వృక్షో రక్షతి రక్షిత స్పూర్తిదాయకం;-స.హెచ్.ప్రతాప్
 చెట్లను మనం కాపాడితే అవి మనలను కాపాడతాయని పెద్దలవాక్కు. అందుకే ‘వృక్షో రక్షతి రక్షితః’ అని అన్నారు. మానవ మనుగడకు, సర్వజీవుల సుఖజీవనానికి వృక్ష సంపదను రక్షించాలని శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. వృక్షాలను దేవతలుగా పూజించి, ఆదరించే దేశంలో వృక్ష సంపద రోజురోజుకూ తరిగిపోతోంది.నీడ, పూలు, ఫలరసాలు మాత్రమేకాక ప్రాణవాయువునూ నిరంతరం విడుదల చేస్తూ చెట్లు జీవకోటికి గొప్ప మేలు చేస్తున్నాయి.మనల్ని బతికించేందుకు, మంచి గాలి అందించేందుకు, వర్షాలు బాగా పడేందుకు వృక్షాలు  ఎంతగానో సహాయపడుతోంది. ఈ చెట్లను నరికేస్తే మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటే అర్థం తెలుసా? వృక్షాలను రక్షిస్తే అవి మిమ్మల్ని రక్షిస్తాయి’’అని అర్ధం.మనం వదిలిన కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, మనకు ఆక్సిజన్ ను అందిస్తాయి. అంతేకాక మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి అంటే చెట్లు మనకు నీడని ఇస్తాయి. అలాగే పండ్లు, పూలు, వేర్లు, ఆకులు ఇలా చెట్టు యొక్క అన్ని భాగాలు కూడా మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రకృతిలో లభించే ప్రతి మొక్క మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
ట్లకు పర్యావరణపరంగానే కాకుండా మతపరమైన ప్రాతిపదికన కూడా ప్రాముఖ్యత ఉంది. పురాణాలలో చెట్లు నాటడం గొప్ప పుణ్య కార్యంగా చెప్పబడింది. ఇది గాయత్రీ జపము, దానము, హవనము వలె పరిగణించబడుతుంది.
కోవిడ్ రెండో ‌వేవ్‌లో భారతదేశంలో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోయారు.కొన్ని లక్షల  రూపాయిలు ఖర్చు పెట్టి ఆప్తులను బ్రతికించుకుందామని అనుకున్నా కూడా, ఆక్సిజన్ దొరకకపోవడంతో తమ వారి ప్రాణాలు నిలబెట్టుకోలేకపోయారు.చెట్లను పెంచడం, వాటి నరికివేతను ఆపడం, అడవుల కొట్టివేతను అరికట్టడం వల్ల గాలిలో సహజంగా ఆక్సిజన్ లభిస్తుందని చెబుతూ కోవిడ్ రెండో వేవ్ లో కనిపించిన ఆక్సిజన్ కొరతను పర్యావరణవేత్తలు ఉదాహరణగా చూపిస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను ప్రజలు ఇప్పటికైనా గ్రహించకపోతే, ఆక్సిజన్ కొరత, వాయు కాలుష్యం భవిష్యత్తులో ఒక సాధారణ సమస్యగా మారిపోయే ప్రమాదంగా ఉందని హెచ్చరిస్తున్నారు.
వృక్షో రక్షతి రక్షితః’ అన్న వేదసూక్తి వెనుక వున్న ఇంతటి గొప్పతనాన్ని అందరూ అర్థం చేసుకొని ఆ మేరకు మొక్కలు, చెట్ల పెంపకంతో ప్రకృతి రక్షణకు పూనుకోవాలి.

కామెంట్‌లు