సునంద భాషితం- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు-524
జలానయన న్యాయము
   *****
జల అంటే నీరు, ఉదకము, సలిలము. ఆనయన అంటే తీసుకుని వచ్చుట.
జలమును తీసుకుని రమ్మంటే ఏదో ఒక పాత్రలో తెమ్మని అర్థము. ఇంకా వేరే చెప్పక్కర్లేదు కదా !అని అర్థము.
ఇదొక సరదా న్యాయము.నీళ్ళు తెమ్మంటే  వెనుకటికి ఎవరో ఊళ్ళో అంతా తిరిగొచ్చాడట.కానీ నీళ్ళు మాత్రం తేలేదట.పైగా చెరువుల్లో, బావుల్లో నీళ్ళున్నాయి కానీ ఎలా తేవాలో తెలియడం లేదు అన్నాడట.అంటే ఫలానా గ్లాసు,చెంబు,బిందెతో తెమ్మని చెప్పలేదనే భావన.అంటే సందర్భాన్ని సరిగా అర్థం చేసుకోలేని మూర్ఖత్వం గా చెప్పుకోవచ్చు.
ఒకవేళ దాహమేసి నీళ్ళు అడిగితే...అడిగిన వ్యక్తి కళ్ళు తేలేయాల్సిందే కదా! పెద్దలు తరచూ చెప్పే ఓ సామెత ఉంది "మందు తీసుకుని రమ్మంటే మాసికానికి వచ్చాడని".  సమయానికి మందు అంటే ఔషధం అందక ఆ వ్యక్తి చనిపోయాడు.తెస్తానన్న వ్యక్తి వచ్చేసరికి నెల రోజులు అయ్యి 'మాసికం' పెట్టారన్న మాట.
మరి నీళ్ళను  తెమ్మనడానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పురాణ కథను చూద్దామా...
 ఒకసారి శ్రీమహావిష్ణువును నారదుడు అడిగాడట " స్వామీ!మీ మాయలు చాలా చాలా బాగుంటాయి. మరి సాధ్యం కానివి ఎన్నో  మీ మాయతో సాధ్యం చేస్తుంటారు.  అలాంటి మాయను ఒకసారి చూడాలని వుంది" అన్నాడట.విష్ణువు  ఆ మాటలకు నవ్వుతూ , ఏమీ పట్టించుకోని వాడిలా ఉండిపోయాడు.
 ఓరోజు విష్ణువు, నారదుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు.దారిలో విష్ణువు  'దాహంగా ఉంది నీళ్ళు తీసుకొని రమ్మని' నారదుని అడిగాడు.  నారదుడు సరేనని నీళ్ళ కోసం చుట్టూ వెదుకుతూ అలా అలా చాలా దూరం వెళ్ళిపోయాడు.అల్లంత దూరంలో నది కనిపించింది.గబగబా వెళ్ళిన నారదుడికి అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపించింది. ఆ యువతిని చూడగానే తాను వచ్చిన పని మర్చిపోయాడు.ఆమెతో ప్రేమలో పడ్డాడట.ఆ తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని  కంటాడు.సంసార సాగరంలో మునిగి పోయాడు.కరువులు కాటకాలు అన్ని అనుభవిస్తాడు. ఒకసారి  వరదలు వచ్చి పుట్టిన పిల్లలు భార్య అందులో కొట్టుకొని పోతారు. అదంతా చూసి తట్టుకోలేక నారదుడు ఆ నది ఒడ్డున కూర్చుని ఏడుస్తూ వుంటాడు.
నారదుని వెతుక్కుంటూ వచ్చిన శ్రీ మహావిష్ణువు ఏడుస్తున్న నారదునితో "దాహమవుతుంది. నీళ్ళు తెమ్మంటే ఇలా ఏడుస్తూ కూర్చున్నావేమిటి?అని ప్రశ్నిస్తాడు.విష్ణువును చూడగానే ఆ మాటలు వినడంతోనే నారదుని కమ్మిన మాయా మైకం విడిపోతుంది ''నేనేంటి ఆజన్మ బ్రహ్మచారిని. నాకు ఇలా జరగడం ఏమిటి? అసాధ్యాన్ని సాధ్యం చేయడమంటే ఇదే కదా!" అంతా 'విష్ణు మాయ' అనుకుంటాడు.
అలాగే శ్రీమహావిష్ణువు  నారదుని గర్వాన్ని తగ్గించేందుకు అతడిని మహిళగా మార్చడం.మహిళగా మారిన నారదుడు ఓ రాజును పెళ్ళాడి అరవై మంది పిల్లలకు జన్మనివ్వడం.వారినే మనం తెలుగు సంవత్సరాలుగా పిలుస్తున్నామనే ఓ పురాణ కథ కూడా వుంది. 
ఎలాగూ నీళ్ళ గురించి సందర్భమే  కాబట్టి మరో కథను కూడా చూద్దాం.
అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన చక్రవర్తి.ఇతడు ఒకసారి ద్వాదశి వ్రతం పూర్తి చేసి భోజనం చేయడానికి సిద్ధమవుతుండగా దుర్వాస మహాముని అక్కడికి వస్తాడు.
 అంబరీషుడు దుర్వాసుని భోజనానికీ రమ్మని పిలువగా స్నానం చేసి వస్తానని నదికి వెళ్తాడు.ఎంతకూ రాడు.ఇక్కడేమో తిథి వెళ్ళిపోయేలా వుంది ఏం చేయాలో తోచలేదు . వెంటనే తన దగ్గర ఉన్న పండితులు,విద్వాంసులను అడుగుతాడు. "తినకుండా తిథి దాటిపోతుంది కాబట్టి కాసిన్ని నీళ్ళు తాగవచ్చు" అలా తాగితే తిథి సమస్య ఉండదు" అని చెబుతారు.వాళ్ళ  మాటల ప్రకారం అంబరీషుడు కొన్ని నీళ్ళు తాగుతాడు.
ఆ వెంటనే  నది స్నానానికి వెళ్లిన దుర్వాసుడు అంబరీషుని వద్దకు వచ్చి 'అతిథిగా పిలిచి అవమానిస్తావా ?ముందు నువ్వు నీళ్ళు తాగి నాకు శేష భోజనం పెడతావా? అని కోపగించుకోవడం జరుగుతుంది.తాగిన ఆ కొంచెం  నీళ్ళే బోలెడు తర్వాత బోలెడు కథను  నడిపిస్తాయి.
ఇవండీ! నీళ్ళ వల్ల వచ్చిన తిప్పలు. సరదాగా తీసుకోవచ్చు. సమస్యగానూ తీసుకోవచ్చు. ఏదైనా మన, ఎదుటి వారి ఆలోచనల బట్టి ఉంటుంది.
ఏది ఏమైనా  నీళ్ళ పుణ్యమా అని ఓ రెండు కథలు తెలుసుకున్నాం కదా! 
ఇలా ప్రతి మాటకు, ప్రతి సందర్భంలోనూ ఓ కథ, విశేషం చెప్పే మన పెద్దల మాటల్లో దాగిన అంతరార్థం గ్రహిద్దాం. పురాణేతిహాసాల గాధలు ఇలా విని విషయాలు తెలుసుకుందాం.

కామెంట్‌లు