడి 
ఆత్మీయ హితగురువులు తెరిచిన గగనమంత కిటికి

జననం అర్థం బోధపడేసరికి నాలో 
ఉదయ రాగాలు మధ్యాహ్న గీతాలు నడిచేపోయె బిరబిర  
ఒడుదుడుకుల ఆటే సంగీతసంధ్య 
చీకటి సంద్రంలో చేరగ నిద్రాకాలం చేరువాయే 

నన్ను బతికించిన చల్లని చూపుల అలాయ్ బలాయ్ కీ
నన్ను నడిపిన ఆత్మీయ యాదోంకీ బారాత్ ఆలోచనలకూ  
వంచని తల వంచి అందించే
ఆత్మ నమస్సులు చిరుతడి గుండెతో

నాలో 
మానవీయ బీజం నాటిన
సమాజ సహస్ర హస్తాలకూ ధన్యవాదాలు
మానవత్వగవాక్షం తెరుచుకున్న మట్టి మనిషిని నేను

పుట్టడం సృష్టిలో అదీ
సంవేదనల మనిషిగా మరీ అద్భుతం
బాధలు ఒంపుకున్న పాట నేను 
అనంతనొప్పిని ఒడిసిపట్టిన చేదు గుళికను కూడా
ఈ పుట్టుకకు 
నిజమైన అర్థవంతమైన  గీతాంజలి నేనే


కామెంట్‌లు