చేసిన మేలు మరవకు: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

ఒకూర్లో ఒక రైతు వుండేటోడు. ఆయన చానా పేదోడు. కానీ చానా మంచోడు. ఎవరైనా సరే ఆపదలో వుంటే చేతనైన సాయం చేసేటోడే గానీ కాదు లేదు అనేటోడు కాదు. 
ఒకసారి ఆ ఊర్లో పెద్ద కరువు వచ్చింది. వానలు అస్సలు పడలేదు. దాంతో పంటలు లేక, పైసలు రాక ఆ రైతు ఏదయినా పని దొరుకుతుందేమోనని దూరంగా వున్న వాళ్ళ అత్తోళ్ళ ఊరికి బైలుదేరినాడు. దారిలో పెద్ద అడవి వుంది. ఆ అడవిలో పోతా వుంటే ఒకచోట ఒక పాడుబడిన బావిలోంచి “కాపాడండి... కాపాడండి” అంటూ అరుపులు వినబన్నాయి. “ఎవరబ్బా లోపల” అనుకుంటా ఆ రైతు వచ్చి తొంగి చూసినాడు. దానిలో ఒక నాగుపాము, పులి, మనిషి కనబన్నారు. బావిలో నీళ్ళు మరీ ఎక్కువగా లేవు. తక్కువగా లేవు. నడుముల దాకా వున్నాయి. 
కానీ పైకి రావడం చానా కష్టం. చుట్టూ గోడలు నున్నగా ఎత్తుగా పాచిబట్టి చేయి పెడితే జారిపోయేటట్లుగా వున్నాయి.
అంతలో పులి "ఓ మనిషి మామా... మనిషి మామా... నన్ను కాపాడవా... ఇప్పటికి పది రోజులైంది లోపల పడి. తినడానికి తిండి లేక ఇంకో గంటకో అరగంటకో చచ్చేటట్టున్నా” అనింది. దానికా రైతు “అబ్బా... నిన్నా... నువ్వసలే అడవి జంతువువి.
దానికితోడు మాంచి ఆకలి మీద వున్నావు. పైకి రాగానే నన్ను చంపేస్తే” అన్నాడు భయం భయంగా.
దానికా పులి “ఏంది మామా... అంత మాటంటావు. మాట తప్పడానికి మేమేమైనా మనుషులమా... కన్నతల్లిని, వున్న ఊరిని, చిన్ననాటి స్నేహితున్ని, ప్రాణాలు కాపాడిన జీవిని ఎవరైనా మరచిపోతారా” అనింది. సరేనని ఆ రైతు అక్కడ వున్న ఒక పెద్ద మర్రిచెట్టు వూడలు ఒకదానితో ఒకటి తాడులెక్క పేని లోపలికి ఇడిచినాడు. పులి దాన్ని గట్టిగా పట్టుకోగానే బలమంతా వుపయోగించి పైకి లాగినాడు. 
పులి బైటకు వచ్చి సంబరంగా "మనిషిమామా... నీ మేలు ఎన్నటికీ మరిచిపోను. నీవు ఆపదలో వున్నప్పుడు నన్ను తలచుకో. నా చేతనైన సాయం చేస్తాను. కానీ ఒక్కమాట. ఆ మనిషిని మాత్రం కాపాడొద్దు. వాడు అంత మంచోడు కాదు” అని చెప్పి వెళ్ళిపోయింది.
అంతలో బావిలో నుంచి పాము "ఓ మనిషి బావా... మనిషి బావా... నన్ను కాపాడవా... ఇప్పటికి వారం రోజులైంది లోపలపడి. నన్ను తీయడం గూడా చాలా సులభం. ఏం పెద్ద బరువుండను” అనింది.
దానికా రైతు “అమ్మో... నిన్నా... నువ్వసలే విషపు జీవివి. బైటకు రాగానే నన్ను కాటేస్తే” అన్నాడు భయంభయంగా. దానికాపాము "ఏంది బావా... అంత మాటంటావు. ఏదో చావు భయంతో మమ్మల్ని మేము కాపాడుకోడానికి కాటేస్తాం గానీ వూకూకెనే కారణం లేకుండా చంపడానికి మేమేమన్నా మనుషులమా” అనింది.
ఆ మాటలకు రైతు సరేనని మరలా తాడు లోపలికి ఇడిచినాడు. పాము దానికి చుట్టుకొని పైకి వచ్చింది. అది సంబరంగా “నీ మేలు ఎన్నటికీ మరచిపోను. నీవు ఆపదలో వున్నప్పుడు నన్ను తలచుకో. చేతనైన సాయం చేస్తాను. కానీ ఒక్కమాట. ఆ మనిషిని మాత్రం కాపాడొద్దు. మాకు కోరల్లోనే విషం వుంటాది. కానీ వానికి నిలువెల్లా విషమే...
జాగ్రత్త” అని చెప్పి వెళ్ళిపోయింది. 
దాంతో రైతు వాన్ని కాపాడాలా వద్దా అని ఆలోచనలో పడినాడు. 
అంతలో ఆ మనిషి “అనా... అనా... అడవి జంతువును, విషపు జీవిని కాపాడి సాటి మనిషిని కాపాడడానికి ఏం అంతగా ఆలోచిస్తా వున్నావు. ఇప్పటికే లోపల పడి నాలుగు రోజులైంది. నోరు తెరిచి అడిగితే పగవాడికైనా సరే చేయందించాలే తప్ప వెన్ను చూపగూడదు అంటారు పెద్దలు. అటువంటిది నీకూ నాకూ మధ్య అసలు ఎటువంటి గొడవలూ లేవు గదా” అన్నాడు.
దానికా రైతు "అయ్యయ్యో... నేనందుకు ఆలోచించడం లేదు. కాస్త లావుగా వున్నావు గదా... ఈ వూడలు సరిపోతాయా... ఇంకొంచం లావుది పేనాలా అని ఆలోచిస్తా వున్నా... అంతే... ఐనా ఆపదలో వున్న సాటి మనిషికి సాయం చేయలేని బదుకూ ఒక బదుకేనా” అంటూ మరికొన్ని వూడలు పట్టుకోనొచ్చి లావుగా పేని దానిని బావిలోనికి వదిలినాడు. దాంతో అతను తాడు పట్టుకొని నెమ్మదిగా బైటకి వచ్చినాడు.
ఆ మనిషి సంతోషంతో “నీ మేలు ఎన్నటికీ మరచిపోలేను. నీళ్ళు దాహమేస్తా వుంటే చెంబుకు తాడుకట్టి లోపలికి వదుల్తా కాలు జారి లోపల పడినా. మూడు రోజుల నుండీ ఇటువైపు వచ్చినోడే లేడు. బతుకు పైన ఆశలు వదిలేసుకున్నా. దేవుడే నిన్ను పంపించినాడు. నేను ఈ పక్కనే వున్న గ్రామానికి అధికారిని. నీకేమయినా సాయం కావాలంటే తప్పకుండా రా” అని చెప్పి వెళ్ళిపోయినాడు.
రైతు తిరిగి నడవడం మొదలు పెట్టినాడు. తరువాత రోజుకల్లా వాళ్ళ అత్తోళ్ళ వూరికి చేరుకున్నాడు. ఆడ గూడా పనులు పెద్దగా లేవు. ఒక రోజు తింటే మరొక రోజు పస్తే. అట్లా ఒక నాలుగు నెల్లు గడిచిపోయినాయి. ఇక లాభం లేదు అనుకోని తిరిగి వూరికి బైలుదేరినాడు. 
అట్లా పోతా వుంటే అడవిలో తాను కాపాడిన పులి గుర్తుకు వచ్చింది. అది ఎట్లావుందో చూద్దామని దాన్ని పిలిచినాడు గట్టిగా. ఆ పిలుపుకు అడవిలో యాడనో వున్న పులి పరుగు పరుగున వచ్చింది. రైతును ఇంటికి తీసుకోని పోయి కడుపు నిండా కావాల్సినవన్నీ పెట్టింది. తిరిగి పోయేటప్పుడు ఒక విలువైన వజ్రాల హారం తీసుకోనొచ్చి “అడవిలో ఆహారం కోసం ఒక దొంగను చంపినప్పుడు వాని దగ్గర ఇది దొరికింది. దీన్ని అమ్ముకోని ఆనందంగా బతుకు” అంటూ చేతిలో పెట్టింది.
రైతు సంబరంగా దాన్ని తీసుకోని బైలుదేరినాడు. అంత విలువైన హారాన్ని ఎక్కడ అమ్మాలో, ఎవరికి అమ్మాలో తెలీలేదు. అంతలో తాను కాపాడిన మనిషి గుర్తుకు వచ్చినాడు. దాంతో అతని దగ్గరికి పోయినాడు. 
అతను ఆ గ్రామానికి అధికారి. రైతును చూడగానే సంబరంగా ఇంటికి పిలుచుకొని పోయి మంచిగా మర్యాదలు చేసినాడు. రైతు ఆ రోజు రాత్రి ఎవరూ లేని సమయంలో తన జేబులోని హారాన్ని తీసి గ్రామాధికారికిచ్చి జరిగిందంతా చెప్పి అమ్మి పెట్టమన్నాడు.
గ్రామాధికారి ఆ హారాన్ని చూడగానే అదిరిపడినాడు. అది మామూలు హారం కాదు. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు తరతరాల నుంచీ వస్తావున్న ఎంతో విలువైన హారమది. అదంటే రాజుకు ప్రాణం. తాను పూజించే దేవత మెడలో అలంకరించి రోజూ పూజలు చేసేవాడు. అలాంటి హారం పోవడంతో మహారాజు “ఎవరైతే ఆ దొంగను పట్టి, హారాన్ని తిరిగి అప్పగిస్తారో వారికి నిలువెత్తు బంగారం,
కోరిన పదవి ఇస్తానని” దండోరా వేయించినాడు.
గ్రామాధికారికి ఆ హారాన్ని చూడగానే బంగారం మీద, పదవి మీద మోజు పుట్టింది. దాంతో జరిగిందేమీ ఆ రైతుకు చెప్పకుండా "సరే... ఈ హారం నీ వద్దనే వుంచుకో. మా రాజుకు ఇలాంటివంటే చానా ఇష్టం. ఇంత విలువైనవి ఆయన తప్ప ఎవరూ కొనలేరు. రేపు రాజు దగ్గరికి తీసుకోని పోతా. ఆయన అడిగితే “ఇది నాదే. మాతాత ముత్తాతల నుంచి వస్తావుంది. కాలం బాగాలేక అమ్ముతా వున్నా” అని చెప్పు అన్నాడు.
గ్రామాధికారి తరువాత రోజు పొద్దున్నే రాజు దగ్గరికి పోయి “రాజా... నీ హారాన్ని దొంగిలించిన దొంగ దొరికినాడు. నిన్న నావద్దకు వచ్చి దాన్ని అమ్మజూపినాడు. వానికి మాయమాటలు చెప్పి రేపు నీ వద్దకు తీసుకోనొస్తా” అన్నాడు. రాజు 'సరే' అన్నాడు.
తరువాత రోజు గ్రామాధికారి రైతును రాజు దగ్గరికి తీసుకపోయినాడు. రాజు ఆ హారం చూసి “ఇది ఎవరిది, నీకు ఎక్కన్నుంచి వచ్చింది” అనడిగినాడు.
దానికా రైతు “రాజా! ఇది నాదే. మా తాత ముత్తాతల నుంచి తరతరాలుగా వస్తా వుంది. కాలం బాగాలేక అమ్ముతా వున్నా” అన్నాడు. 
వెంటనే రాజు కోపంగా “ఏరా... నా హారం ఎత్తుకోని పోయింది గాక మళ్ళా నాకే అబద్దాలు చెప్పి అమ్మజూపుతున్నావా... నేనంత తిక్కలోని మాదిరి కనిపిస్తా వున్నానా” అంటూ సైనికులను పిలిపించి “రేయ్... వీన్ని తీసుకోని పోయి చెరశాలలో బంధించి రేపు సాయంకాలం ఊరందరి ముందు ఉరి వేయండి” అన్నాడు. 
ఆ మాటలకు రైతు లబోదిబోమన్నాడు. “రాజా... నన్ను వదిలేయండి. నేను దొంగను కాను” అంటూ జరిగిందంతా చెప్పినాడు. కానీ రాజు వాని మాటలు నమ్మలేదు. సైనికులు రైతును తీసుకోని పోయినారు. రాజు గ్రామాధికారికి నిలువెత్తు బంగారమిచ్చి, ఒక సామంత రాజ్యానికి రాజును చేసినాడు.
రైతుకు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. ఇంకొక్క రోజు దాటితే చావడం ఖాయం. ఎట్లాగబ్బా తప్పించుకోవడం అని ఆలోచిస్తా వుంటే పాము గుర్తుకు వచ్చింది. దానిని తలచుకున్నాడు. 
అంతే... అది నిమిషాల్లో వాని ముందుకు వచ్చింది. జరిగిందంతా విని “అందుకే నేను ముందే చెప్పాను. వాడు అంత మంచోడు కాదని. సరే జరిగిందేదో జరిగింది. బైట పడే ఉపాయం చెప్తా విను” అంటూ ఏం చేయాల్నో చెప్పింది. రైతు సరేనంటూ అదిచ్చిన మూలిక తీసుకోని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు.
ఆ నాగుపాము నెమ్మదిగా ఎవరికీ కనబడకుండా రాణి వుండే గదిలోనికి పోయింది. పన్నుకున్న రాణి కాలి మీద పూర్తిగా లోనికి దిగకుండా ఒక్కేటు వేసింది. అంతే ఆ నొప్పికి రాణి అదిరిపడి లేచి “పాము... పాము...” అంటూ గట్టిగా అరవసాగింది. భటులు లోపలికి వచ్చేసరికి పాము కనబడకుండా పారిపోయింది.
పాము కాటేసిన కాసేపటికే రాణి నురగలు కక్కుకుంటా పడిపోయింది. నొప్పితో విలవిలలాడసాగింది. రాజు రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించినాడు. ఎవరు ఎన్ని మందులు వాడినా ఆమె నొప్పి కొంచంగూడా తగ్గలేదు. 
ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తా వుంటే రైతు భటులతో "నాకు రాణికి విషం ఎట్లా తగ్గించాల్నో తెలుసు. ఒక అవకాశం ఇవ్వమని రాజుకు చెప్పండి” అన్నాడు. వాళ్లు సరే అని విషయం రాజుకు చెప్పినారు. 
"సరే... ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు” అనుకుంటా రాజు రైతును పిలిపించినాడు. రైతు పాము ఇచ్చిన మూలిక తీసుకోనొచ్చి దాన్ని అరగదీసి కాటు వేసిన చోట పూసి కట్టుకట్టినాడు. కాసేపటికి నొప్పి తగ్గిపోయి ఆమె మామూలుగైపోయింది. అది చూసి రాజు చానా సంబరపడినాడు.
అప్పుడా రైతు “రాజా! నేను అబద్ధం చెప్పడం లేదు. అంతా నిజమే చెబుతా వున్నాను. నాకా హారం ఇచ్చింది పులే. కాకపోతే గ్రామాధికారి ఆ విషయం చెప్పొద్దు అనడంతో అలా చెప్పాను” అన్నాడు. దానికి రాజు “నీవు చెబుతా వున్నది నిజమే అని నేను ఎలా నమ్మాలి” అన్నాడు. అంతలో రాజ్యమంతా పులుల గర్జనలతో దద్దరిల్లి పోసాగింది. జనాలంతా భయపడి ఇళ్ళూ వాకిళ్ళూ ఎక్కడివక్కడ వదిలేసి పారిపోసాగినారు. అంతలో సైనికులు వురుక్కుంటా వచ్చి “రాజా! ఎక్కడెక్కడి పులులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి రాజ్యం మీద పడినాయి. మా జన్మలో ఎప్పుడూ
అన్ని పులులను చూడలేదు. వాటిని ఏం చేయాలో తోచడం లేదు” అని చెప్పినారు.
రాజు ఆ మాటలకు ఆచ్చర్యపోయినాడు. 
అంతలో అక్కడికి రైతు కాపాడిన పులి వచ్చింది. రైతును చూసి “నువ్వేం భయపడొద్దు. నేనిచ్చిన హారం వల్లనే కదా నువ్వు చిక్కుల్లో పడింది. అందుకే నిన్ను కాపాడ్డానికి మా వాళ్ళందరినీ తీసుకోనొచ్చా” అని చెప్పింది.
రాజు పులి ద్వారా జరిగిందంతా మరొక్కసారి తెలుసుకొని రైతును విడిచిపెట్టినాడు. రాజు తానిచ్చిన మాట ప్రకారం రైతుకు నిలువెత్తు బంగారం ఇచ్చి, వాళ్ళ గ్రామానికి అధికారిని చేసినాడు. పులి వాన్ని తన మీద ఎక్కించుకోని తిరిగి వాళ్ల ఊరిలో విడిచి పెట్టడానికి మిగతా పులలతో సంబరంగా బైలుదేరింది. నమ్మించి మోసం చేసినందుకు ఆ గ్రామాధికారిని పిలిపించి అందరి ముందు వంద కొరడా దెబ్బలు కొట్టించి, “ఇంకెప్పుడూ నా రాజ్యంలో కనబడొద్దు” అంటూ కట్టుబట్టలతో ఊరి పొలిమేరల వరకు తరిమి తరిమి కొట్టించినాడు.
*********** 
కామెంట్‌లు