పరమాచార్యతో భగవాన్;-
ఓమారు కంచిపరమాచార్య తిరువణ్ణామలైకి వెళ్ళినప్పుడు గిరిప్రదక్షిణ చేశారు. ఆయనతో పాటు మరో నలుగురైదుగురు ఉన్నారు. కాస్సేపటికి భగవాన్ రమణమహర్షి శిష్యులు కొందరు బిక్షపాత్రలతో ఎదురొచ్చారు. పరమాచార్యను చూసి వారు నమస్కరించారు.
మేము భగవాన్ శిష్యులం. భగవాన్ ఆశ్రమంలో ఉన్నారని చెప్పారు.
వెంటనే పరమాచార్య అలాగా అంటూ వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి ముందుకు సాగారు.
రమణ మహర్షి భక్తులు ఒకింత జంకుతో నిలబడి వెళ్ళిపోయారు. రమణ మహర్షి గురించి ఆయన క్షేమసమాచారం గురించి పరమాచార్య అడగకపోవడమే కాక తమకు తెలుసన్నట్టు ఎక్కడా మాటల్లో చూపలేదు.
ఆ భక్తులు కొండెక్కి వెళ్ళి శ్రీ రమణ మహర్షికి భిక్షను ఇచ్చి దారిలో పరమాచార్యను కలిసిన విషయాన్ని చెప్పారు. అంతేకాదు, తమ బాధనూ వ్యక్తం చేశారు.
వారి మాటలు విన్న భగవాన్ ఓ చిర్నవ్వు నవ్వారు.
ఒరేయ్ మేమిద్దరం మాట్లాడేసుకున్నాం. ఇప్పుడూ మాట్లాడుకుంటున్నాం. దీనికా మీరు బాధపడుతున్నారు అని అడిగారు.
భగవాన్ భక్తులు నిర్ఘాంతపోయారు.
దీనిని అప్పుడు ప్రత్యక్షంగా చూసిన ఓ ఎనబై ఎనిమిదేళ్ళ స్త్రీ చెప్పడాన్ని ఓ ప్రముఖ రచయిత పూసగుచ్చినట్లు ఓ పుస్తకంలో రాశారు.
పరమాచార్య, భగవాన్ మహాజ్ఞానులు. తపస్సంపన్నులు. వారి మధ్య ఎప్పుడూ ఓ సంభాషణ జరుగుతూనే ఉంటుంది. పాల్ బ్రంటన్ అనే ఆయన ఓ మారు పరమాచార్య వద్దకు ఆధ్యాత్మిక విషయమై మాట్లాడటానికి వెళ్ళారు. అప్పుడు పరమాచార్య ఆయన జ్ఞాన మార్గంలో పోతున్నారు. నేను కర్మ మార్గంలో పోతున్నాను. నీ ప్రశ్నలకు జవాబివ్వగలవారు తిరువణ్ణామలైలో ఉన్నారు. ఆయనను కలుసుకో అన్నారు.
పాల్ బ్రంటన్ ఆ మేరకు రమణ మహర్షిని కలిసి తనకున్న సందేహాలన్నీ అడిగి నివృత్తి చేసుకున్నారు. ఆ క్షణం నుంచీ ఆయన భక్తుడయ్యారు. అంతేకాదు, రమణ మహర్షి గురించి ఓ పుస్తకం కూడా రాసారు. పరమాచార్యకు, భగవాన్ రమణ మహర్షికి పరస్పరం ప్రేమ లేకుంటే ఇది జరిగేనా....ఏదేమైనా పరమాచార్య, భగవాన్ మన దేశానికి లభించిన మహాభాగ్యం.
 

కామెంట్‌లు