శంభో!'శతకం.;-టి. వి. యెల్. గాయత్రి.-పూణే.. మహారాష్ట్ర
 కందపద్యాలు.
===========
1.
కరిచర్మాంబరధర !హర !
గిరిజా పతి !భూతనాధ !కేదారేశా !
మొరలను వినుమా భర్గా !
మురిపెము దీర నిను గొలఁతు బురరిపు శంభో !//
2.
 శూలధరా !మోదమలర
నీలీలలు వింటి నయ్య నిటలాక్ష !శివా !
కాలస్వరూప !నిన్నే 
మేలుగ మనమున దలచెద మినుసిగ శంభో !//
3.
 అనయము నీపద కమలము 
మననము జేసెద భగాలి!మానిత మొప్పన్ 
వినయము మెయి నిను గొలఁతున్ 
గనికరమును జూపి మమ్ము కావర శంభో !//
4.
భారము నీదని నమ్మితి 
నేరము లెంచకు శంకర!నిత్యము నిన్నే 
గూరిమి మీర భజించెద 
సారసమతి నీయ వయ్య ! శశిధర శంభో !//
5.
చెఱకు విలుకాని పొగరును 
బరిమార్చి నిలిచి గిరిజను బట్టిన భద్రా !
సురవినుత చరణ పశుపతి!
దొరవని నమ్మితి మనమున ధూర్జటి శంభో !//

కామెంట్‌లు