సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు -619
బహు వల్లభ న్యాయము
*****
బహు అనగా అధికము, సమృద్ధము, అనేకము, తఱచు ,పెద్ద ,అధికముగా పెద్దగా . వల్లభ అనగా అంటే ప్రేమికుడు, ప్రియుడు, గృహ అధిపతి,భర్త ఉత్తమాశ్వము అనే అర్థాలు ఉన్నాయి.
 ఒక స్త్రీకి ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉండుటను బహు వల్లభ అంటారు.అంటే స్త్రీకి ఒకే సమయంలో ఇద్దరు లేక ఎక్కువ మంది భర్తలను వివాహం ద్వారా కలిగి ఉండటం.
 అయితే ఈ న్యాయానికి ఉదాహరణగా  మహాభారతంలో పాంచాల రాజు కుమార్తె ద్రౌపదిని చెప్పుకోవచ్చు.
 మరి ఈ బహు భర్తల ఆచారం గురించి కొన్ని విషయాలు విశేషాలూ తెలుసుకుందాం.
 మన దేశంలోని  వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.అదే సమాజాన్ని ప్రభావితం చేస్తోంది. వివాహ వ్యవస్థ అనగానే ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు పెద్దల అంగీకారంతోనో ప్రేమతోనో ఒక్కటై కుటుంబ  విలువలు పాటిస్తూ  గడపడం.
అయితే మన దేశంలో ఒకే రకమైన ఆహార అలవాట్లు భిన్న సంస్కృతులు ఆచారాలు సంప్రదాయాలు కలిగిన వారు సమూహాలుగా లేదా గుంపులుగా ఉండే వారు. ఆయా సమూహాలలో వివిధ రకాల వివాహ పద్ధతులు, వాటికి కొన్ని నియమాలు,నిబంధనలు కలిగి వుండేవి.
అయితే  ఈ సమూహాల్లో కొన్ని బయటి సమూహాలతో ఎలాంటి సంబంధం లేకుండా వారి సమూహంలోని వారితోనే వివాహ సంబంధాలు కొనసాగించేవారు. దీనికి సరైన ఉదాహరణ కులం అని చెప్పవచ్చు.ఎందుకంటే ఏ కులము వారు ఆ కులస్థులనే వివాహమాడటం నేటికీ వుంది. ఆ కట్టు తప్పితే కుల లేదా పరువు హత్యలు జరగడం నేటికీ చూస్తున్నాం. ఇలా ఒకే కులస్థులు/ సమూహాలు చేసుకునే వివాహాన్ని "అంతర్వివాహం" అంటారు.
అలా కాకుండా ఒక సమూహం లేదా కులం వారు ఇతర సమూహ లేదా కులానికి చెందిన వారిని వివాహం చేసుకోవడం. అయితే ఇలాంటివి  చాలా అరుదుగా జరుగుతాయి. అలాంటి  వాటిని "బహిర్వివాహాలు" అంటారు. అలా జరిగిన జంటలు ఏటికి ఎదురీదినట్లు జీవితాన్ని కొనసాగించడం కూడా మన సమాజంలో అక్కడక్కడా చూస్తున్నాం.
ఇక వివాహ పద్ధతులలో అయితే  1.ఏక పత్ని వివాహం.2. బహు పత్నీ/బహు భార్యత్వ వివాహం.3.బహు భర్తృత్వ వివాహం  అనే రకాలు ఉన్నాయి.మొదటి రెండు అందరికీ తెలిసినవే .
ఇక మూడో పద్ధతి బహు భర్తలను కలిగి వుండటం . దీనిని ఇంగ్లీషులో పాలీయాండ్రీ అంటారు.పాలీయాండ్రీ అంటే ఒక స్త్రీకి ఒకే సమయంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది భర్తలు కలిగి ఒకే కుటుంబంగా కలిసి  వుంటూ వైవాహిక జీవితాన్ని గడపడం అన్న మాట.
 ఇలాంటి ఆచారంతో  కూడిన కుటుంబాలు మన భారత దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉండటం విశేషం.అయితే ఈ ఆచారం కొత్తగా వచ్చిందేమీ కాదు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. "సోదర బహు భర్తృత్వం." అనగా సోదరులందరూ ఓకే స్త్రీ ని వివాహం చేసుకోవడం.రెండవది "సోదరేతర బహు భర్తృత్వం."అనగా స్త్రీ చేసుకున్న భర్తలు సహోదరులు కాదు.వేర్వేరు కుటుంబాల నుండి వచ్చిన వారై ఉండటం.
 అయితే ఇతిహాసాలలో ఒకటైన మహాభారతంలో ఇలాంటి "సోదర బహు భర్తృత్వాన్ని "చూడొచ్చు. కుంతీదేవి కుమారులైన ఐదుగురు పాండవులను భర్తగా పొందిన ద్రౌపదినే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఆమె అలా ఐదుగురు భర్తలను పొందడానికి  ఓ కారణం ఉంది. ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని కూడా రేఖామాత్రంగా గుర్తు చేసుకుందాం.
ద్రౌపది తండ్రి ద్రుపదుడు నిర్వించిన మత్స్య యంత్ర ఛేదన పోటీలో పాండవ మధ్యముడు అయిన అర్జునుడు విజయం సాధిస్తాడు. పాండవులు తమ నిజ రూపాలను దాచి పెట్టి  బ్రాహ్మణులుగా జీవిస్తున్న సమయం అది. వారు రోజూ  భిక్షకు వెళ్ళి  తెచ్చుకున్న దాన్ని అందరూ సమంగా పంచుకొని తినడం అలవాటు.
ఆ ప్రకారంగా  ద్రౌపదిని చేపట్టిన అర్జునుడు ఆమెతో ఇంటికి వచ్చి తల్లి కుంతీదేవితో "నేను ఈ రోజు భిక్షగా తెచ్చిదాన్ని ఒక్క సారి చూడు" అంటాడు. ఆ  సమయంలో కుంతీదేవి ఏదో పనిలో ఉండటం మూలాన  తెచ్చింది ఏమిటో చూడకుండానే ఎప్పటిలాగే "మీ ఐదుగురు సమంగా పంచుకొండి" అంటుంది.
 అప్పటి కాలంలో తల్లిదండ్రుల ఆజ్ఞను తు చ తప్పకుండా అదొక అత్యున్నత నైతిక విలువగా పాటించేవారు. అందుకే తల్లి చెప్పినట్లు ఆ ఐదుగురు తమ తల్లి ఆజ్ఞను పాటించడం ద్వారా ద్రౌపది ఐదుగురిని భర్తలుగా పొందవలసి వచ్చింది.
మళ్ళీ విషయానికి వద్దాం.  బహు భార్య వివాహానికి కారణం ఆనాటి వారి సమాజంలో స్త్రిల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల అని,లేదా పురుషాధిక్య సమాజంలో వారు ఎంత మందిని వివాహమాడితే అంత గొప్ప అనుకోవడమో,ఆయా రాజ్యాలను జయించి వారి  కుమార్తెలను వివాహం చేసుకోవడంతో బహు భార్యలు ఉండే వారని చరిత్రలో మనం చదువుకున్నాం.
అలాగే "బహు భర్తృత్వం "ఉన్న సమాజంలో స్త్రీల సంఖ్య తక్కువగానూ పురుషుల సంఖ్య ఎక్కువగా ఉండటం ఒక కారణంగా చెబుతున్నారు.ఇది ఎక్కువగా ఆదిమ తెగల్లో కనబడుతుంది.
మన దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల్లో నివసించే తోడాలు, ఉత్తర ప్రదేశ్ లోని భాసాలు వంటి ఆదిమ తెగల్లోనూ ఈ ఆచారం కొనసాగుతోంది.అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ తెగల వారు,గర్హ్వాలీ ప్రజలు పాండవుల వారసులమని, వారు తమ పూర్వీకులనీ, వారి సంతతి చెందిన వారమంటూ బహు భర్తృత్వం పాటిస్తున్నారని పరిశోధకుల పరిశోధనలో తేలింది. అలాగే పంజాబ్ లో మాన్సా,ఫతేఘర్, సాహిబ్ జిల్లాలలో కూడా భార్యను పంచుకునే పద్దతి  ఉందని తెలిసింది.
ఇలాంటి "బహు వల్లభ న్యాయము"  ఆచారంగా రావడానికి కారణం వారు సంపాదించుకున్న భూమి విభజన కాకుండా ఉండేందుకు,కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కలిసి ఉండేందుకు అలాంటి ఆచారం కొనసాగుతోందని తెలిసింది.
 మరి ఈ న్యాయము గురించి చర్చించుకోవడం అంత అవసరమా అని అనిపించవచ్చు కానీ  పెద్దలు చెప్పే  ప్రతి న్యాయములో ఏదో ఒక అంతరార్థం ఉండి తీరుతుంది.
 మరి ఇందులో ఉన్న  విషయం ఏమిటంటే బహు భార్యత్వం,బహు భర్తృత్వం రెండూ నేటి సమాజానికి అస్సలు పనికి రానివనీ ఈ రెండింటిలోనూ నష్టపోయేదీ,నలిగిపోయేది స్త్రీ నేనని,ఆ స్త్రీ మానసికంగా శారీరకంగా ఎంతో వేదన అనుభవించాల్సి వస్తుందనీ, అలాంటి ఆచారాలు మన దృష్టిలోకి వచ్చినట్లయితే వెంటనే ఆ ఆచారాన్ని  తొలగించేందుకు మన వంతు కృషి చేయాలని అర్థము.
ఇదండీ సంగతి! ఈ బహు వల్లభ న్యాయము వల్ల దానికి సంబంధించిన ఆచార వ్యవహారాలూ మంచి చెడులు తెలుకోగలిగాం.

కామెంట్‌లు
Popular posts