కన్న తల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలను మరువద్దు ప్; --ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
 పిల్లల ఇండ్ల సందర్శన 
==================
 ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన ఉచిత విద్య అందిస్తున్నామని, పిల్లల తల్లిదండ్రులు వేలాది రూపాయల డబ్బులు వృధా చేసుకోకుండా తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రుల్ని కోరారు. ఆదివారం ఆయన పాఠశాలలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పాఠశాల చైర్మన్, టీచర్లతో కలిసి ఆయన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడీడు పిల్లల ఇండ్లకు వెళ్లి ఆయన  ఎస్సీ కాలనీ పాఠశాల ప్రత్యేకతలను వివరిస్తూ పిల్లల్ని పాఠశాలలో చెప్పించాల్సిందిగా  కోరారు. అనంతరం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పల్లె ప్రగతికి సోపానాలని, ఉన్న ఊరు కన్నతల్లి లాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలందరినీ చేర్పించి ఉచిత విద్యా సౌకర్యాలను పొందాలన్నారు. తల్లిదండ్రులు ఇతర పాఠశాలల మోజులో పడి తమ కష్టార్జితాన్ని వృధా చేసుకోకూడదని, ఫీజుల రూపంలో ప్రతి ఏటా చెల్లించే లక్షలాది రూపాయల్ని బ్యాంకులో పిల్లల పేరున జమ చేయాలని ఆయన సూచించారు. సకల సౌకర్యాలతో పాటు, అందమైన, ఆకర్షణీయమైన పక్కా భవనాలు కలిగిన ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒత్తిడిలేని నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చేర్పించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలాన్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, 2 జతల డ్రెస్సులు, నోట్ బుక్కులు, వారి ఆరోగ్య పరిరక్షణకు సీఎం బ్రేక్పాస్ట్, రాగి జావ, సన్న బియ్యంతో శుచి, రుచికరమైన మధ్యాహ్న భోజనం, వారానికి 3 కోడిగ్రుడ్లు అందిస్తోందని, నిపుణులైన వైద్య సిబ్బంది చేత పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయిస్తోందన్నారు. ఎఫ్ఎల్ఎన్ వంటి వినూత్న విద్యా కార్యక్రమం ద్వారా చక్కటి విద్యతో పాటు ఆటలు, చేతి రాత నేర్పించడం, పాటలు, యోగా, రిమీడియల్, మోటివేషనల్ తరగతులు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో విలువలతో కూడిన విద్యను అందించి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, ఉన్నత వ్యక్తిత్వం కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతున్నామన్నారు. తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ ఓరుగంటి శ్రీజ, టీచర్లు ఎడ్ల విజయలక్ష్మి, చెన్నూరి భారతి, పిల్లల తల్లిదండ్రులు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు