జననం తో మొదలయే
జీవనయానంలో ...
గడచిన నిన్నల జ్ఞాపకాలు
నడిచిన బాటల దారులు...
అమాయకత్వంతో బాల్యం
కుతూహలంతో యౌవనం
అయోమయంతో సంసారం
ఎపుడు సాగిపోయేనో!!
తెరవెనుకకు మరలిన
కనులు కన్న కలలు..
పొరలుగా పేరుకున్న
తీరక మిగిలిన ఆశలు....
భాధ్యతల మధ్య బందీలై
బరువుగా మారిన కాలం
తీరకనే మాసిపోయిన
కోరికలపై మమతలు....
అనుకోని ఆనందాల కౌగిలిలో
అన్నీ మరచిన జీవితంలో
అనుభవించిన క్షణాలే
అందుకున్న శిఖరాలు....
మనదంటూ సమయమూ
మనకంటూ ఇష్టమూ..
మనకోసం గుండెగదిలో
దాచుకున్న వ్యాపకం.....
మనచేతికి దొరికే తరుణం
మొదలయే జీవిత చరమాంకం
బంధాలపై మోహం తగ్గించి
సాగించే అసలైన పయనం ..
ప్రతి ఉదయం అవకాశంగా
ప్రతి క్షణం అపురూపంగా
ప్రతిదినం మహదానందంగా
ప్రతిహృదయం భావించే
పండుగలా వచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి