హరితహారం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఏ ఆగంతకుడో
ప్రకృతిలో గమ్మత్తైన ముగ్గులేసినట్లు
పూలకొమ్మల సోయగం!
తీరైనరంగు పూలపైన
రంగురంగుల సీతాకోకచిలుకలు
పిల్లగాలులకు అలవోకగా
కదులుతున్న ఇంద్రచాపంలా!
అపరిమిత పరిమళాల గుబాళింపు
మనసును పరవశం చేస్తూ!
ఇలాతలాన్ని
సువాసనల గుబాళింపుతో సుమవంతం చేసి
గాలి హంసలా ఒయ్యారాలు పోతోంది!
మట్టి, మొక్కలు, చెట్లు,
కొమ్మలు, రెమ్మలు, ఆకులు
ఇలా.......... అన్నీ! అన్నీ!
సుమ సౌరభాలు ఒలకపోస్తున్నాయి!
వాసంతకాల శర్వరి
సంతోష చంద్రికలను స్వరవంతం చేసి
జన్మజన్మల ఋణానుబంధాన్ని
ఫలవంతం చేస్తోంది!
శిలీభూతమైన శిశిరాన్ని నిర్వీర్యంచేస్తూ
చైత్రలక్ష్మి ఆగమనాన్ని
సకల భువనాలకు
సుప్రకటితం చేస్తోంది!
అందుకే మనమంతా
వనాల నజరానాను
ఈ భూదేవి మెడలో
హరితహారంగా అలంకరించి
వసుధను మరింత రాగరంజితం చేద్దాం !!
**************************************

కామెంట్‌లు