సునంద భాషితం;-వురిమళ్ల సునంద, న్యూజెర్సీ, అమెరికా
 న్యాయాలు -518
జల తరంగ న్యాయము
****
జలము అనగా నీరు, ఉదకము. తరంగ అనగా అల,కెరటం అనే అర్థాలు ఉన్నాయి.
నీరూ కెరటము వలె గాలివలన నీరే కెరటాలుగా మారుతుంది.అయితే కెరటాలకు మాధుర్యత్వాది జలధర్మము లన్నియు వుంటాయి అని అర్థము.
మరి సముద్రము అలల గురించి తెలుసుకుందాం... సముద్రములో వీచే అలలు వేరుగా ప్రత్యేకమైన పదార్థాలుగా కనిపిస్తుంటాయి.కానీ తరచి చూస్తే సముద్రములోని నీటికి ఉండాల్సిన లక్షణాలు అన్నీ అలలకు వుంటాయి.
సముద్రమును కవితాత్మకంగా చూస్తే మానవుడి మెదడులోని ఆలోచనలకీ,సముద్ర అలలకు సారూప్యత కనిపిస్తుంది. మనిషి ఆలోచనలు క్షణమైనా ఆగకుండా నిరంతరం వస్తూ పోతూ ఉన్నట్లే  సముద్రములో కెరటాలు లేస్తూ పడుతూ వుంటాయి.
ఆలోచనలు రావడానికి కేంద్ర బిందువు మెదడైతే, కెరటాలు రావడానికి కారణం గాలి.
గాలి వల్ల ఏర్పడే అలలు సముద్రం యొక్క ఉపరితలంపై నీటితో జరిగే ఘర్షణ వల్ల ఒక శక్తి పుడుతుంది.అలా ఘర్షణ వల్ల కెరటాలు ఏర్పడి,ఆ కెరటాల వల్ల నీరు వృత్తాకారంలో కదులుతూ వుండటం వల్ల మనకు అలలు లేస్తూ పడుతూ ఉన్నట్లు కనిపిస్తాయి.
ఈ విధంగా గాలిలోని ప్రతి పొర,గాలి వేగంలోని తేడాల వల్ల ముందుకు, వెనక్కి వత్తిడి జరిగి నీరు కదులుతూ వుంటుంది. అలా కదిలే పడిలేచే నీటినే మనం కెరటం లేదా తరంగం అంటాం ఇలా సముద్రంలోని నీరే తరంగాలుగా మారుతాయి.అంతే కానీ ఎక్కడ నుండో వచ్చి చేరినవి కావు.
ఇక్కడ సముద్రము మనకు కనబడుతుంది.కానీ నామ రూప రహితమైన పరబ్రహ్మ శుద్ధ చైతన్యమైన పరబ్రహ్మం  జగత్తు అంతా పరివ్యాప్తమై వున్నది.ఇలా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం.సృష్టిలోని ప్రతి జీవిలో,ప్రతి వస్తువులో చైతన్య రూపంలో ప్రకాశిస్తోంది.
ఆ విధంగా అవ్యక్త నిర్గుణ పరబ్రహ్మము ప్రపంచ రూపమున పరిణమించి, ప్రపంచమునకు బ్రహ్మ గుణ ధర్మములు సంక్రమించును అనే అర్థంతో ఈ "జల తరంగ న్యాయము"ను ఆధ్యాత్మిక వేత్తలు ఉదాహరణగా చెబుతుంటారు.
దీనిని మనకూ, మనలోని  మనసుకూ అన్వయించుకుంటే ... కంటి కనబడని మన మనసు సంద్రంలా గాలి వంటి కోరికలూ,ఆలోచనా తరంగాలతో ప్రతి క్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటుంది. అలాంటి  వాటి కోరికల ఘర్షణ తగ్గిస్తే కొంత వరకు మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచనలను నియంత్రించలేక పోయినా అలవి కాని, అనవసర కోరికలను నియంత్రించుకునే ప్రయత్నం చేద్దాం.


కామెంట్‌లు