శ్రీ మాల్యాద్రి నారసింహ శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 తేటగీతి పద్యములు.
96.
పోషకుడవని నీపాద పూజ సేయ 
పట్టుబట్టితి కైమోడ్చి పద్మనాభ 
సుంత నామాట వినవయ్య శోభనాంగ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
97.
నాణ్యమైనట్టి వజ్రాల నగలు కోరి 
చెంత జేరగ లేదయ్య శేషశయన!
రంగు రాళ్ళవి నాకేల రంగనాథ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
98.
తీర్ధ యాత్రలు సలుపఁగ తీరికేది 
ధర్మ కార్యంబు చేయగ ధనము లేదు 
పుట్టి సంసార జలధిని మునకలేయు 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

99
యజ్ఞ యాగాది కర్మల నతిశయింప
పుణ్య కార్యంబు లెన్నియో పుడమియందు 
చేసి తరియింప గోరితి జేవలేదె 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

100.
దేహ బాధలు దీర్పెడి దైవ మీవె 
క్రుంగి పోయితి గాల్చవే కోరికలను 
చిత్త శాంతిని గోరితి సేదదీర 
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//

కామెంట్‌లు