సుప్రభాత కవిత ; -బృంద
తేలుతూ సాగిపోయే
తెలిమబ్బులు ఆపగలవా
తెల్లవారి వెలుగులను?

హాయిగా చల్లగా వీచే
మలయమారుతము ఊగకుండా
ఆపగలదా తలిరాకులను?

రాలే చినుకుల ధారలు
తడపకుండా  ఉండగలదా
తపించిన నేలను?

తెలియని ఆనందపు సిరి
వద్దని ఆపగలదా
పెదవులపై విరిసే నవ్వులను

మార్పును తీసుకుని రాక
ఉంచేనా కదలక అలాగే
కలతలు కమ్మిన కాలం?

కష్టించే కర్మయోగిని
పరీక్షకు గురి చేసాక
వరించక ఆగేనా విజయం?

నభమునకావల వెలిగే
దీపపు బంగరు వెలుగులు
తాకక పోయేనా ఇలను?

సహనపు మార్గము పట్టి
శ్రధ్ధగ చేసే పయనంలో
దొరకక తప్పేనా ప్రతిఫలం?

నడిపే ధైర్యం తోడుగా
నడిచే అడుగుకు నీడగా
నలిగే మనసుకు ఓదార్పుగా

వేంచేసిన వెన్నెలంటి వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు