సుప్రభాత కవిత ; - బృంద
కలలన్ని అలలుగా కదిలి
కలగన్న తీరానికై  వెడలి
చెలియలి కట్టను దాటి
చెలిమి చేయందుకోదా ?

కలతల వలలో చిక్కిన
తలపుల తలుపుల ముంగిట
మలుపులు తిప్పే మార్పులు
కొలువు చేయమని కోరవా?

కాలం ఒకలా ఉండదని
మాయాజాలం  చేయుననీ
ఇడుములు కలకాలం నిలవవనీ
సహనం విజయం తెచ్చివ్వదా?

తిమిరం తో సమరం చేసి
అహరహమూ మార్పుకోరుతూ
అహమును అణచే తీరాలనే
ఆకాంక్షకు తగు సహకారమందదా?

మోడుగ మారిన వృక్షపు
మూలము మళ్ళీ చిగురించి
శాఖోపశాఖలై వ్యాపించి
వేడుక వెల్లి విరియదా?

జీవనదిలా ప్రవహించిన కన్నీరు
తడిపిన సంకల్ప క్షేత్రం
స్వప్నంగా మారిన సత్యాన్ని
సాకారంగా మార్చే తరుణం రాదా?

చుక్కలతో చెక్కే చక్కని నగరం
కనువిందుగ కనులముందు
దినదినమూ కళలు దిద్దుకుంటూ
సిరి సంపదలకు నెలవైపోయే

విలువైన వరం తెచ్చిన వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు