'శంభో!'శతకపద్యములు ;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 (కందములు ).
==========
91.
త్రిపురా సురులను కాల్చిన
నపశర వైరీ!కపర్థి!యాప్తుడవీవే!
సుపథంబును వేడి నిలిచి
జపములు శ్రద్ధగ సలిపెద సతతము శంభో!//
92.
పాపపు పంకిల మందున
పాపిని బడితిని తెలియక ప్రాజ్ఞత కరువై
నోపిక లేదు శుభంకర!
కాపుగ రావయ!సరగున కాలుడ!శంభో!//
93.
ఇలలో దుష్టులు నుద్ధతిఁ
జెలరేగుచు సాధు హింసఁ జేసిరి శర్వా!
కలియుగ పీడను ధరణికి
తొలగించగ రమ్ము!వేగ దొరవై శంభో!//
94.
కాముకుల రాజ్యమాయెను
నీమము లేని జనులిట నిలిచిరి భద్రా!
ధీమంతుడ వీవె గదా!
తామసులను ద్రోల రమ్ము!దయగొని శంభో!//
95.
ధనమును నమ్మిన వారలు
జనులకు నేతలుగ చెల్గి జగతికి దొరలై
ఘనులుగ నుండిరి శంకర!
కనుగొని దుష్టుల మతులను కాల్చవె శంభో!//

కామెంట్‌లు