సునంద భాషితం;- వురిమళ్ల సునంద, న్యూజెర్సీ అమెరికా
న్యాయాలు -520
జలబిందునిపాత న్యాయము
     ****
 జలము అనగా నీరు , ఉదకము.బిందు అనగా చుక్క,మచ్చ,సున్న.నిపాత అనగా పడుట,పైబడుట,విసరివేయుట,అవ్యయము,,చావు అనే అర్థాలు ఉన్నాయి.
 
"ఒక్కొక్క నీటి బొట్టు పడి క్రమంగా కుండ మొత్తం నిండినట్లు". 
ఒక్కొక్క నీటి బొట్టుతో కుండ నిండినట్లు ఇంకా ఏమేమి నింపుకోవచ్చో... దీనికి సంబంధించిన నరసింహ సుభాషిత శ్లోకాన్ని చూద్దామా.
"జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః/ స హేతుఃసర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ!!"
అంటే ఒక్కొక్క నీటి చుక్క కారుతూ పడుతున్నప్పుడు ఆ నీటి చుక్కల క్రింద ఒక కుండను ఉంచితే క్రమంగా ఆ కుండ నీటితో నిండుతుంది.అలాగే సర్వ విద్యలు నేర్చుకోవాలన్నా ,ధర్మాచరణ చేయాలన్నా, సంపాదన పెంచుకోవాలనుకున్నా ఈ పద్ధతి వర్తిస్తుంది అని  అర్థము.
 మొదటగా విద్య విషయానికి వస్తే ఏదీ వెంటనే రాదు కదా! క్రమ క్రమంగా నేర్చుకోవడం, కంఠస్థం చేయడం, వాటికి సంబంధించిన పుస్తకాలు చదవడం,ఇలా చేసిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకుంటూ, వాటికి  జీవితానుభవాలను జోడించి, నిత్య జీవితంలో అవసరమైనప్పుడు అన్వయించుకోవడం... అలా అన్వయించుకున్న   నేర్చుకున్న విద్యకు జీవితంలో ఎప్పటికీ మరుపు అనేది ఉండదు. ఎల్లప్పుడూ ఉపయోగపడుతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యారు, రాణించారు అంటే  ఒక్క సారిగా కాదు కదా! అంటే కుండలో జారే నీటి చుక్కలా క్రమంగా పెంచుకున్న జ్ఞానము అది.
అలాగే ధర్మాచరణ కూడా. చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు, కుటుంబం, ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న ధర్మాలు, నైతిక విలువలతో నెమ్మది నెమ్మదిగా మొదలు పెట్టిన ధర్మ కార్యాలు,మంచి పనులు సమాజంలో కొంత కాలానికి మంచి వ్యక్తిగా నిలబెడతాయి.ఇక జీవిత కాలం మంచిపనులు చేసేలా చేస్తాయి.
ఇక సంపాదన విషయానికి వస్తే కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరూ ఒక్క సారిగా మహా ధనవంతులు,కుబేరులు కాలేరు. (అక్రమ సంపాదన పరుల విషయం వదిలేద్దాం వాళ్ళదంతా అడ్డదారి కదా). ప్రతి  పైసా ఆలోచించి చేసిన పొదుపు, అదుపులో ఉన్న ఖర్చు వారిని అధిక ధనవంతులను చేస్తుంది. అంటే ఏవీ ఒకేసారిగా సమకూరవు. "బిందువు బిందువు కూడితే సింధువు అవుతుంది" అంటారు కదా ! అలా అన్నమాట.వాన చినుకులు అన్ని ఒక్కటొక్కటిగానే వుంటాయి.కానీ అన్నీ కలిస్తే వానై వరదై, చెరువులు ,కుంటలు బావులు, నదులు నిండుతాయిగా . అలాగే ధనం కూడా అలాగే  పెరుగుతుంది.
అదంతా ఒక ౠత్తు. మరి మనం నిత్యం ఉపయోగించే నీటి విషయంలో అలా చేస్తున్నామా? అలా చేస్తే  నీళ్ళ కరువు వుండేది కాదు. ప్రస్తుత నీటి పరిస్థితులను చూసినట్లయితే నీటి కాలుష్యముతో పాటు కొరత  కూడా ఎంత ఎక్కువగా ఉందో మనకు తెలుసు.వేసవి కాలం వచ్చిందంటే నీళ్ళ కోసం మైళ్ళ దూరం ప్రయాణం,ఇక నగరాల్లో అతి పొదుపుగా వాడుకోవడం. మంచి నీళ్ళు కొనుక్కోవడం..ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణం మానవుల స్వయం కృతాపరాధమే.. కాబట్టి ఇక నైనా మేల్కొని చుక్క నీరు కూడా వృధా చేయకుండా ఇంకుడు గుంతల ఏర్పాటు, భూగర్భ,ఉపరితల జలాలను రక్షించుకునేందుకు మనమంతా కలిసి కట్టుగా కృషి చేయాలనే అంతరార్థం ఈ "జల బిందు నిపాత న్యాయం" లో యిమిడి ఉన్నది.అది గ్రహిద్దాం.ఆ దిశగా దృష్టి పెడదాం .

కామెంట్‌లు