సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా

 న్యాయాలు -522
జల తైల న్యాయము
   ******
జల అంటే నీరు, ఉదకము.తైలం అంటే నూనె, చమురు అనే అర్థాలు ఉన్నాయి.
జలము, తైలము వేటి అస్తిత్వాలు వాటివేనని రెండూ కలవవని, అలాగే ఏ రెండు మనస్తత్వాలు ఒకేలా ఉండవు మరియు కలవవని చెప్పడానికి మన పెద్దలు ఈ "జల తైల న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
 నీరు నూనె కలిపితే కలిసినట్లు కనిపిస్తాయి. కానీ పరీక్షగా చూస్తే నూనె నీటిలో మునిగి పోకుండా,అలాగని ఒక్క దగ్గరే ఉండి పోకుండా నీటిపై ఉపరితలం అంతా ఒక పొరలా ఏర్పడుతుంది.
ఈ "జల తైల న్యాయములో"నూనెకు  ఆ పేరు ఎలా వచ్చిందో తైలం అని ఎందుకు అంటారో చూద్దాం...పూర్వకాలంలో నూనె అంటే గానుగ ద్వారా నువ్వుల నుండి తీసిన దానిని నూనె అనేవారు.తైలం అంటే కూడా అదే అర్థము.తిల అంటే నువ్వులు.తిలల నుండి వచ్చింది కాబట్టి తైలం అయ్యింది.
 ఇక రాన్రానూ భూగర్భంలోంచి పెట్రోలును తీసేటప్పుడు వచ్చిన క్రూడాయిల్, కిరసనాయిలు మొదలైన వాటిని కూడా నూనెలని అనడం మొదలు పెట్టారు.
ఇక నీళ్ళు, నూనె గుణాలను తెలుసుకుందాం.
నీళ్ళు జీవులకు అత్యవసరమైనవి ప్రాణాధారం అని తెలుసు.అలాగే ఉప్పు పంచదార వంటి పదార్థాలు కలిసిపోతాయి,పాలు కలిసిపోతాయని తెలుసు.
కానీ  నూనెలు మాత్రం నీళ్ళలో కలవవు,కరగవు.అలా నూనెలో కరిగేవి ఏవీ నీళ్ళలో కరగవు.అంతేకాదు పాదరసం  అనే లోహం కూడా నీటిలా ద్రవ రూపంలోనే ఉంటుంది అది కూడా నీళ్ళలో కరగదు,కలవదు.నీళ్ళను మరగ బెడితే ఆవిరై పోతాయి.మరి నూనెలను మరగ బెడితే ఆవిరికావు.కేవలం పెట్రోలు తప్ప.పెట్రోలు అనేది హైడ్రో కార్బన్ల మిశ్రమం.హైడ్రో కార్బన్లు చాలా బలహీనమైన ఇంటర్ పార్టికల్ ఆకర్షణలను కలిగి వుంటాయి కాబట్టి ఆవిరై పోతుంది .
 ఏవైనా మరకలు పడితే నీళ్ళూ సబ్బు ఉపయోగించి  పోగొట్టవచ్చు. కానీ  బట్టల మీద కానీ పట్టు లాంటి వస్త్రాల మీద కానీ  పడిన నూనె మరకలు పోవాలంటే నీళ్ళతో కడిగి పోగొట్టడం సాధ్యం కాదు."వజ్రాన్ని వజ్రం తోనే కోయాలి"" ముల్లును ముల్లుతోనే తీయాలి"అన్న సామెతల్లా నూనె మరకలను నూనెలతో పోగొడతారు.దానినే డ్రై క్లీనింగ్ అంటారు.ఈ  డ్రై క్లీనింగ్ లో రసాయన ద్రావణిలను వాడుతారు.ఇలా నీళ్ళు లేకుండా ద్రావణులతో బట్టలను శుభ్రం చేయడం జరుగుతుంది.ఈ డ్రై క్లీనింగ్లో ఉపయోగించే ద్రావణాలు భూగర్భంలో దొరికిన క్రూడాయిల్ యొక్క ఉప ఉత్పన్నాలే.వాటిల్లో అత్యంత ముఖ్యమైనది పెట్రోల్ ముఖ్యమైనది వాహనాలు  నడవడానికి ఇంధనమని మనకు తెలుసు.
అయితే పెట్రోల్ చాలా ప్రమాదకరమైన నూనె పదార్థం.ఇది బాగా మండే ద్రవం.దీనికి ఆవిరైపోయే గుణం ఉంది కాబట్టి దీన్ని సురక్షిత పద్దతుల్లో వాడకపోతే తీవ్రమైన మంటలు, పేలుడు సంభవించే అవకాశాలు ఉన్నాయనేది ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి.
 నీళ్ళూ,నూనెల గురించి తెలుసుకున్నాం కదా! నీళ్ళూ నూనెలు ఇవి రెండూ దేనికవే ప్రత్యేకత,అస్తిత్వం కలిగి ఉన్నాయనేది అర్థమైంది. ఇలాగే భార్యాభర్తలు,స్నేహితులు, బంధువులు . ఇలా ఎవరైనా సరే...  నీళ్ళూ నూనె వలె  ఉండటం సహజం.ఎవరి మనసు వారిదే,ఎవరి అస్తిత్వం వారిదే.
అయ్యో! కలవడం లేదు కలిసిపోవడం లేదు ఎలా ?అని బాధ పడాల్సిన అవసరం లేదు.రెండింటిలో  ఉపయోగ పడే  ఎన్నో మంచి గుణాలు ఉన్నట్లే వారి వారి ప్రత్యేకమైన సుగుణాలను గౌరవించుకుని జీవనయానం చేయడంలో విజ్ఞత, కలిసిపోయేతనం వుంటుంది.అలా నీళ్ళ మీద నూనె తెప్పలా సూర్య కిరణాలకు ఇంద్రధనుస్సు రంగుల్లో  మెరుస్తూ విడివిడిగా కనబడినా కలివిడిగా హాయిగా ఆనందంగా ఉండొచ్చు.అంతే కదండీ.

కామెంట్‌లు